అభినయంలోనూ ఆవిడ షావుకారే..

ABN , Publish Date - Aug 22 , 2026 | 10:50 AM

పౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సాంఘిక చిత్రాలతో సామాన్యులకు చేరువైన నటి ఆమె. కంటనీరు పెట్టి కదిలించినా, నటనతో కనికట్టు చేసినా, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించినా ఆమెకే సాధ్యమైంది.

Sowcar Janaki History

పౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సాంఘిక చిత్రాలతో సామాన్యులకు చేరువైన నటి ఆమె. కంటనీరు పెట్టి కదిలించినా, నటనతో కనికట్టు చేసినా, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించినా ఆమెకే సాధ్యమైంది. ఏడున్నర దశాబ్దాల సినీ చరిత్రకు సజీవ సాక్ష్యంగా తిరిగిన ఆమె ఇప్పుడు మన మధ్య లేరు. అయితేనేం.. షావుకారుగా షావుకారు జానకి (Sowcar Janaki) ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారు.

పాత్రకు ప్రాణం పోసిన నటి షావుకారు జానకి. దక్షిణాది సినీ స్వర్ణయుగంలో మేలిమి బంగారం వంటి నటీమణుల సరసన ఎదిగి, ఒదిగి, ప్రేక్షకహృదయాలు గెలుచుకున్న సాంఘికనాయిక జానకి. పౌరాణికాలు, జానపదాలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో ఆ పాత్రలకు తను నప్పనని తెలుసుకుని, స్వీయ నియంత్రణతో సాంఘిక కథానాయికగా అగ్రనటులకు ధీటుగా తన భావాలను పలికించి పాత్రలను పండించారామె. గాంధీజీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి మహామహులకు సేవలందించారు. ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. ఎనిమిదేళ్ల క్రితం మరణించిన నాటి కథానాయిక కృష్ణకుమారి ఈమెకు స్వయాన చెల్లెలు. దాదాపు 400 చిత్రాల్లో నటించిన జానకి చివరి చిత్రం 2023లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’. దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా చిత్రపరిశ్రమ (1950 నుంచి 2023 వరకు)లో కొనసాగిన షావుకారు జానకి ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 94 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని చూసిన జానకిని తెలుగు వారు ఎప్పటికీ మరచిపోలేరు.


రాజమండ్రి నుంచి చెన్నైకి

షావుకారు జానకి 1931 డిసెంబరు 12న రాజమండ్రిలో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి టేకుమళ్ల వెంకోజీ రావు. తల్లి శచీదేవి. ఈ దంపతులకు మొత్తం 13 మంది పిల్లలు. చివరకు వీళ్లలో నలుగురే మిగిలారు. తండ్రి పూర్వీకులు మరాఠీవారు. అందువల్ల ఇంట్లో మరాఠీ, కన్నడ కూడా మాట్లాడేవారు. జానకికి వాళ్ల అమ్మమ్మ పేరు ‘జానకీబాయ్‌’ అని పెట్టారు. భారత తొలిరాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు వెంకోజీరావు అంటే చాలా ఇష్టం. ఆయనే వెంకోజీరావును ఇంగ్లాండ్‌ పంపించడానికి ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు ఆయన గాంధీజీ అనుచరునిగా ‘కల్లుమానండోయ్‌’ అంటూ ఊరూరా ప్రచారం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. లండన్‌ నుంచి వచ్చాక ‘ఆంధ్రాపేపర్‌ మిల్స్‌’ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. వెంకోజీరావు సముద్రం దాటి వెళ్లడంతో రాజమండ్రిలోని వారి బంధువులు ఆ కుటుంబాన్ని బహిష్కరించారు. జానకి రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో సెకండ్‌ ఫారం ముగిసిన తరువాత వారి కుటుంబం చెన్నై చేరింది. ఆ తరువాత ఆమె మద్రాసులోని ఆంధ్రమహిళాసభలో చదువుకున్నారు.

స్వాతంత్య్ర సమరయోధులతో...

ఆంధ్ర మహిళా సభలో దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌తో ఆమె సన్నిహితంగా మెలిగారు. అక్కడే ఆమె నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. జానకి చేత రాధ, రుక్మిణి వంటి వేషాలు వేయించేవారు దుర్గాబాయ్‌. అలా జానకికి మద్రాసు రేడియోలో ‘బాలానందం’ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. పాలగుమ్మి పద్మరాజు, పీవీ రాజమన్నార్‌, ఆరుద్ర, బుచ్చిబాబు వంటి వారి కథలు రేడియోలో చదివే అవకాశం కలిగింది. ఆ గొంతు విన్న దర్శకనిర్మాత బీఎన్‌ రెడ్డి ఆమె గురించి ఆరా తీసి, తమ సినిమాలో నటించాలని కోరారు. అయితే, అప్పుడు ఆమెకు 15 ఏళ్లే కావడంతో సినిమాలో నటించేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు. 1946లో గాంధీజీ చెన్నై వచ్చినప్పుడు హిందీ ప్రచారసభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన అక్కడున్న మూడు రోజులూ జానకి, ఆమె సోదరి దివంగత నటి కృష్ణకుమారి గాంధీజీకి సహాయకులుగా ఉన్నారు. 1947 నవంబరులో జానకికి రేడియో ఇంజనీర్‌ శంకరమంచి శ్రీనివాస్‌తో వివాహమైంది. పెళ్లి తరువాత జానకి దంపతులు విజయవాడ వెళ్లారు. అక్కడి సత్యనారాయణపురంలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉండేవారు. అక్కడ ఉంటూనే గౌహతి వర్సిటీలో పరీక్షలకు హాజరయ్యారు. వివాహమైన తర్వాత ఆమె కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో బీఎన్‌ రెడ్డి గుర్తొచ్చి, తన భర్త అనుమతితో సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన ‘షావుకారు’ చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ సమయానికి ఆమె ఒక బిడ్డకు తల్లి.


