మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చరణ్, సుక్కు మూవీకి ముహూర్తం ఖరారు
ABN , Publish Date - Sep 04 , 2026 | 07:47 AM
‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ చిత్రం ‘RC17’. ఈ సినిమా ముహూర్తానికి సంబంధించి ఇప్పుడో న్యూస్ వైరల్ అవుతోంది.
‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ చిత్రం ‘RC17’. అప్పట్లో చిట్టిబాబుగా చరణ్ చూపించిన నటన, సుకుమార్ మేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామి సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో రామ్ చరణ్ నటన పీక్స్‌కు వెళ్లడమే కాకుండా, ఆయన కెరీర్‌లోనే ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిపోయింది. అందుకే ఈ క్రేజీ కాంబోలో రాబోయే రెండో సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులైంది. అయితే ‘పెద్ది’ (Peddi) సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ చేతికి చిన్న గాయం కావడంతో పాటు సర్జరీ జరగడంతో, ఆయన కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. రాబోయే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ముహూర్తపు కార్యక్రమాలను చాలా గ్రాండ్‌గా జరపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ఒక పూర్తి భిన్నమైన రామ్ చరణ్‌ను చూపించబోతున్నారట సుకుమార్. ‘రంగస్థలం’లో చరణ్‌ను పక్కా మాస్ విలేజ్ కుర్రాడిగా, ‘పుష్ప’లో అల్లు అర్జున్‌ను రగ్గడ్ మాస్ అవతారంలో చూపించిన సుకుమార్.. ఈసారి RC17 కోసం ఒక పూర్తి అర్బన్, అల్ట్రా-స్టైలిష్ బ్యాక్‌డ్రాప్ కథను సిద్ధం చేశారట. ఈ కొత్త లుక్ కోసం చరణ్ ఏకంగా 15 కిలోల వరకు బరువు తగ్గబోతున్నారని సమాచారం. ‘పెద్ది’లో పవర్ ఫుల్ ఫిజిక్‌తో కనిపించిన చరణ్, ఈ సినిమా కోసం చాలా సన్నగా, లీన్ అండ్ క్లాసీ లుక్‌లోకి మారబోతున్నారు. సుకుమార్ డిజైన్ చేసిన ఈ మేకోవర్ మెగా అభిమానులకు మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్‌లో నటీనటుల గురించి కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను లేదా ‘డ్రాగన్’ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. మరోవైపు సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో ఈసారి వేరే మ్యూజిక్ డైరెక్టర్ వస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.
ఇవి కూడా చదవండి:
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ‘ఏషనాగుల’ సాంగ్
జక్కన్న నెక్ట్స్ హీరో ఎవరు.. ఆ లెక్కలన్నీ మారుతాయా?
హీరోయిజం కాదు.. ఇప్పుడు దర్శకులదే హవా