Vadhandhi 2: ఎస్ జె సూర్యని శశి కుమార్ మరిపిస్తాడా.. ?
ABN, Publish Date - Aug 01 , 2026 | 08:24 PM
కోలీవుడ్ సీనియర్ హీరో శశికుమార్ (Sasikumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు.
కోలీవుడ్ సీనియర్ హీరో శశికుమార్ (Sasikumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఏ సినిమా చేసినా తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా శశికుమార్ నటించిన సిరీస్ వదంతి 2: ది మిస్టరీ ఆఫ్ మణి (Vadhandhi) 2. ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ని పుష్కర్ అండ్ గాయత్రి నిర్మించారు. 2022 లో రిలీజ్ అయిన వదంతి సిరీస్ కి సీజన్ 2 గా ఈ సిరీస్ వస్తోంది. మొదటి సీజన్‌లో వర్సటైల్ యాక్టర్ ఎస్ జె సూర్య సూర్య (S.J. Suryah) ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వివేక్ పాత్రలో నటించాడు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పటికీ వదంతి వెబ్ సిరీస్ అనగానే అందరికీ ఎస్ జె సూర్య నటన మాత్రమే కళ్లముందు కదులుతుంది.
అయితే, ఇప్పుడు రాబోతున్న సీజన్ 2 లో కథనం పూర్తిగా మారిపోయింది. కొత్త కేస్‌ను ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా శశికుమార్ కనిపిస్తున్నాడు. తాజాగా ట్రైలర్‌లో శశికుమార్ పోలీస్ అవతారంలో చాలా సీరియస్ అండ్ ఎమోషనల్ లుక్‌లో కనిపించాడు. తనకు సంబంధం లేని కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్ళిన మణి అనే ఒక యువకుడి కథ ఇది. ఆ యువకుడు తప్పు చేశాడా.. లేదా అనే డైలమాలో కనిపించే పోలీస్ గా తనదైన రా, రియలిస్టిక్ యాక్టింగ్‌తో ఆయన ఆకట్టుకున్నాడు. ఒక కొత్త క్రైమ్ మిస్టరీని ఛేదించే క్రమంలో శశికుమార్ పండించిన హావభావాలు సస్పెన్స్ లవర్స్‌కు సాలిడ్ థ్రిల్‌ని ఇస్తాయని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.
ఇక ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ట్రైలర్ తర్వాత సినీ వర్గాల్లోనూ, నెటిజన్లలోనూ ఒకే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీరియస్ రోల్స్‌లో శశికుమార్ నటన ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే మొదటి సీజన్‌లో ఎస్ జె సూర్య తన నటనతో చూపించిన ఇంపాక్ట్‌ను అధిగమించి, శశికుమార్ ఆయనను మరిపిస్తాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆగస్టు 7న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ ద్వారా శశికుమార్ తన నటనతో ఏ స్థాయిలో మెప్పిస్తాడా.. ఆ మ్యాజిక్ మళ్లీ రీపీట్ అవుతుందా అనేది తెలియాలంటే సిరీస్ వచ్చేవరకు వేచి చూడాలి.