Tollywood: హిట్టు కోసం చకోర పక్షుల్లా...
ABN, Publish Date - Jan 30 , 2026 | 04:24 PM
ఈ యేడాది సంక్రాంతి కి ఫుల్ ఫామ్ లోకి వచ్చిన హీరో అంటే శర్వానంద్. అయితే... అతనిలానే గత కొన్నేళ్ళుగా విజయం కోసం ఎదురుచూస్తున్న హీరోలు చాలామందే ఉన్నారు. మరి వారిని ఎప్పుడు విజయలక్ష్మి వరిస్తుందో!?
టాలీవుడ్ లో పలువురు నోటెడ్ హీరోస్ సక్సెస్ కోసం పరితపిస్తున్నారు. వారిలో ముందుగా శర్వానంద్ కోలుకున్నారని ట్రేడ్ టాక్. మరి శర్వాతో పాటు సఫర్ అయి, ఇంకా హిట్టు పట్టని హీరోలెవరు?
హీరో శర్వానంద్ (Sharwanand) కు 'నారీ నారీ నడుమ మురారి' ఆశించిన విజయాన్ని అందించిందా? అంటే ఇంకా లెక్కలు తేలాలి అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఈ సినిమా సంక్రాంతి సందడిలో కాకుండా సోలోగా వచ్చి ఉంటే ఆ తీరే వేరుగా ఉండేదనీ కొందరి మాట. అయితే పొంగల్ బరిలో దూకడం వల్లే ఆ మాత్రం ఆకట్టుకుంటోంది అనేవారూ లేకపోలేదు. ఏమైతేనేం నవ్వులు పూయిస్తూ 'నారీ నారీ నడుమ మురారి' జనాన్ని అలరిస్తోంది. దాంతో శర్వానంద్ కు ఓ హిట్టు లభించింది అంటున్నారు. శర్వాతో పాటు సక్సెస్ కోసం చెకోర పక్షుల్లా ఎదురుచూస్తోన్న రవితేజ, గోపీచంద్ వంటి సీనియర్ హీరోస్, నితిన్, రామ్, విజయ్ దేవరకొండ, నాగశౌర్య, విశ్వక్ సేన్ మాత్రం 'స్టిల్ స్ట్రగులింగ్' అనే చెప్పాలి. శర్వాకు కూడా 'శతమానంభవతి' తరువాత ఆ స్థాయి సక్సెస్ దరి చేరలేదు. అంటే దాదాపు తొమ్మిదేళ్ళ నుంచీ శర్వానంద్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారన్న మాట!
సీనియర్ హీరోస్ విషయానికి వస్తే మాస్ మహరాజా రవితేజకు 2022లో 'ధమాకా' రూపంలో ఓ బంపర్ హిట్ లభించింది. తరువాత చిరంజీవితో కలసి నటించిన 'వాల్తేరు వీరయ్య'తోనూ ఓ భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత నుంచీ రవితేజకు సక్సెస్ దరి చేరలేదు. ఆరు చిత్రాలు నిరాశ కలిగించాయి. ప్రస్తుతం 'ఇరుముడి'మూవీపైనే రవితేజ్ ఆశలు పెట్టుకున్నారు. ఇక గోపీచంద్ విషయానికి వస్తే 2014లో వచ్చిన 'లౌక్యం' తరువాత సరైన సక్సెస్ లేదు. అంటే దాదాపు 12 ఏళ్ళ నుంచీ గోపీచంద్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా రూపొందుతోంది. రామ్ పోతినేని 2019లో 'ఇస్మార్ట్ శంకర్'తో అదరహో అదరహా అనిపించారు. తరువాత మళ్ళీ ఆ స్థాయి విజయం చూడలేదు. 2020లో 'భీష్మ'తో మంచి విజయాన్ని చూసిన నితిన్ ఆ పై మరో సక్సెస్ తో సాగలేదు. ఈ ఇద్దరు హీరోలు సైతం విజయాల తరువాత ఓ ఆరేసి సినిమాల్లో నటించారు. కానీ, హిట్టు పట్టలేకపోవడం గమనార్హం! నితిన్ హీరోగా వి.ఐ. ఆనంద్ డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది.
యంగ్ హీరోస్ లో విజయ దేవరకొండ, నాగశౌర్య, విశ్వక్ సేన్ కూడా సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 'ఛలో' తరువాత 11 చిత్రాలతో చేదు అనుభవాన్నే చూశారు నాగశౌర్య. రాబోయే 'బ్యాడ్ బాయ్ కార్తిక్'పైనే నాగశౌర్య ఆశలు పెట్టుకున్నారు. 2024లో విశ్వక్ సేన్ 'గామి'తో మంచి విజయాన్ని అందుకున్నారు- తరువాత వరుసగా మూడు ఫ్లాపులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు 'ఫంకీ'పై విశ్వక్ సేన్ కు హోప్స్ ఉన్నాయి. ఆరంభంలోనే వరుస విజయాలు చూసిన విజయ్ దేవరకొండ 'గీత గోవిందం'తో సాలిడ్ హిట్ పట్టేశారు. ఆ చిత్రం తరువాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ విజయ్ కి దక్కలేదు. ఆ తరువాత నటించిన వాటిలో 'టాక్సీవాలా' మినహాయిస్తే అన్నీ పరాజయం పాలు కావడం గమనార్హం! ఇప్పుడు విజయ్ ఆశల పల్లకిగా 'రణబాలి' ఊరిస్తోంది. వీరందరికీ ఒక్క హిట్ వస్తే చాలు మరో పది సినిమాలకు కమిట్ అయిపోతారు అని ట్రేడ్ టాక్. మరి రాబోయే చిత్రాలతో ఈ హీరోలు ఏం చేస్తారో చూడాలి.