రెండు పార్టులుగా సాయిపల్లవి రెండు సినిమాలు
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:50 PM
తనదైన సహజ నటనతో, అద్భుతమైన నృత్యంతో దక్షిణాది ప్రేక్షకులను కట్టిపడేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. ఇప్పుడామె ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
తనదైన సహజ నటనతో, అద్భుతమైన నృత్యంతో దక్షిణాది ప్రేక్షకులను కట్టిపడేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi).. వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. నాగచైతన్యతో కలిసి నటించిన ‘తండేల్’ (Thandel) చిత్రం తర్వాత ఆమె రెగ్యులర్ థియేట్రికల్ రిలీజ్‌లకు కాస్త విరామం ఇచ్చారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘రామాయణ’ (Ramayana) ప్రాజెక్ట్ కోసమే ఆమె అధిక సమయాన్ని కేటాయించడమే ఈ గ్యాప్‌కి కారణం. ఆ మధ్య వచ్చిన ఆమె బాలీవుడ్ డెబ్యూ చిత్రం ‘ఏక్ దిన్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అయితే, ఇప్పుడు వరుసగా రానున్న రెండు భారీ పాన్-ఇండియా చిత్రాలతో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు సాయి పల్లవి సిద్ధమవుతున్నారు. రాబోయే నవంబర్ నెలలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకులకు సాయి పల్లవి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, రాకింగ్ స్టార్ యశ్ (Yash) రావణుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక విజువల్ వండర్ ‘రామాయణ పార్ట్ 1’ (Ramayana Part One). ఈ చిత్రంలో సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్స్ మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ మహాగాథ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఓవర్సీస్ రిలీజ్ ప్లాన్స్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, భారతదేశ వ్యాప్తంగా విడుదల వ్యూహాన్ని మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాతో సాయి పల్లవి క్రేజ్ పాన్-ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ రేంజ్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
‘రామాయణ’ విడుదలైన సరిగ్గా రెండు వారాలకే, అంటే నవంబర్ 20న కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం’ (Om - Chapter 1: Udhiram - The Blood Wood)తో సాయి పల్లవి మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నారు. వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది. అక్టోబర్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ విడుదలకు వస్తుండటంతో ‘ఓం’ చిత్రాన్ని నవంబర్‌కు వాయిదా వేశారు. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ‘ఓం’ (OM) చిత్రం పలు వాయిదాల తర్వాత.. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, శ్రీలీల, బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా వంటి భారీ తారాగణం నటిస్తుండగా.. సాయి పల్లవి కథను మలుపు తిప్పే అత్యంత కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ‘రామాయణ’, ‘ఓం’ రెండు చిత్రాలు కూడా రెండు భాగాలుగా రాబోతున్న ప్రాజెక్టులే కావడం విశేషం. అంతేకాకుండా, ఈ రెండు సినిమాల్లోనూ సాయి పల్లవి పాత్రలు రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ హీరోయిన్ తరహాలో కాకుండా, ఆమె అభినయానికి, నటనకు పూర్తి ఆస్కారమున్న బలమైన పాత్రలుగా ఉండబోతున్నాయి. కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న సాయి పల్లవికి ఈ నవంబర్ నెల కెరీర్‌లోనే అత్యంత బిజీయెస్ట్ అండ్ క్రూషియల్ ఫేజ్ కానుంది. ఈ రెండు పాన్-ఇండియా చిత్రాలు గనక బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకుంటే మాత్రం.. ఆమె మార్కెట్, స్టార్‌డమ్‌కు మరింతగా రెక్కలు వచ్చినట్టే. వీటితో పాటు వచ్చే ఏడాది లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన నటించనున్న భారీ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉండటంతో.. ఈ నేచురల్ బ్యూటీ హవాకు ఇక తిరుగులేదనే చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం.. అక్టోబర్‌లోనూ డౌటే!
స్మిత్ మచ్చార్ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం: చిరంజీవి
పబ్లిగ్గా బుగ్గగిల్లిన ఆకతాయి.. షాకైన హీరోయిన్.. వీడియో వైరల్