రామ్ చరణ్ మాస్ రాంపేజ్.. తొలి రోజే సెంచరీ దాటిన 'పెద్ది'
ABN, Publish Date - Jun 05 , 2026 | 01:03 PM
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన పెద్ది (Peddi) జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొద్ది రోజులుగా బాక్సాఫీస్ వద్ద సరైన భారీ సినిమాలు లేక వెలవెలబోయిన థియేటర్లకు ఈ సినిమా సరికొత్త కళను తీసుకొచ్చింది. ట్రేడ్ వర్గాల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం మొదలుపెట్టింది. రామ్ చరణ్ మాస్ క్రేజ్, బుచ్చిబాబు అద్భుతమైన టేకింగ్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించాయి.
తాజాగా చిత్ర యూనిట్ ‘పెద్ది’ సినిమా తొలి రోజు అధికారిక కలెక్షన్ల వివరాలను ప్రకటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ. 135.36 కోట్లకు పైగా భారీ గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తొలిరోజే వంద కోట్ల క్లబ్ లో ఎంటర్ అయిన చెర్రీ.. ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్’తో ఆశించిన స్థాయిలో మెప్పించ లేకపోయినా, ఇప్పుడు ‘పెద్ది’తో ఆ లోటును పూర్తిగా భర్తీ చేసేశారు. చరణ్ కెరీర్‌లోనే కాకుండా, ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఆల్ టైం రికార్డు ఓపెనర్‌గా నిలిచి ఈ చిత్రం సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది.
గతంలో ఒక సినిమా ఈవెంట్‌లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, రామ్ చరణ్‌ను ఉద్దేశించి... 'ఆయన వేటాడటం మొదలుపెడితే సాలిడ్ గానే ఉంటుంది' అని చెప్పిన మాటలను చరణ్ ఇప్పుడు అక్షరాలా నిజం చేసి చూపించారు. అందుకే అభిమానులు ఆయనను ‘మిస్టర్ బాక్సాఫీస్’ అని ముద్దుగా పిలుచు కుంటున్నారు. మొదటి రోజు ఊచకోత కోసిన పెద్దిగాడు, రెండో రోజు కూడా అదే స్థాయి సాలిడ్ బుకింగ్స్, భారీ ఆక్యుపెన్సీలతో దూసుకుపోతున్నాడు. కలెక్షన్ల పరంగానే కాకుండా, రామ్ చరణ్ తన నటనతో మరో మెట్టు ఎక్కాడని, ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, దివ్వేంద్ శర్మ, జగపతి బాబు, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో మెరిశారు. బలమైన కథ, భారీ తారాగణం తోడు కావడంతో ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని అద్భుతమైన రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. విశేషం ఏమంటే... బుచ్చిబాబు సానా తొలి చిత్రం 'ఉప్పెన' టోటల్ కలెక్షన్ రూ. 100 కోట్లు కాగా, మలి చిత్రం 'పెద్ది' మొదటి రోజునే ఆ గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
మరి రాబోయే రోజుల్లో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించి, ఫుల్ రన్‌లో ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
వారణాసి.. ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందా?
Vijay: ‘జననాయకన్’ విడుదలపై సందిగ్ధత.. డిస్ట్రిబ్యూటర్ల డబ్బు వెనక్కి ఇచ్చేందుకు నిర్మాత సిద్ధం?
Rashmika Mandanna: ఆ పాత్రలో నటించేందుకు.. ముందు భయపడ్డా...