సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rashmika Mandanna: స్టార్‌డమ్‌ వెనుక ఇంత పోరాటమా? రష్మిక తన జీవితంలోని తెలియని కోణాలు  

ABN, Publish Date - Oct 04 , 2026 | 08:43 AM

కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టి ‘నేషనల్‌ క్రష్‌’గా మారిన రష్మిక మందన్నలో ఆ అమాయకత్వం, ఒద్దిక అస్సలు మారలేదు.

కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టి ‘నేషనల్‌ క్రష్‌’గా మారిన రష్మిక మందన్నలో (Rashmika Mandanna)ఆ అమాయకత్వం, ఒద్దిక అస్సలు మారలేదు. 500 కోట్ల వసూళ్లు సాధించిన మూడు చిత్రాల్లో నటించిన తొలి భారతీయ కథానాయికగా చరిత్ర సృష్టించినా.. కెమెరా వెనుక మాత్రం ఆమె ఒక సాధారణ అమ్మాయి. తాజాగా వోగ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన స్టార్‌డమ్‌, భయాలు, విమర్శలపై పంచుకున్న విశేషాలు ఇవి.


నాకు హైదరాబాద్‌ అంటే సొంత ఇంట్లో ఉన్నంత హాయిగా ఉంటుంది. షూటింగ్‌ పనులన్నీ ముగిసిన తర్వాత అర్ధరాత్రివేళ నాతో మాట్లాడినా నాలో అలసట కనిపించదు. నాలో ఉన్న ఈ అపరిమితమైన సహనశక్తి చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సెలబ్రిటీగా స్క్రీన్ పై మెరవడం.. వందల మంది మధ్య వెలుగులో నిలబడటం చాలామందికి చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ నా విషయానికి వస్తే కెమెరా ముందు నిలబడటం.. ఒక్కోసారి తలమీద తుపాకి పెట్టినంత భయంగా అనిపిస్తుంది. నా రూపం చూసి ప్రేక్షకులు ఎక్కడ నిరాశ చెందుతారో అని ఆందోళన చెందుతుంటాను. నా అభిమానులు నన్ను ఎలా చూసి అభిమానించారో, ఆ సహజత్వానికి భిన్నంగా కనిపిస్తే వారి నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసినదాన్ని అవుతానేమోనన్న భయం నన్ను నిరంతరం వెంటాడుతుంది.

‘కాదనలేని’ నైజం

నా జీవితంలో నేను ఎవరికీ ‘నో’ చెప్పాలని అనుకోను. ‘నో’ చెప్పడం నాకు చాలా కష్టమైన విషయం. ఒకవేళ ఏదైనా పనికి నేను ‘నో’ చెబితే వారు ఎక్కడ బాధపడతారో, ఎక్కడ నన్ను ద్వేషిస్తారో అన్న భయం మొదలవుతుంది. అందుకే షూటింగ్‌ సెట్‌లో నా యాంగిల్స్‌ నాకు బాగా తెలిసినప్పటికీ.. ఫొటోగ్రాఫర్‌ ఏది చెబితే దానికి సై అంటాను. వారు అడిగితే తప్ప నా సొంత ఆలోచనను వారిపై రుద్దను. నా సొంత భావాల కంటే ఇతరుల భావాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. చిన్నప్పటి నుంచే నాకు ‘నరుటో’ వంటి జపనీస్‌ యానిమేషన్‌  సిరీస్లు  అంటే  పిచ్చి. పన్నెండేళ్ల వయసులోనే ఆ పాత్రల నుంచి పట్టుదల, పరోపకారం, సహానుభూతి, నటనలో వ్యక్తపరచాల్సిన రకరకాల హావభావాల నిగూఢ అర్థాలను నేర్చుకున్నాను.

