Dil Raju: సాయి పల్లవి మన తెలుగు అమ్మాయి.. ఇప్పుడు ‘రామాయణ’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందబోతోంది
ABN, Publish Date - Oct 20 , 2026 | 10:41 AM
‘రామాయణం’ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు, కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 3D విజువల్స్, రణ్‌బీర్ కపూర్ నటన, సాయి పల్లవి, యశ్ పాత్రలపై ప్రశంసలు కురిపించారు.
పాన్ ఇండియా సినిమాల హవాలో ఇప్పుడు ‘రామాయణం’(Ramayana Movie) పై అందరి దృష్టి పడింది. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), యశ్ (Yash) వంటి స్టార్ హీరోలు, సాయి పల్లవి (Sai Pallavi) వంటి ప్రతిభావంతమైన నటి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ బాధ్యతలను ఎస్వీసీ చేపట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో తెలుగు ప్రచారానికి మరింత ఊపు వచ్చింది.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్! ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా. హాలీవుడ్లో సోనీ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. నార్త్‌లో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మా సంస్థ ద్వారా రిలీజ్ అవుతోంది. రామాయణం తరతరాలుగా, యుగయుగాలుగా వస్తున్న చరిత్ర. ఇంత గొప్ప సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత నమిత్ గారికి ధన్యవాదాలు. యశ్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో నమిత్ గారిని కలిసినప్పుడు 3Dలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ చూపించారు. మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. మీరు థియేటర్లో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. నితీష్ గారు ‘దంగల్’ సినిమాతో ఇండియన్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు.
ఇందులో సీత పాత్రలో నటించిన సాయి పల్లవి మన తెలుగు అమ్మాయి. ఇప్పుడు ఆమె ‘రామాయణ’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందబోతోంది. అలాగే ఇందులో శూర్పణఖ పాత్రలో నటించిన రకుల్ గారు కూడా మన దగ్గర ఎన్నో సినిమాలు చేశారు. యశ్ గారు ఇండియన్ సినిమాలోనే ఒక చరిత్ర సృష్టించారు. ఇందులో అద్భుతమైన రావణబ్రహ్మ పాత్రను పోషిస్తున్నారు. రణ్‌బీర్ గారితో ‘బ్రహ్మాస్త్ర’, ‘యానిమల్’ సినిమాలను ఇక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. ఇందులో రాముడి పాత్రలో ఆయన లీనమైపోయి నటించారు.
రామాయణం లేకుండా మన దేశ చరిత్ర లేదు. రాముడి కథను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్న యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రేపటి నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. నవంబర్ 5న ఒక వండర్ క్రియేట్ కావాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతం జరగాలి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన సినిమాలను నిర్మించడానికి నిర్మాతలకు, దర్శకులకు ఎనర్జీ రావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
కరణ్ జోహార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘రామాయణ’లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్న నిర్మాత నమిత్ మల్హోత్రా గారికి, డైరెక్టర్ నితీష్ తివారీ గారికి ధన్యవాదాలు. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్.. ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నార్త్ ఇండియాలో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు మాకు ఇచ్చిన నిర్మాతకు థాంక్యూ. దిల్ రాజు గారు ఒక లెజెండ్. ఆయనతో కలిసి వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అద్భుతమైన విజువల్ ఎపిక్‌లో చిన్న భాగం కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.