Music Director: సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ కన్నుమూత
ABN , Publish Date - Aug 11 , 2026 | 04:05 PM
సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, భోజ్ పురి భాషల్లో వందకు పైగా చిత్రాలకు ఆయన సంగీతం అందించారు.
సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ (72) అనారోగ్య కారణంగా ఆగస్ట్ 10వ తేదీ రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. అర్జున్ అసలు పేరు యు. మల్లికార్జున శర్మ. కడపలో 1954 జూలై 11న ఆయన జన్మించారు. యుక్త వయసులోనే సంగీతం మీద మక్కువతో చెన్నై చేరి జి.కె. వెంకటేశ్, చక్రవర్తి తదితర ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు. ఆ తర్వాత చెన్నయ్ లో దాదాపు ఆరువందల మ్యూజిక్ ఆల్బమ్స్ కు స్వరాలు సమకూర్చారు.
2004లో హైదరాబాద్ వచ్చిన మల్లికార్జున శర్మ... అర్జున్ పేరుతో సినీ సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. తెలుగు, కన్నడ, భోజ్ పురి, తమిళ భాషల్లో వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. అర్జున్ శర్మ కుటుంబ సభ్యులంతా సంగీతానికే అంకితమయ్యారు. ఆయన భార్య రాణి పులోమజా దేవి గీత రచయిత్రగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున్ స్వరపర్చిన అనేక చిత్రాలకు ఆమె పాటలు రాశారు. తెలుగు సినిమాలలో అత్యధిక పాటలు రాసిన గీత రచయిత్రిగా ఆమె గుర్తింపు పొందారు. పదకొండేళ్ళ క్రితం, 2015లో రాణి పులోమజా దేవి అనారోగ్యంతో కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు. అందులో ఒకరు జానకిరామ్, కాగా మరొకరు ప్రద్యోతన్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రామ సత్యనారాయణ నిర్మించిన 'ఐస్ క్రీమ్' సినిమాతో ప్రద్యోతన్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత బెంగళూరుకు మకాం మార్చిన ప్రద్యోతన్ ఇంతవరకూ 18 కన్నడ చిత్రాలకు సంగీతం అందించారు. మరో ఐదు చిత్రాలకు సంగీతం సమకూర్చుతున్నారు.

తెలుగులో లో-బడ్జెట్ సినిమాలు నిర్మించే వారందరికీ సంగీత దర్శకుడు అర్జున్ దన్నుగా నిలిచేవారు. పరిమితమైన బడ్జెట్ లో వారి చిత్రాలకు అర్జున్ సంగీతాన్ని సమకూర్చేవారు. పోసాని 'జెంటిల్ మేన్', 'బుల్లబ్బాయ్, సర్కార్, పరంపర, చిలుకూరు బాలాజీ' తదితర చిత్రాలు అర్జున్‌కు సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలానే తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన 'శ్రీ వాసవి వైభవం' చిత్రం సంగీత దర్శకుడిగా అర్జున్ కు చక్కని గుర్తింపు తెచ్చిపెట్టింది. 2012లో విడుదలైన ఈ సినిమాలో మీనా, సుమన్, సుహాసిని, సాయికిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో పాటలను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గానం చేయగా, కొన్ని శ్లోకాలను అర్జున్ స్వయంగా ఆలపించారు. అర్జున్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో యాభై కు పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారు. కొన్ని చిత్రాలకు గీత రచన చేశారు. మరికొన్ని పాటలను పాడారు. అర్జున్ శర్మ మృతితో ఓ ఆత్మీయుడిని కోల్పోయానని రామ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అర్జున్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
ALSO READ:
Tollywood: సీనియర్ నట, రచయిత కృష్ణేశ్వరరావు మృతి
శంకర్ డైరెక్షన్‌లో అజిత్ సినిమా.. వర్కవుట్ అవుతుందా?'
Supriya: క్యూట్ అండ్ డీప్ ఎమోషన్ తో 'పళ్ళ బురుసు'