సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఇరుముడి’ వేదికపై బూతులు.. రవితేజ, అజయ్‌ ఘోష్‌పై నెటిజన్ల ఫైర్

ABN, Publish Date - Aug 17 , 2026 | 01:47 PM

సినిమా ఈవెంట్స్‌లో సెలబ్రిటీలు నోరు జారడం, అసభ్యపదాలను ఉపయోగించడం ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూశాం. వాటిపై రకరకాల విమర్శలు, చర్చలు కూడా జరిగాయి.

సినిమా ఈవెంట్స్‌లో సెలబ్రిటీలు నోరు జారడం, అసభ్యపదాలను ఉపయోగించడం ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూశాం. వాటిపై రకరకాల విమర్శలు, చర్చలు కూడా జరిగాయి. తాజాగా ఇలాంటి పరిణామం ‘ఇరుముడి’ (Irumudi) సినిమా ప్రీ రిలీజ్‌ వేదికగా జరిగింది. మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రమిది. ఈ వేడుకలో రవితేజ(Raviteja), అజయ్‌ ఘోష్‌ (Ajay Ghosh) చేసిన పదప్రయోగాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అజయ్‌ ఘోష్‌ స్పీచ్‌లో వినిపించిన రెండు అభ్యంతరకరమైన పదాలపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘మాస్‌ జాతర’ షూటింగ్‌ టైమ్‌లో జరిగిన ఓ సరదా సంభాషణను గుర్తు చేసుకుంటూ అక్కడ మాట్లాడుకున్న మాటల్లో రెండు పదాలను ఈ వేదికపై ఫ్లోలో అనేశారు అజయ్‌ ఘోష్‌. వేదిక ముందు కూర్చొని ఉన్న రవితేజను ఈ సినిమాలో ఆయనకు కూతురిగా నటించిన నక్షత్ర కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ఒకటి ‘నాకు నిక్ నేమ్ పెట్టమంటే ఏమని పెడతారు'.. అని  అడగగా  'ముదురు ము...'  అని రవితేజ  నవ్వుతూ అన్నారు. 

మామూలుగా సినిమా వేడుకల్లో ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సినిమా టైటిల్‌ ‘ఇరుముడి’ కావడం, అయ్యప్ప స్వామి భక్తుడి నేపథ్యంలో సాగే కథ కావడంతో చర్చ మొదలైంది.
‘ఇరుముడి’ అనేది అయ్యప్ప భక్తులకు ఎంతో పవిత్రమైన పదం. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి మాలధారణలో  కనిపిస్తున్నారు. అంతే కాకుండా చిత్రంలో భక్తి అంశాలతోపాటు తండ్రీకూతుళ్ల అనుబంధం, క్రైమ్‌ మిస్టరీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కిందని మేకర్స్‌ ఇప్పటికే చెప్పారు. పవిత్రమైన టైటిల్‌ పెట్టి, భక్తి ప్రాధాన్యం ఉన్న సినిమా ప్రచార కార్యక్రమంలో ఇలాంటి పదప్రయోగాలు చేయడం ఎంత వరకూ కరెక్ట్‌ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు అజయ్‌ ఘోష్‌ గురించి మాట్లాడుతూ ‘ఆ బూతులు ఏంటయ్యా’ అంటూనే ఆ సందర్భంలో అది కరెక్ట్‌ ఎమోషన్‌ అంటూ సమర్థించారు రవితేజ. ఇప్పుడు వీరిద్దరి స్పీచ్‌లు వైరల్‌ అవుతున్నాయి. రవితేజ, అజయ్‌ఘోష్‌లను తప్పుబడుతూ ట్రోల్‌ చేస్తున్నారు.


రవితేజకు  మాస్‌ హీరోగా పెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన ప్రతి మాట మీద జనాల దృష్టి ఉంటుంది. అలాగే అజయ్‌ ఘోష్‌ కూడా తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. 'అనుభవం గల ఇద్దరూ నటులు బహిరంగ వేదికగాపై మాట్లాడే సమయంలో కాస్త ఆచితూచి మాట్లాడాలి' అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. అభిమానులకు మీరిచ్చే సందేశం బూతులేనా అంటూ మండిపడుతున్నారు. ఇంతకు ముందు కూడా చాలా వేడుకల్లో సినీ ప్రముఖులు ఈ తరహా వ్యాఖ్యల కారణంగా విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వివరణ ఇచ్చారు. బహిరంగ క్షమాపణలు చెప్పారు. మరీ రవితేజ, అజయ్ ఘోష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Updated Date - Aug 17 , 2026 | 03:07 PM