నొప్పుల మధ్య నవ్వులపాట

నాకు హైదరాబాద్‌ అంటే సొంత ఇంట్లో ఉన్నంత హాయిగా ఉంటుంది. షూటింగ్‌ పనులన్నీ ముగిసిన తర్వాత అర్ధరాత్రివేళ నాతో మాట్లాడినా నాలో అలసట కనిపించదు. నాలో ఉన్న ఈ అపరిమితమైన సహనశక్తి చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇటీవలే ‘మైసా’ సినిమా షూటింగ్‌ కోసం ఒక భారీ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ షూట్‌ చేస్తున్న సమయంలో నా తుంటి భాగానికి చెందిన టెండన్‌ కండరం తీవ్రంగా దెబ్బతింది. విపరీతమైన నొప్పితో కాలు పైకి లేపలేని పరిస్థితి వచ్చే వరకు నేను డ్యాన్స్‌ చేస్తూనే ఉన్నాను. వైద్యులు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని హెచ్చరించే వరకు నేను ఆపలేదు. నిజానికి భరించలేని నొప్పి అనిపించినప్పుడు బిగ్గరగా నవ్వేస్తుంటాను. ఇది వినడానికి కాస్తంత విచిత్రంగా, పిచ్చిగా అనిపించవచ్చు. కానీ ఆ నొప్పిని అధిగమించడానికి నాకదే ఒక మంత్రంలా పనిచేస్తుంది. ఆ గాయం సమయంలో కూడా సోషల్‌ మీడియాలో నా శరీర నిర్మాణ శాస్త్రాన్ని సరదాగా వివరిస్తూ, వర్కవుట్లు చేయకుండా ‘డెజర్ట్‌ మాన్‌స్టర్‌’గా మారానని, పజిల్స్‌ పూర్తిచేయడంలో నాకున్న ప్రతిభను కొత్తగా కనుగొన్నానని అభిమానులతో పంచుకున్నాను.

వాటిలో రీటేకులు ఉండవు

నా ఇన్‌స్టాగ్రామ్‌ను గమనిస్తే నా వ్యక్తిత్వంలోని మరో కోణం కనిపిస్తుంది. ఇటీవల నేను నా బృందానికి ఒక పాత మోడల్‌ డిస్పోజబుల్‌ కెమెరా ఇచ్చి ‘మీకు ఏది తోస్తే అది క్లిక్‌ చేయండి’ అని చెప్పాను. ఆ ఫొటోలు ప్రింట్‌ అయ్యాక చూసుకుంటే నాకెంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ ఫొటోల్లో రీటేకులు ఉండవు. యాంగిల్స్‌ మార్చలేం. కేశాలంకరణను సరిచేయలేం. ఎలాంటి డిజిటల్‌ ఫిల్టర్లు జోడించలేం. ఆ క్షణం ఎలా ఉందో, అలాగే మన కళ్లముందు నిలిచిపోతుంది.

నిరంతర పోరాటం

చిత్ర పరిశ్రమలో నా ప్రయాణాన్ని గమనిస్తే, ఇక్కడ నా ఉనికిని నిలుపుకోవడానికి నేను నిరంతరం పోరాడాల్సి వస్తోంది. కానీ నాపై పడే కాంతి వెలుగుల్లో నిలబడేందుకు నన్ను నేను నిరంతరం మలచుకుంటూనే ఉంటాను. గత మూడేళ్ల వ్యవధిలోనే భారతీయ సినిమా చరిత్రలో వరుసగా రూ. 500 కోట్ల వసూళ్లు సాధించిన మూడు చిత్రాల్లో (యానిమల్‌, పుష్ప-2, ఛావా) నటించిన తొలి భారతీయ కథానాయికగా ఘనత సాధించినప్పటికీ నా దృష్టి ఎప్పుడూ కొత్త సవాళ్లపైనే ఉంటుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా రాబోయే భారీ ప్రాజెక్టులపైనే ఉంది.ప్రధానంగా గిరిజన యువతిగా పూర్తి రా అండ్‌ రస్టిక్‌ లుక్‌లో, నీటి అడుగుల యాక్షన్‌ ఘట్టాలతో చేస్తున్న ‘మైసా’ సినిమా నా నట జీవితంలో సరికొత్త మైలురాయిగా నిలవబోతోంది. అలాగే, భర్త విజయ్‌ దేవరకొండ సరసన 18వ శతాబ్దం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న‘రణబాలి’ చిత్రంలో జయమ్మ పాత్రలో కనిపించబోతున్నాను.నేటి గ్లామర్‌ ప్రపంచంలో హీరోయిన్లు బోల్డ్‌గా, గ్లామర్‌సగా కనిపించడానికి ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో.. నాలో ఉన్న ఒక పాతకాలపు సహజమైన అమాయకత్వమే నన్ను ప్రేక్షకులకు దగ్గర చేసిందేమో అనిపిస్తుంది. ‘థామా’, ‘కాక్‌టైల్‌ 2’ వంటి సినిమాల్లో గ్లామరస్‌ పాత్రలు చేసినా.. నా ముఖంలో కనిపించే ఆ సహజత్వం ఎప్పటికీ మారిపోదు. దీనికితోడు నేను ఇతరుల భావోద్వేగాలను చాలా త్వరగా పసిగడతాను. నా ఆత్మీయులకు ఏదైనా చెడు జరుగుతుంటే ‘ఆ కష్టం ఏదో నాకే రావొచ్చు కదా’ అని దేవుడిని వేడుకునేంతటి భావోద్వేగం నాలో ఉంది.

