శర్వాకు భోగి పరీక్ష
ABN, Publish Date - Nov 26 , 2026 | 05:27 PM
చాలా ఏళ్ళ తరువాత శర్వానంద్ ఒకే యేడాది మూడు సినిమాల్లో నటించారు. ఈ ఏడాది శర్వా మూడో సినిమాగా వస్తున్న 'భోగి'పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాతో శర్వానంద్ మురిపిస్తాడా? లేదా? అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
శర్వానంద్ కు ఈ యేడాది ఓ స్పెషల్ అనే చెప్పాలి. ఇప్పటికే సంక్రాంతి సీజన్ లో 'నారీ నారీ నడుమ మురారి'గా అలరించారు. తరువాత వేసవిలో 'బైకర్'గా మురిపించారు. రాబోయే 'భోగి' సినిమాలో బ్రదర్ సెంటిమెంట్ పండించనున్నారు శర్వానంద్. అందువల్ల ఈ సినిమా కూడా ఆకట్టుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఇలా ఒకే సంవత్సరం మూడు చిత్రాలతో శర్వానంద్ ఇంతకు ముందు 2017లోనూ సాగారు. అప్పట్లో సంక్రాంతికి వచ్చిన 'శతమానంభవతి' బంపర్ హిట్ గా నిలచింది. ఇప్పటికీ శర్వానంద్ కెరీర్ లో అదే బిగ్ హిట్ అని చెప్పొచ్చు. ఆ తరువాత ఆ యేడాది "రాధ, మహానుభావుడు" చిత్రాలు వచ్చినా అంతగా మురిపించలేక పోయాయి. అందువల్ల రాబోయే 'భోగి'పై సినీజనాల్లో ఆసక్తి చోటు చేసుకుంది.
శర్వానంద్ కెరీర్ ఆరంభంలో రెండుసార్లు ఏడాదికి మూడు చిత్రాల్లో కనిపించారు. కానీ, అప్పట్లో ఇతర హీరోల సినిమాల్లో కీ రోల్స్ లో కనిపించారే తప్ప హీరోగా ఒకే సంవత్సరం మూడు చిత్రాలతో సందడి చేసింది 2017లోనే. మళ్ళీ ఈ యేడాది అదే తీరున సాగారు. శర్వానంద్ హీరో అయిన తరువాత ఆచి తూచి అడుగులు వేస్తూ ఏడాదికి ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చారు. నిజం చెప్పాలంటే 'శతమానం భవతి' తరువాత శర్వానంద్ ను ఆ రేంజ్ హిట్ మళ్ళీ పలకరించలేదు. ఈ యేడాది సంక్రాంతికి విడుదలైన 'నారీ నారీ నడుమ మురారి' డీసెంట్ హిట్ గానే నిలచింది. కానీ, 'శతమానం భవతి'ని టచ్ చేయలేకపోయింది. ఏప్రిల్ లో వచ్చిన 'బైకర్' పరవాలేదు అనిపించుకుంది. అందువల్ల రాబోయే 'భోగి'పైనే శర్వానంద్ కు హోప్స్ బాగా ఉన్నాయి. ఈ చిత్ర దర్శకుడు సంపత్ నంది కూడా దాదాపు ఐదేళ్ళ తరువాత దర్శకత్వం వహించిన సినిమా 'భోగి'. ఇందులో వయలెన్స్ ఎక్కువగా ఉందని 'ఏ' సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయితే తెరపై ఆ హింసను చూసినా అందుకు ఓ కారణముందని ప్రేక్షకులు భావిస్తారని సంపత్ నంది అంటున్నారు. ఈ కోణంలోనూ 'భోగి'పై ఆసక్తి చోటు చేసుకుంది.
ఇప్పటికే రెండు చిత్రాలతో అలరించిన శర్వానంద్ కు రాబోయే 'భోగి' కూడా ప్రేక్షకుల మన్ననలు పొందితే 2026 సంవత్సరం ఓ మరపురానిదిగా మిగిలే అవకాశం ఉంది. అంతేకాదు ఇందులో శర్వానంద్ ఐదుగురు చెల్లెళ్ళ అన్నయ్యగా నటించారు. ఈ మూవీలో శర్వానంద్ పాత్ర ఆకట్టుకుంటే, భవిష్యత్ లో శర్వాకు సెంటిమెంట్ పండించే రోల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ తో బంపర్ హిట్స్ చూశారు. మరి శుక్రవారం జనం ముందు నిలచే 'భోగి'తో శర్వానంద్ ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఆడంబరాల పెళ్లి.. ‘ఆత్మగౌరవ వివాహం'లో మిగిలిందేమిటి?
బాలయ్య కూతురు సినిమా.. హీరో ఎవరో తెలుసా
ఆయనలా సీఎం అవుతా.. శర్వానంద్ ఏంటి అలా అనేశాడు