డబ్బులిచ్చి మరి ‘సిగ్మా’పై నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారా? నమ్మవచ్చా!

ABN , Publish Date - Oct 02 , 2026 | 03:53 PM

కొందరు హీరోలు తమ స్వలాభం కోసం భారీగా డబ్బులు వెచ్చించి, ప్రత్యర్థి హీరోల సినిమాలపై ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది.

Sundeep Kishan on PR Mafia

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పీఆర్ (PR) మాఫియా’ మాటే ఎక్కువగా వినిపిస్తోంది. కొందరు హీరోలు తమ స్వలాభం కోసం భారీగా డబ్బులు వెచ్చించి, ప్రత్యర్థి హీరోల సినిమాలపై ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. మొన్న నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), అంతకుముందు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) లాంటి హీరోలు దీనిపై పరోక్ష వ్యాఖ్యలు చేయగా.. తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) చేసిన సంచలన కామెంట్స్ సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

సందీప్ కిషన్ వార్నింగ్.. అసలేం జరిగింది?

గాంధీ జయంతి కానుకగా నేడు (అక్టోబర్ 2న) సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ‘సిగ్మా’ (Sigma) తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం కావడంతో దీనిపై మంచి బజ్ ఉంది. అయితే రిలీజ్‌కు ముందు సందీప్ కిషన్ ‘ఎక్స్’ వేదికగా పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ‘‘గత కొన్ని రోజులుగా నన్ను, నా కొత్త సినిమాను టార్గెట్ చేస్తూ ‘ఎక్స్’ వేదికగా ఉద్దేశపూర్వకంగా కొందరు నెగెటివ్ ట్వీట్లు వేయిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు? ఇందుకోసం ఎవరెవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు? అన్నది నాకు పూసగుచ్చినట్లు తెలుసు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి.. ఈ పనుల వల్ల నాకంటే మీరే ఎక్కువ నష్టపోతారు. ఒకసారి నేను డైరెక్ట్‌గా రంగంలోకి దిగితే అందరూ అడ్డంగా దొరికిపోతారు.. చూసుకోండి మరి!’’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.


నిజంగానే కుట్ర జరుగుతోందా?.. లేక పబ్లిసిటీ స్టంటా?

సందీప్ కిషన్ చేసిన ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో రెండు రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సందీప్ లాంటి టాలెంటెడ్ హీరో సినిమాను తొక్కేయడానికి ఇండస్ట్రీలో అంత పెద్ద నెట్‌వర్క్ ఎందుకు పనిచేస్తుంది? నిజంగానే ఆయనంటే గిట్టని వారు ఎవరైనా ఉన్నారా? లేక రిలీజ్ ముందు సినిమాపై అటెన్షన్, క్రేజ్ రాబట్టేందుకే ఇలాంటి వివాదాస్పద పోస్ట్ పెట్టారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా, తన సినిమాను టార్గెట్ చేస్తున్నది ఎవరో తనకు ఖచ్చితంగా తెలిసినప్పుడు.. లీగల్‌గా పోలీసులకు ఫిర్యాదు చేయడమో, లేక తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పెద్దల ముందుకు తీసుకెళ్లి ఆ ‘పీఆర్ మాఫియా’ గుట్టు రట్టు చేయడమో చేయాలి కదా? అలా కాకుండా సోషల్ మీడియాలో ఓపెన్ వార్నింగ్‌లు ఇచ్చి వదిలేయడం వల్ల ఇండస్ట్రీకి ఒరిగేదేంటి? అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.


కంటెంట్‌లో దమ్ముంటే నెగెటివిటీ నిలబడుతుందా?

ఇక్కడ అందరూ గుర్తించాల్సిన ఒక పచ్చి నిజం ఉంది. సినిమాలో సరైన కంటెంట్, దమ్ము ఉంటే.. అవతలి వాళ్లు కోట్లు కుమ్మరించి ఎంత నెగెటివ్ ప్రచారం చేయించినా ఆడియన్స్ థియేటర్లకు రావడం ఎవరూ ఆపలేరు. ఇటీవలే వచ్చిన మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ చిత్రమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఆ సినిమాపై ఎంత దుష్ప్రచారం జరిగినా, ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద నిలబడింది. విషయం లేకుండా కేవలం ఇలాంటి సింపతీ లేదా కాంట్రవర్సీ స్టేట్‌మెంట్లతో సినిమాను నిలబెట్టాలనుకుంటే అది సినిమాకే రివర్స్ అయ్యే ప్రమాదముంది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సిగ్మా’లో గనక నిజంగా విషయం ఉంటే.. ఈ పెయిడ్ నెగెటివిటీని పటాపంచలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయం. మరి జాసన్ సంజయ్ టేకింగ్, సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తాయో చూడాలి!

ఇవి కూడా చదవండి:

శ్రీకాంత్ వదిలిన ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’ ఫస్ట్ లుక్

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. గురూజీకి పోటీగా!

వారి ఆశయాలు సదా స్ఫూర్తిదాయకం: చిరంజీవి

Updated Date - Oct 02 , 2026 | 03:54 PM