స్టార్ హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తా.. నన్నిలా కనెక్ట్ అవ్వొచ్చు: ఉదయభాను

ABN , Publish Date - Sep 11 , 2026 | 07:02 PM

తెలుగు బుల్లితెరపై తనదైన గ్లామర్, వాక్చాతుర్యంతో ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న ఉదయభాను ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు.

Udayabhanu Comments

తెలుగు బుల్లితెరపై తనదైన గ్లామర్, వాక్చాతుర్యంతో ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న ఉదయభాను (Udayabhanu) ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా కేవలం 12 ఏళ్ల చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగిన ఆమె.. దాదాపు 15 ఏళ్లుగా కన్న కలను నెరవేర్చుకుంటూ నిర్మాతగా మారారు. ఆమె నిర్మాణంలో రూపొందిన తొలి వెబ్ సిరీస్ ‘పంచనామా’ (Panchanama) విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్వహించిన ప్రచార వేడుకలో ఉదయభాను మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆమె ఓపెన్‌గా సమాధానాలిచ్చారు.


నిర్మాతగా కొత్త ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తున్న క్రమంలో సరికొత్త ప్రతిభను ఎంకరేజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఉదయభాను స్పష్టం చేశారు. ‘‘నా ఇన్‌స్టాగ్రామ్ పేజీని నేనే స్వయంగా హ్యాండిల్ చేస్తాను, నా భర్త కూడా చూసుకుంటారు. నాతో పనిచేయాలనుకునే కొత్త దర్శకులు, రచయితలు, నటీనటులు ఎవరైనా సరే నన్ను నేరుగా నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించవచ్చు. ఇప్పటికే చాలామంది నన్ను అలా కనెక్ట్ అయ్యారు, మంచి కాన్సెప్ట్‌లు ఉంటే చర్చించడానికి నేను ఎప్పుడూ ముందుంటాను’’ అని టాలెంట్‌కు ఆహ్వానం పలికారు.


ఇక భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి చెబుతూ.. దేవుడు కరుణిస్తే రాబోయే రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోలతో కూడా భారీ చిత్రాలను నిర్మిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ‘‘నాకు ఇండస్ట్రీలోని హీరోలందరూ ఇష్టమే. కానీ మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అంటే నాకు ప్రాణం. నిర్మాతగా నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇకపై వరుస సినిమాలు, సరికొత్త ప్రాజెక్ట్‌లతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాను’’ అని ఉదయభాను స్పష్టం చేశారు. యాంకర్‌గా మురిపించిన ఉదయభాను నిర్మాతగా కూడా సక్సెస్ సాధించాలని అభిమానులు, సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత..’ సాంగ్ రిలీజ్.. ఎలా ఉందంటే

వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్‌లో నో ఛేంజ్

కొరటాల రిక్వెస్ట్.. బాలయ్య యాక్సెప్ట్.. ఇక దబిడి దిబిడే!

Updated Date - Sep 11 , 2026 | 07:02 PM