ఇప్పటికి ఆరు... ఇంకెన్ని వస్తాయో!
ABN, Publish Date - Mar 28 , 2026 | 12:44 PM
సినిమాల రీ-రిలీజ్ హంగామా జోరందుకుంది. చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలు ఏవీ లేకపోవడంతో ఏప్రిల్ లో రెండు, మే లో నాలుగు సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. వీటి సంఖ్య మరింత పెరిగే ఆస్కారమూ ఉంది.
ఈ మధ్య కాలంలో రీ-రిలీజ్ చిత్రాలు పెద్దంతగా వసూళ్ళను రాబట్టడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే చిత్రంగా వాటి విడుదల మాత్రం ఆగడం లేదు. మరీ చిత్రం ఏమంటే... ఆరేడు నెలల క్రితం, యేడాది ముందు రీ-రిలీజ్ అయిన సినిమాలను సైతం ఇప్పుడు విడుదల చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం థియేటర్లు ఖాళీగా ఉండటమే. పెద్ద సినిమాలు లేకపోవడం, చిన్న సినిమాలు వారం మించి ఆడకపోవడంతో సింగిల్ థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ గ్యాప్‌లో స్టార్ హీరోల చిత్రాలే మళ్ళీ ప్రదర్శిస్తే... ఓ మాదిరి కలెక్షన్స్ అయినా రాకపోతాయా అనే ఆశతో వాటిపై ఎగ్జిబిటర్స్ దృష్టి సారిస్తున్నట్టుగా ఉంది.
ఏప్రిల్ మాసంలో 8వ తేదీ అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా 'రేసుగుర్రం' మూవీ రీ-రిలీజ్ అవుతోంది. 2014లో తొలిసారి విడుదలైన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. అల్లు అర్జున్ సరసన శ్రుతీహాసన్ హీరోయిన్‌గా చేసింది. ఆమె క్యారెక్టరైజేషన్ మూవీకి స్పెషల్ హైలైట్‌గా నిలిచింది. యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ సమపాళ్ళలో ఉన్న ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడీ సినిమా మళ్ళీ వస్తోంది. ఇందుకు గానూ కొత్త ట్రైలర్‌నూ విడుదల చేశారు. ఇక హీరో సిద్ధార్థ్ కెరీర్‌లో సమ్ థింగ్ స్పెషల్ మూవీ 'ఓయ్'. 2009లో విడుదలైన ఈ సినిమాతో షామిలీ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలిసారి విడుదలైనప్పుడు 'ఓయ్' కమర్షియల్‌గా హిట్ కాకపోయినా... మ్యూజికల్‌గా ఈ సినిమాకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత పలు సార్లు 'ఓయ్' రీ-రిలీజ్ అయ్యింది. అయితే ఈ యేడాది కూడా సిద్ధార్థ్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 17న ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేస్తున్నారు.
ఇక మే నెలలో అయితే... ఏకంగా నాలుగు సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. మే 8వ తేదీ రవితేజ సూపర్ హిట్ మూవీ 'కృష్ణ' రీ-రిలీజ్ అవుతోంది. రవితేజ సరసన త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు వి. వి. వినాయక్ డైరెక్టర్. 2008 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలానే తమిళ యువ నటుడు శింబు సూపర్ హిట్ మూవీ 'వల్లభ' మే 9న విడుదల కాబోతోంది. ఇక పూరి జగన్నాథ్, జూ. ఎన్టీఆర్‌తో తీసిన 'ఆంధ్రావాలా'ను జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న రీ-రిలీజ్ చేయబోతున్నారు. అలానే మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని, 29వ తేదీ మహేశ్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి తీసిన 'అతిథి' మూవీని రీ-రిలీజ్ చేస్తున్నారు. సో... సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు ఏప్రిల్, మే లో వరుసగా వస్తున్నాయన్న మాట.