చిత్రసీమలో తీవ్ర విషాదం: సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:06 PM
సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనారోగ్యంతో చెన్నయ్‌లో తుది శ్వాస విడిచారు.
ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన చివరిసారిగా దర్శకత్వం వహించిన 'సింగ్ గీతం' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాను నాగ అశ్విన్ నిర్మించారు. 94 సంవత్సరాల వయసులో దర్శకత్వం వహించిన తొలి భారతీయ దర్శకుడిగా ఆయన రికార్డ్ సృష్టించారు.
1932లో మొదటి తెలుగు సినిమా పుట్టింది. దానికి ఒక సంవత్సరం ముందు సెప్టెంబర్ 21వ తేదీన సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. నాటక రంగంలో తొలుత అరంగేట్రం సాగించి, చిత్రసీమలో స్థిరమైన-ఉన్నతమైన దర్శక స్థానాన్ని పొందిన వ్యక్తి శ్రీనివాసరావు . ఆదిలో భారతి, స్వతంత్ర-పత్రికల్లో కథలు, స్కెచ్ లు రాశారు. 'భ్రమ, అంత్యఘట్టం, చిత్రార్జున' వంటి నాటక రచనలు చేసి రచయితగా నిలదొక్కుకున్నారు. వీటన్నిటికీ పలు నాటకోత్సవాల్లో బహుమతులు గెలుచుకోవటమే కాక అనేక పర్యాయాలు ప్రదర్శితమైన ఖ్యాతి సంపాదించారు. ముఖ్యంగా చిత్రార్జునలో ప్రధానపాత్రను శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి ధరించింది. నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలో ప్రదర్శించి ప్రశంసలు పొందిన నాటకం ఇది. ఆంగ్లంలో తర్జుమా అయి అమెరికాలో ప్రదర్శితమైంది. ఈ కాలంలోనే శ్రీనివాసరావు ప్రముఖ కవి-నాటక ప్రదర్శకులూ అయిన హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 21 సెప్టెంబరు 1931 లో జన్మించిన సింగీతం, గూడూరు, నెల్లూరు, మద్రాసులలో విద్యాభ్యాసం చేసి సైన్సు డిగ్రీ సంపాదించారు. అధ్యాపక వృత్తితో జీవితం ఆరంభించిన ఆయన ఆ తర్వాత కాలంలో ఉత్తమ తెలుగు దర్శకులుగా స్థిరపడ్డారు. ప్రఖ్యాత దర్శకులు కె.వి. రెడ్డి దగ్గర 'దొంగరాముడు, మాయాబజార్' చిత్రాలకు సహాయకుడిగా 1954లో చిత్రరంగ ప్రవేశం చేశారు. తర్వాత దర్శక స్థానం అందుకున్నారు. ఆపైన ఎన్నో చిత్రాలకు దర్శక బాధ్యతలను నిర్వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీషు చిత్రాలెన్నిటికో దర్శకులయ్యారు. దాదాపు చాలా చిత్రాలు విజయవంతంగా శతదినోత్సవాలు జరుపుకున్నాయి.
సంస్కార (కన్నడం), తరం మారింది, పుష్పక విమానం (మాటలే లేని చిత్రం), అపూర్వసహోదరగళ్, ఆదిత్య 369, మయూరి, భైరవద్వీపం వంటి పలు ఉత్తమ చిత్రాలు సింగీతం రాష్ట్రపతి పతకాలూ, నంది అవార్డులూ, ఎల్.వి. ప్రసాద్ అవార్డుల వంటి ఉన్నతమైన ప్రతిష్ఠాత్మక బహుమానాలు పొందారు. వీరికి సరికొత్త ప్రయోగాలంటే ఇష్టం. కన్నడ కంఠీరవ డా. రాజకుమార్ నటించిన కన్నడ చిత్రాలకు సంగీత దర్శకత్వం నిర్వహించారు. ప్రయోగాత్మక యానిమేషన్ చిత్రాలు కూడా చేశారు. కర్నాటక జర్నలిస్టుల సంఘం శ్రీనివాసరావు గారి జీవిత చరిత్రను గ్రంథ రూపంలో వెలువరించటం వీరికే దక్కిన ప్రత్యేక గౌరవం. ఆయన చివరగా దర్శకత్వం వహించిన 'సింగ్ గీతం' చిత్రం ఈ యేడాది జూన్ 12న విడుదలైంది.