రణబాలి ఓవర్సీస్.. ఇతర భాషల్లో వెనక్కి వెళ్లినట్టేనా
ABN, Publish Date - Oct 11 , 2026 | 09:36 AM
విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రణబాలి’.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రణబాలి’ (Ranabaali). రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 16, 2026న థియేటర్లలోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఓవర్సీస్ రిలీజ్‌కు (Overseas release)సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. తొలిరోజు విదేశాల్లో ఈ సినిమాను కేవలం తెలుగు వెర్షన్‌లోనే విడుదల చేయనున్నట్లు డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. డబ్బింగ్ వెర్షన్లను అక్టోబర్ 23న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. డబ్బింగ్ కంటెంట్ సిద్ధం చేయడంలో ఆలస్యం కావడమే ఇందుకు కారణమని సమాచారం.
ఓవర్సీస్‌లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రధాన థియేటర్ చైన్లలో టికెట్ బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ప్రీ సేల్స్ 50 వేల డాలర్ల మార్కును దాటినట్లు సమాచారం. సినిమా ప్రీమియర్ షోల సమయానికి ఈ వసూళ్లు ఎంతవరకు చేరుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు. సంగీత ద్వయం అజయ్-అతుల్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.