Tollywood: సీనియర్ నట, రచయిత కృష్ణేశ్వరరావు మృతి
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:59 AM
నాటక, సినీ రంగాలలో రచయితగా, నటుడిగా తనదైన ముద్రవేసిన కృష్ణేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. 'ప్రచండ భారతం'తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన ఎన్నో చిత్రాలకు రచన చేసి, మరెన్నో చిత్రాలలో నటించారు.
సీనియర్ నటుడు, రచయిత కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. గత యేడాదిగా శ్వాసకోశ, గుండె సంబంధిత అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన కృష్ణేశ్వరరావు గుంటూరు ఎ.టి. అగ్రహారంలోని ఇంటిలో తుది శ్వాస విడిచారు. నాటకరంగంలో పలు ప్రయోగాలకు నాంది పలికారు కృష్ణేశ్వరరావు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ పరిషత్ నాటక పోటీలు జరిగినా ఆయన రాసిన, నటించిన నాటకాలు ప్రదర్శితమౌతుండేవి. ఆయన నాటకం పోటీలో ఉందంటే దానికే అవార్డులు అత్యధిక శాతం దక్కేవి. 'సంపద, రోజూ చస్తున్న మనిషి, పక్కింట్లో పుట్టండి, గుర్తు తెలియని శవం' వంటి నాటకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. పొన్నూరు కళాపరిషత్ వ్యవస్థాపకులైన కృష్ణేశ్వరరావు నట, దర్శక, ప్రయోక్తగా ప్రయోగాత్మక నాటకాలతో పలు నంది అవార్డులు గెలుచుకున్నారు. పొన్నూరులో ఆర్.ఎం.పి. డాక్టర్ గా సేవలు అందిస్తూ సొంతంగా నాటకాలు రాసి, దర్శకత్వం వహించిన ఆయన ప్రజల నుంచి జేజేలు అందుకున్నారు. చివరి నిమిషం వరకూ నాటకమే ధ్వాసగా బతికారు.
సీనియర్ నటుడు ఎం. ప్రభాకర్ రెడ్డి... కృష్ణేశ్వరరావు నాటకం చూసి, 'ప్రచండ భారతం' సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమాకు కథ కృష్ణేశ్వరరావే అందించారు. ఆ తర్వాత మోహన్ బాబు కోరిక మేరకు 'శ్రీరాములయ్య' జీవితాన్ని పరిశోధించి, సినిమాటిక్ గా మార్చారు. 'పరశురామ్, జయం మనదేరా' చిత్రాలకు సంభాషణలు రాశారు. అలానే ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన 'భద్రాచలం'లోనూ నటించారు. నటుడు జీవా ద్వారా దర్శకుడు వంశీ పరిచయం కావడంతో ఆయన తెరకెక్కించిన 'ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను, గోపి గోపిక గోదావరి' వంటి చిత్రాలలో యాక్ట్ చేశారు. 'చందమామ కథలు' సినిమాలో ఆయన పోషించిన పిచ్చివాడి పాత్ర గొప్ప పేరు తెచ్చిపెట్టింది. అలానే 'ఇడియట్, వీర తెలంగాణ, నాంది, విరూపాక్ష' తదితర చిత్రాలలోనూ కృష్ణేశ్వరరావు నటించారు. కృష్ణేశ్వరావు పూర్తి పేరు యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరుపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
డిప్యూటీ సీఎం అడిగారు.. ఈ సినిమా చేశా: కింగ్ నాగార్జున
నా ఫ్యాన్స్ అలా పచ్చబొట్టు వేయించుకోండి: శరత్ కుమార్
మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్.. కనకరాజు కుమ్మేశాడు