ఏడు దశాబ్దాల నటన

‘షావుకారు’ చిత్రం ఘన విజయం సాధించడంతో ‘షావుకారు’ జానకి ఇంటి పేరుగా మారిపోయింది. 1950 నుంచీ 1973 వరకూ కథానాయికగా వెండితెరపై వెలిగారు. ఆ తరువాత తల్లిగా, అక్కగా, వదినగా, బామ్మగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. జానకి నటించిన వందల చిత్రాల్లో ‘కన్యాశుల్కం’, ‘రోజులు మారాయి’; ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘అక్కాచెల్లెళ్ళు’, ‘పసుపు కుంకుమ’, ‘జయం మనదే’, ‘సొంత ఊరు’, ‘తాయారమ్మ బంగారయ్య’, ‘మజ్ను’, ‘సంసారం ఒక చదరంగం’ వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ఉన్నాయి.

నాటకాలతోనూ బిజీ

ఆ రోజుల్లో దర్శకుడు బాలచందర్‌ ఆధ్వర్యంలో ‘రాగిణి రిక్రియేషన్స్‌’ సంస్థ తమిళనాట నాటకాలు ప్రదర్శించేది. ‘మెళుగువత్తి’, ‘నీర్‌కుమిళి’, ‘ఎదిర్‌నీచ్చల్‌’ వంటి నాటకాల్లో జానకి ప్రధాన పాత్రలు పోషించేవారు. సినిమాల్లో మంచి పారితోషికం తీసుకొనే ఆవిడ ఈ నాటకాల్లో ఉచితంగా నటించడం విశేషం.

సాయి భక్తురాలు

జానకి కుటుంబ సభ్యులు షిరిడీ సాయిని పూజించే వారు. చిన్నతనంలో అదే మార్గాన్ని అనుసరించేవారు. నటిగా స్థిరపడ్డాక పుట్టపర్తి సత్యసాయి ఆరాధనను మొదలుపెట్టారు.

దాదాపు నాలుగు తరాల నటీనటులతో కలిసి నటించారు జానకి. ఆమెతో కలిసి పనిచేసిన నలుగురు సినీ నటులు ముఖ్యమంత్రులయ్యారు. వారిలో తెలుగులో ఎన్టీ రామారావు, తమిళంలో కరుణానిధి, డాక్టర్‌ ఎంజీఆర్‌, జయలలిత ఉన్నారు.

పాకశాస్త్ర ప్రావీణ్యం

జానకి మంచి నటి మాత్రమే కాదు పాకశాస్త్ర ప్రావీణ్యురాలు. చిత్ర ప్రముఖుల్లో చాలా మంది ఆవిడ చేతి వంట రుచి చూసిన వారే. రకరకాల వంటలు వండటంలో గల అనుభవంతో చెన్నైలో ‘ది కోకోనట్‌ గ్రోవ్‌’ పేరుతో కొంత కాలం రెస్టారెంట్‌ నడిపారు.


షావుకారు జానకిని తెలుగు ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదన్న చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది. అందుకే తెలుగులో వచ్చిన అవార్డులు, రివార్డులతో పోలిస్తే తమిళంలోనే అధికం. తమిళంలో కలైమామణి, కన్నడంలో ‘వాక్చిత్ర అమృతోత్సవ’, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు ఆమెను వరించాయి. 1985లో అరిజోనాలోని వరల్డ్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ అందించింది. 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఎన్టీఆర్‌తో చిత్ర బంధం

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘షావుకారు’లో హీరోయిన్‌గా జానకి నటించారు. ఆ తర్వాత చాలా చిత్రాల్లో వీరి జంట ప్రేక్షకులను అలరించింది. ఆయన నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం ‘పిచ్చి పుల్లయ్య’లో జానకి కూడా ఓ నాయికగా నటించారు. ఎన్టీఆర్‌ సరసన కృష్ణకుమారి ఆ చిత్రంలో నటిస్తే, అమరనాథ్‌ పక్కన జానకి నటించారు. మరో విశేషం ఏమిటంటే ఎన్‌.ఎ.టి. వారి బ్యానర్‌ లోగోలో వేంకటేశ్వర స్వామి విగ్రహానికి పక్కనే లక్ష్మీదేవిగా జానకిని కూర్చోబెట్టి టైటిల్స్‌లో చూపించడం. ‘పాండురంగ మహాత్య్మం’ చిత్రం నుంచి ఇలా లోగోలో జానకి కనిపించడం మొదలైంది. ‘సంసారం ఒక చదరంగం’ చిత్రంలో చిలకమ్మ పాత్రకు నంది అవార్డ్‌ పొందారు జానకి. ఆ అవార్డ్‌ను ఆ నాటి ముఖ్యమంత్రి, తన తొలి చిత్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు.

ఇవి కూడా చదవండి:

మామ ‘కాకా’.. అల్లుడు ‘రాకా’.. సరికొత్త సెంటిమెంట్

‘కదిరి నరసింహుడు’ కాదు.. ‘మెగా158’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. అరాచకం అంతే!

షావుకారు జానకి జ్ఞాపకాల్లో సినీ పరిశ్రమ

Updated Date - Aug 22 , 2026 | 10:50 AM