‘సింగ్ గీతం’ విడుదల తేదీలో మార్పు.. ఎప్పుడంటే?
ABN , Publish Date - Jun 09 , 2026 | 09:43 PM
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్‌ల కాంబోలో రాబోతోన్న ‘సింగ్ గీతం’ చిత్రం వాయిదా పడింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao), క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)ల కాంబోలో రాబోతోన్న ‘సింగ్ గీతం’ (Sing Geetham) చిత్రం వాయిదా పడింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. వాయిదా అనగానే ఒక వారానికో, నెలకో కాదు.. కేవలం ఒక్క రోజు ఆలస్యంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. అవును, చెప్పిన తేదీకి ఒక రోజు ఆలస్యంగా ఈ సినిమా విడుదల కాబోతోందని మేకర్స్ తెలియజేశారు. తొలుత జూన్ 11న విడుదల కావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు జూన్ 12కి వాయిదా పడింది. దీనికి కారణం ఏమిటో కూడా మేకర్స్ తెలియజేశారు.
కథలో కీలక పాత్ర పోషించే కొన్ని ముఖ్యమైన సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ పనులను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘సింగ్ గీతం’ ఒక ఫాంటసీ, సూపర్‌నేచురల్ ప్రపంచాన్ని ఆవిష్కరించే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సంగీతంతో పాటు విజువల్స్ కూడా కథనంలో అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రేక్షకులను ఆ ప్రపంచంలో పూర్తిగా లీనం చేసే అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో, చిత్ర బృందం ఫైనల్ అవుట్‌పుట్‌ను మరింత పర్ఫెక్ట్ చేయడానికి అదనపు సమయం కేటాయిస్తోంది. థియేటర్లలోకి తొందరపడి తీసుకురావడం కంటే అత్యుత్తమ నాణ్యతతో అందించాలనే ఆలోచనతోనే ఈ ఒకరోజు వాయిదా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం మెయిన్ హైలెట్స్‌గా నిలవనున్నాయని ఇప్పటికే జరిగిన ప్రమోషన్స్‌లో మేకర్స్ ప్రకటించారు. ఫైనల్‌గా.. సింగీతం మ్యాజిక్ కోసం మరొక రోజు అదనంగా వెయిట్ చేయకతప్పదన్నమాట.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!
మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు