మైత్రితో మాస్ మహరాజా అప్పుడలా! ఇప్పుడిలా!!
ABN , Publish Date - Aug 22 , 2026 | 05:01 PM
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజ హీరోగా నటించి 'అమర్ అక్బర్ ఆంటోని' పరాజయం పాలైనా ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు అదే బ్యానర్ లో సోలో హీరోగా 'ఇరుముడి'తో రవితేజ గ్రాండ్ విక్టరీని అందుకున్నాడు.
మాస్ మహరాజా రవితేజకు మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ సక్సెస్ ను అందించింది. అలానే మైత్రీ మూవీ మేకర్స్ కూ రవితేజ ఓ గ్రాండ్ విక్టరీని అందించాడు. ఎందుకంటే రవితేజ సినిమా సక్సెస్ సాధించి సంవత్సరాలు గడిచిపోయింది. అలానే 'పుష్ప -2' తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. మధ్యలో వచ్చి తమిళ చిత్రం 'డ్యూడ్' అక్కడ ఫర్వాలేదనిపించింది కానీ తెలుగులో పెద్దంతగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా, ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలు రెండూ పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో రవితేజతో చేసిన ద్విభాషా చిత్రం 'ఇరుముడి' హిట్ కావడం విశేషమే. ఆగస్ట్ 26న యశ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' వచ్చే వరకూ 'ఇరుముడి' స్వైర విహారం ఖాయంగా కనిపిస్తోంది.
మొదటి రోజే 'ఇరుముడి' రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ లెక్కన శని, ఆదివారాలతో ఈ సినిమా తేలికగా రూ. 50 కోట్ల నుంచి 60 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక సోమ, మంగళవారాల్లోనూ ఇదే జోరు కొనసాగితే... బుధవారానికి 'ఇరుముడి' తేలికగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. ఒక వేళ బుధవారం వచ్చే 'టాక్సిక్' అటూ ఇటూ అయితే... అది కూడా 'ఇరుముడి'కి కలిసొచ్చే అంశమే. 'టాక్సిక్'కు ఇప్పుడున్న ఇమేజ్ బట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆ సినిమాకు వెళ్ళడం కష్టమే. అప్పుడు వారందరికీ 'ఇరుముడి' బెటర్ ఆప్షన్ అవుతుంది. అదే జరిగే... 'ఇరుముడి' ఆ తర్వాత వారాంతానికి రూ. 200 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
నిజానికి మైత్రీ మూవీ మేకర్స్‌తో రవితేజ అనుబంధం ఇప్పటిది కాదు. 2018లోనే వీళ్ళ కాంబినేషన్‌లో తొలి చిత్రంగా 'అమర్ అక్బర్ ఆంటోని' వచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆ సినిమా ఘోర పరాజయాన్ని పొందింది. ఆ తర్వాత ఐదేళ్ళకు మళ్ళీ రవితేజ ఆ బ్యానర్ లో చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య'లో కీలక పాత్ర పోషించాడు. 2023లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఆ సీజన్‌లో విన్నర్‌గా నిలిచింది. మళ్ళీ ఇప్పుడు ఎనిమిదేళ్ళ తర్వాత రవితేజ మైత్రీ మూవీ మేకర్స్ లో సోలో హీరోగా 'ఇరుముడి' చేయడం, అది ఘన విజయాన్ని అందుకోవడం విశేషమే. ఏదేమైనా రవితేజ ఈ బ్యానర్ లో మూడు సినిమాలు చేస్తే.... అందులో రెండు సినిమాలు ఘన విజయాన్ని సాధించి, వారి మధ్య మైత్రీ బంధాన్ని బలోపేతం చేశాయి.
ఇవి కూడా చదవండి:
నెక్ట్స్ బోయపాటితో.. అయ్యగారి న్యూలుక్ చూశారా
మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షల వెల్లువ.. బన్నీ పోస్ట్ వైరల్