ఆల్ ఇండియా నంబర్ వన్ హీరోయిన్‌గా రశ్మిక!
ABN , Publish Date - Sep 03 , 2026 | 05:22 PM
రశ్మిక మందణ్ణ క్రేజ్ ఆలిండియా స్థాయిలో రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఆమె 'మూడ్ ఆఫ్ నేషన్' సర్వేలో నెంబర్ వన్ గా నిలిచింది.
'మైసా' లుక్ తోనే 'కైసా హో గయా యైసా స్టార్' అనిపించుకుంది రశ్మిక మందణ్ణ. అంతేనా? 'మూడ్ ఆఫ్ ద నేషన్' సర్వేలో 'నంబర్ వన్ హీరోయిన్'గానూ నిలిచారు రశ్మిక. తెలుగువారి కోడలు కాగానే రశ్మిక తీరే మారిపోయిందనీ అంటున్నారు జనం.
కన్నడ కస్తూరిలా గుబాళిస్తూ తెలుగువారిని వచ్చీరాగానే చుట్టేసింది రశ్మిక మందణ్ణ అందం. 'గీత గోవిందం' ఘనవిజయం తరువాత రశ్మిక - విజయ్ దేవరకొండ ప్రేమాయణం మొదలయింది. ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా సాగుతున్నారు. పెళ్ళయిన తరువాత విజయ్- రశ్మిక జోడీగా నటించిన 'రణబాలి' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మళ్ళీ 'గీత గోవిందం' రేంజ్ లో ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అంతకు మించి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ - రశ్మిక జోడీ పెళ్ళయిన తరువాత నటించిన మూవీ కాబట్టి 'రణబాలి'కి క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ మీడియా సంస్థ నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ద నేషన్'లో ఆల్ ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్ గా రశ్మిక మందణ్ణ నిలవడం విశేషంగా మారింది.
'పుష్ప' సిరీస్ తో రశ్మిక మందణ్ణకు నార్త్ లోనే ఓ స్పెషల్ క్రేజ్ లభించింది. హిందీలో రశ్మిక నటించిన 'ఛావా, యానిమల్' చిత్రాలు బంపర్ హిట్స్ గా నిలిచాయి. "మిషన్ మజ్ను, సికందర్, కాక్ టెయిల్ 2" వంటి సినిమాలు అంతగా అలరించక పోయినా రశ్మిక అందం, అభినయం ఆల్ ఇండియా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. రశ్మిక నటించిన 'తమ్మా' పాన్ ఇండియా మూవీగా రిలీజై అలరించింది. ఇప్పుడు రశ్మిక ప్రధాన పాత్రలో రూపొందిన 'మైసా' నవంబర్ లో జనం ముందుకు రానుంది. ఈ సినిమాలోని రశ్మిక లుక్ ఈ మధ్య రిలీజై జనాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అలా జయాపజయాలతో సాగుతోన్న రశ్మిక ఇప్పుడు నంబర్ వన్ హీరోయిన్ అయ్యారు. ఇంతకు ముందు ఆల్ ఇండియా నంబర్ వన్ నాయికగా ఉన్న దీపికా పదుకోణెను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు. దాంతో రశ్మిక పేరును ఫ్యాన్స్ మరింతగా స్మరించుకోవడం విశేషం.
రశ్మికకు పెళ్ళికాక ముందు బంపర్ హిట్స్ ఉన్నా, పెళ్ళయ్యాకే 'భారతదేశంలోనే అగ్రకథానాయిక'గా నిలిచారు. అలా తెలుగువారి కోడలైన తరువాతే రశ్మికకు కలసి వచ్చిందని కొందరు అంటున్నారు. రశ్మిక భర్త విజయ్ దేవరకొండ, అత్తమామలు సైతం ఆమెను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. రశ్మిక విజయాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి దాకా ఆల్ ఇండియాలో తమదైన బాణీ పలికించిన అలియా భట్, శ్రద్ధా కపూర్ సైతం రశ్మిక తరువాతి స్థానాల్లోనే సరిపుచ్చుకోవడం గమనార్హం. 'రామాయణ' భారీ చిత్రంలో నటించిన సాయిపల్లవి రశ్మిక తరువాత నాలుగో స్థానంలో నిలిచారు. 'మూడ్ ఆఫ్ ద నేషన్'లో యువత రశ్మికకే ఓటేశారు. ఇలా నంబర్ వన్ గా సాగుతోన్న రశ్మిక అక్టోబర్ 16న తన భర్త విజయ్ తో కలసి నటించిన 'రణబాలి'తో ముందుగా పలకరిస్తారు. ఆ తరువాత నవంబర్ లో 'మైసా'గా అలరిస్తారు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తే రశ్మిక జర్నీ మరో రేంజ్ లో సాగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరి 'రణబాలి'తో కొత్తగా పెళ్ళయిన జంట ఏ స్థాయి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
హీరోయిజం కాదు.. ఇప్పుడు దర్శకులదే హవా
‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ డేట్ ఫిక్స్.. వర్కవుట్ అవుతుందా
Pakeezah: అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో రీస్టోర్డ్ వెర్షన్ ప్రీమియర్