ఉచ్చారణపై ట్రోల్స్‌

సినిమా ప్రయాణంలో నా భాష, యాస, ఉచ్చారణపై సోషల్‌ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రోల్స్‌ నన్ను ఎంతగానో ఆలోచింపజేస్తుంటాయి. నిజానికి నా మాతృభాష కొడవ తక్క. ఇది చాలా చిన్న సమాజం మాట్లాడే భాష. మా భాషకు ప్రత్యేకంగా ఏ సినిమా పరిశ్రమ లేదు. కాబట్టి నేను వేరే భాషల్లో నటిస్తూ నా కెరీర్‌ను నిర్మించుకోవాల్సి వచ్చింది. అందుకే నాకు భాష ఎప్పుడూ ఒక సరిహద్దు కాలేదు. అన్ని భాషలను నా సొంత భాషలుగానే పరిగణిస్తాను. కన్నడలో ‘కిరిక్‌ పార్టీ’తో మొదలైన నా ప్రయాణం.. అభిమానుల ప్రోత్సాహంతో తెలుగులో ‘ఛలో’, తమిళంలో ‘సుల్తాన్‌’, హిందీలో ‘గుడ్‌ బై’ వరకు సాగింది. ఇవన్నీ నేను ముందుగా పథకం ప్రకారం చేసుకుంటూ వచ్చింది కాదు, అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. కొందరు నా ఉచ్చారణపై కామెంట్లు చేస్తుంటారు. నేను ఏ ఒక్క భాషలోనూ పండితురాలిని అని చెప్పుకోను. నేను ‘జాక్‌ ఆఫ్‌ ఆల్‌ ట్రేడ్స్‌.. మాస్టర్‌ ఆఫ్‌ నన్‌’ ( అన్నింటిపై అవగాహన ఉండి.. దేనిలోనూ సంపూర్ణ ప్రావీణ్యం లేని వ్యక్తి) లాంటిదాన్ని. నాకు ప్రామాణికమైన భాషా నైపుణ్యం ఉందా? లేదా? అనే దానికంటే.. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులతో వారి సొంత భాషలో మాట్లాడగలుగుతున్నానా? లేదా? అనేదే ముఖ్యం. అభిమానుల భాషలో మాట్లాడటాన్ని నేను వారికి ఇచ్చే గౌరవంగా భావిస్తాను. సెట్‌లోకి వెళ్లామా? దర్శకుడు కోరినట్టుగా చేశామా? మన ప్రతిభను నిరూపించుకున్నామా.. అనే దానిపైనే నా దృష్టి ఉంటుంది తప్ప , ప్రతి విమర్శకు సమాధానం ఇస్తూ అనవసరమైన మాటల మధ్య కాలం వృథా చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ట్రోల్స్‌ కంటే నా నటన, నా ప్రేక్షకులు ఇచ్చే ప్రేమే నన్ను ముందుకు నడిపించే ఇంధనం.

ALSO READ:
Pawan Kalyan: సింగీతం శ్రీనివాసరావు మృతి.. పవన్‌ కల్యాణ్‌ తీవ్ర సంతాపం

చిత్రసీమలో తీవ్ర విషాదం: సీనియర్ దర్శకుడు సింగీతం మృతి


భారతీయ సినిమాకు తీరని లోటు: నందమూరి బాలకృష్ణ


వైవిధ్య చిత్రాల రూపశిల్పి... సింగీతం!

Updated Date - Oct 04 , 2026 | 09:58 AM