చిరుకి వదినగా చేసినా.. నాగ్ ఫ్యామిలీతోనే బాండింగ్ ఎక్కువ: సుధ
ABN, Publish Date - Jul 18 , 2026 | 12:10 AM
తాజాగా ఆంధ్రజ్యోతి NSR ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ, టాలీవుడ్‌లోని అగ్ర హీరోల కుటుంబాలతో తనకు ఉన్న అనుబంధం, సినిమా విశేషాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
టాలీవుడ్‌లో ఒకప్పుడు వదినగా, ఆ తర్వాత తల్లి పాత్రలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు సీనియర్ నటి సుధ (Senior Actress Sudha). తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో వందల సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆమె, ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోలతో కలసి నటించారు. తాజాగా ఆంధ్రజ్యోతి NSR ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ, టాలీవుడ్‌లోని అగ్ర హీరోల కుటుంబాలతో తనకు ఉన్న అనుబంధం, సినిమా విశేషాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఇండస్ట్రీలో మీతో ఎక్కువ బాండింగ్ ఉన్న ఫ్యామిలీ ఏది అని అడిగిన ప్రశ్నకు సుధ స్పందిస్తూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో కంటే నాకు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)తోనే ఇంకా మంచి బాండింగ్ ఉంది. ఆ ఫ్యామిలీతోనే నాకు అనుబంధం ఎక్కువ. నాగార్జునతోనే కాకుండా సుశీలతో కూడా నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉండేది. ఆ తర్వాత నాగచైతన్యతో కూడా కలిసి వర్క్ చేశాను’’ అని చెప్పుకొచ్చారు.
అయితే ఆడియన్స్‌లో మాత్రం తనకు చిరంజీవి సినిమాల వల్లే ఎక్కువ ఐడెంటిటీ వచ్చిందని ఆమె తెలిపారు. ‘‘చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ సినిమా వచ్చిన తర్వాత నేను బయటకు వెళ్తే చాలు.. అందరూ నన్ను ‘చిరంజీవి గారి వదిన’ అని పిలిచేవారు. అలా పిలుస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపించేది’’ అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో ఆయనకు మొదటి తల్లిగా నటించింది నేనే. ఆ తర్వాత సుమారు ఆయనతో ఐదారు సినిమాల్లో కలిసి పనిచేశాను’’ అని గుర్తుచేసుకున్నారు.
తన కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి అక్క, వదిన పాత్రల నుండి తల్లి పాత్రల్లోకి మారానని సుధ చెప్పారు. ఉదయ్ కిరణ్, జూనియర్ ఎన్టీఆర్, తరుణ్, మనోజ్ వంటి యంగ్ హీరోలందరికీ తల్లిగా నటించిన తర్వాత ఆడియన్స్ అంతా తనను ‘అమ్మ’ అని పిలవడం మొదలుపెట్టారని, ఆ సమయంలో తన కెరీర్ గ్రాఫ్ ఎప్పుడూ పైకే వెళ్ళింది కానీ కిందకు రాలేదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో తనను ఎంతో కంఫర్ట్ జోన్‌లో ఉంచారని, అందరితోనూ సమానమైన అనుబంధం ఉందని ఆమె ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఫెడరేషన్‌కు షాకిస్తూ.. నిర్మాతలకు జానీ, సుమలత మాస్టర్స్ లేఖలు
తెల్లచీర, మల్లెపూలు.. స్రవంతి చొక్కారపు ఏంటి కథ?
‘వృషకర్మ’.. నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ డీల్!