సాయి దుర్గ తేజ్ - కిరణ్‌ల నిశ్చితార్థం.. హాజరైన పలువురు సెలబ్రిటీలు
ABN, Publish Date - Nov 05 , 2026 | 08:59 PM
మెగా కాంపౌండ్‌లో పెళ్లి బాజాలు మోగే శుభ ఘడియలు అధికారికంగా మొదలయ్యాయి. మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన జీవితంలో అత్యంత కీలకమైన, అందమైన నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
మెగా కాంపౌండ్‌లో పెళ్లి బాజాలు మోగే శుభ ఘడియలు అధికారికంగా మొదలయ్యాయి. మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Sai Drugha Tej) తన జీవితంలో అత్యంత కీలకమైన, అందమైన నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాయి దుర్గ తేజ్, కిరణ్ (Kiran)ల నిశ్చితార్థ వేడుక (Sai Drugha Tej and Kiran Engagement) గురువారం (నవంబర్ 5, 2026) హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్ (Hilton Hyderabad Genome Valley Resort) వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ఆత్మీయుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకలో కాబోయే నూతన దంపతులు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ప్రత్యేక క్షణాలతో మెగా ఇంట పండుగ వాతావరణం నెలకొనగా, వీరి వివాహాన్ని వచ్చే నెల డిసెంబర్ 10న హైదరాబాద్‌లోనే అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు.
ఈ నిశ్చితార్థ మహోత్సవానికి కొణిదెల, అల్లు కుటుంబాలు (Mega and Allu Families) ఏకమై తరలివచ్చి వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాయి. సాయి దుర్గా తేజ్ తల్లిదండ్రులు డాక్టర్ శివప్రసాద్, విజయదుర్గ, సోదరుడు వైష్ణవ్ తేజ్ ముందుండి బంధుమిత్రులను ఆహ్వానించగా.. మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డి దంపతులు, అల్లు బాబీ-నీలా షా, నాగబాబు-పద్మజ, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులు (కుమారుడు వాయువ్ తేజ్‌తో కలిసి), నిహారిక కొణిదెల, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్-అల్లు నిర్మల, అల్లు శిరీష్-నయనిక రెడ్డి, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య హాజరై సందడి చేశారు. మెగా, అల్లు కుటుంబాల స్టార్లంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కాబోయే జంటపై ప్రేమను కురిపించడంతో వేడుక సరికొత్త కాంతులీనింది.
సినీ పరిశ్రమ నుంచి సాయి దుర్గా తేజ్ అత్యంత సన్నిహితులు, స్నేహితులు కూడా ఈ ప్రత్యేక వేడుకలో భాగస్వామ్యమయ్యారు. తేజ్‌కి మంచి స్నేహితుడైన మంచు మనోజ్-భూమా మౌనిక రెడ్డి దంపతులు, నవీన్ విజయ్ కృష్ణ, ప్రముఖ కమెడియన్ హర్ష చెముడు, దర్శకుడు వెంకీ కుడుముల, నటుడు నవదీప్, నిర్మాత హర్షిత్ రెడ్డి తదితరులు హాజరై కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ప్రైవేట్‌గా, ఆత్మీయ అనుబంధాల మధ్య సాగిన ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకతో మెగా అభిమానుల్లో చెప్పలేనంత ఆనందం వెల్లివిరుస్తోంది. డిసెంబర్ 10న జరగనున్న వివాహ మహోత్సవం కోసం ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు కాబోయే భార్య పేరు ఇదే..
చిరంజీవి ‘మెగావర్స్’లో సందడి చేయనున్న స్టార్స్ వీరేనా?
సుడిగాలి సుధీర్ GOAT ట్రైలర్ వదిలిన దుల్కర్.. ఎలా ఉందంటే?