రామాయణం టు శ్రీమద్భాగవతం.. భారీ సినిమాటిక్ యూనివర్స్‌కు సాగర్ పిక్చర్స్ శ్రీకారం

ABN , Publish Date - Sep 11 , 2026 | 07:40 PM

భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన పురాణ గాథలకు మరోసారి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సరికొత్త రూపం ఇవ్వబోతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

Shrimad Bhagavatam Part 1 Vishnurata

భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన పురాణ గాథలకు మరోసారి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సరికొత్త రూపం ఇవ్వబోతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఒకప్పుడు దివంగత దిగ్గజ దర్శకుడు డాక్టర్ రామానంద్ సాగర్ దర్శకత్వంలో వచ్చిన ‘రామాయణ్’, ఆ తర్వాత వచ్చిన ‘శ్రీ కృష్ణ’ వంటి క్లాసిక్ ధారావాహికలు భారతీయ టెలివిజన్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన సంగతి తెలిసిందే. కేవలం టీవీ షోలుగానే కాకుండా కోట్లాది మంది భారతీయ కుటుంబాల సాంస్కృతిక జ్ఞాపకాల్లో అవి భాగమయ్యాయి. ఇప్పుడు అదే పవిత్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని వెండితెరపై మునుపెన్నడూ చూడని రీతిలో ఆవిష్కరించేందుకు సాగర్ కుటుంబం సిద్ధమవుతోంది.


ఈ క్రమంలో ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ (Shrimad Bhagavatam Part 1 Vishnurata) పేరుతో అత్యంత భారీ బడ్జెట్‌తో కూడిన లైవ్-యాక్షన్ సినిమాటిక్ సాగాను అధికారికంగా ప్రకటించారు. శ్రీమద్భాగవత మహాపురాణం విస్తృతమైన కథా ప్రపంచాన్ని, అనేక దివ్య పాత్రలను, లోతైన భక్తి తత్వాన్ని కలిగి ఉన్న మహా గ్రంథం. ఇంతటి అనంతమైన పౌరాణిక ప్రపంచాన్ని ఒకే సినిమాలో కుదించడం అసాధ్యం కాబట్టి.. దీనిని ఏకంగా ఏడు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించారు. దీని ద్వారా భారతీయ పురాణ కథనాన్ని ఒక భారీ సినిమాటిక్ యూనివర్స్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడు భాగాల మహా ప్రయాణానికి ‘విష్ణురథ’ తొలి అధ్యాయంగా నిలవనుంది. ఒక్కో భాగం ద్వారా కథా విస్తృతిని పెంచుతూ, పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ ప్రేక్షకులను సరికొత్త సినిమాటిక్ అనుభూతిలో ముంచెత్తనున్నారు.


ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించే బాధ్యతను రామానంద్ సాగర్ మనవళ్లు ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ స్వీకరించి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. అమృత్ సాగర్ గతంలో దర్శకత్వం వహించిన యుద్ధ చిత్రం ‘1971’ హిందీ విభాగంలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. అటు టెలివిజన్, ఇటు వెండితెర అనుభవం ఉన్న ఈ సోదరులిద్దరూ ఆధునిక సినీ దృష్టికోణంతో ఈ భారీ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర ముహూర్త కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రస్తుతం అక్కడే వేసిన భారీ సెట్లలో అత్యున్నత నిర్మాణ విలువలతో కూడిన లైవ్-యాక్షన్ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రధాన బలం అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణుల భాగస్వామ్యం. హాలీవుడ్ విజువల్ వండర్స్ ‘లైఫ్ ఆఫ్ పై’, ‘ది జంగిల్ బుక్’, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టులకు పనిచేసిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ నిపుణుడు క్లైడ్ ఎడ్వర్డ్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అయితే కేవలం విజువల్ ఎఫెక్ట్స్‌కే పరిమితం కాకుండా, భారతీయ మూలాలకు చెందిన కథలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరిమళాలను యథాతథంగా కాపాడుతూ నేటి ఆధునిక తరానికి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడమే తమ లక్ష్యమని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ‘విష్ణురథ’ ఫస్ట్ లుక్‌తో పాటు నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు. సాంస్కృతిక వారసత్వం, ఆధునిక సాంకేతికతల కలయికతో రానున్న ‘శ్రీమద్భాగవతం’ భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

స్టార్ హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తా.. నన్నిలా కనెక్ట్ అవ్వొచ్చు: ఉదయభాను

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత..’ సాంగ్ రిలీజ్.. ఎలా ఉందంటే

వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్‌లో నో ఛేంజ్

Updated Date - Sep 11 , 2026 | 07:41 PM