Rashmika Mandanna: ‘ఇరుముడి’ చూసి ఫిదా అయిన విరోష్ జంట.. రవితేజ, శివపై ప్రశంసల వర్షం
ABN, Publish Date - Aug 25 , 2026 | 03:11 PM
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రాన్ని వీక్షించిన రష్మిక స్పందించారు.
రవితేజ (Raviteja) హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రాన్ని వీక్షించిన విరోష్ జంట స్పందించారు. సోమవారం రాత్రి రష్మిక, విజయ్ దేవరకొండ (Virosh) సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.‘ఇరుముడి’ సినిమా చూసా. అందమైన సినిమా ఇది. ఈ చిత్రం నన్ను ఊహించని విధంగా కదిలించింది. సినిమా చూస్తున్నంతసేపు భావోద్వేగానికి లోనయ్యాను. సాధారణంగా మనం చిన్న పట్టణాల్లో పెరిగినప్పుడు ఏ సమస్య ఎదురైనా, మనకు ఏదైనా బాధ కలిగినా.. ముందుగా ఇంట్లోని పెద్దలకు చెప్పాలని అనుకుంటాం. అది మనలో ఉండే అమాయకత్వం. కానీ క్రమంగా వాస్తవ పరిస్థితులు మనకు అర్థమవుతాయి. ఏం జరిగినా సరే మౌనంగా ఉండాలని, ఎవరికీ చెప్పకూడదని మనకు చెబుతారు. ‘ఇరుముడి’ అలాంటి ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పింది. మాట్లాడాల్సిన విషయాన్ని ఎంతో అందంగా, సున్నితంగా తెరపై చూపించారు. అందుకే ఈ సినిమా నాకు ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్‌గా అనిపించింది. రవితేజ గారికి హృదయపూర్వక అభినందనలు. మీరు అందుకున్న విజయం నాకెంతో ఆనందం కలిగించింది. మీరు ఈ విజయానికి పూర్తిగా అర్హులు. ఇక నక్షత్ర.. నువ్వు సినిమాలో నిజంగా సన్‌షైన్‌లా ఉన్నావు. నీ చిరునవ్వు నన్ను కూడా నవ్వించింది. నీ నటన చాలా అందంగా ఉంది. నీకు చాలా చాలా అభినందనలు స్వీటీ. శివ నిర్వాణ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. ఇలాంటి అందమైన సినిమాను తెరకెక్కించినందుకు, ప్రేక్షకులకు మంచి విషయాన్ని చెప్పిన మీకు ధన్యవాదాలు. ఈ విజయానికి మీరు పూర్తిగా అర్హులు.‘ఇరుముడి’ చిత్రబృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి మంచి సినిమాను అందించినందుకు ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.
విజయ్ దేవరకొండ కూడా సినిమాపై స్పందించారు. ''తెలుగు సినిమా థియేటర్లలో అద్భుతమైన వాతావరణం నెలకొంది! రవితేజ అన్న, నా డార్లింగ్ శివ నిర్వాణ కలిసి తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.‘ఇరుముడి’ సినిమా ఇచ్చే సందేశం కోసం తప్పక చూడాల్సిన సినిమా. టీమ్ అందరికి నా తరఫున ప్రేమతో అభినందనలు తెలుపుతున్నాను' అని పేర్కొన్నారు.