అరకు కాఫీతో పోటీకి రకుల్.. విదేశీ బ్రాండ్‌తో కొత్త బిజినెస్
ABN, Publish Date - Nov 14 , 2026 | 02:44 PM
అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న వేళ.. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preeth Singh) మాత్రం విదేశీ కాఫీ బ్రాండ్‌తో భారత మార్కెట్లోకి అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. భర్త జాకీ భగ్నానీతో కలిసి ఆమె కాఫీ వ్యాపారంలోకి ప్రవేశించారు. ప్రముఖ కెనడియన్ స్పెషాలిటీ కాఫీ బ్రాండ్ ‘బ్లెంజ్’ (BLENZ) తొలి ఔట్‌లెట్‌ను ముంబైలో ప్రారంభించారు. ముంబైకే పరిమితం కాకుండా హైదరాబాద్ సహా దేశంలోని ఇతర ప్రధాన నగరాలు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఈ బ్రాండ్‌ను విస్తరించేందుకు రకుల్ దంపతులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సుమారు 50 ఔట్లెట్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిసింది. దీంతో సినీ రంగంలో సంపాదించిన గుర్తింపును వ్యాపార రంగంలోనూ ఉపయోగించుకునే దిశగా రకుల్ అడుగులు వేస్తున్నారు.
ఇదే సమయంలో అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026లో అరకు కాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ కాఫీని రుచి చూసి ప్రశంసించడం విశేషం. గిరిజన రైతులు పండిస్తున్న అరకు కాఫీని ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మరోవైపు నటి కాజల్ అగర్వాల్ (kajal Agarwal) అరకు ప్రాంతంలోని గిరిజన పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించే కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలా కొందరు సినీ ప్రముఖులు స్థానిక ప్రాంతాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తుంటే.. రకుల్ మాత్రం విదేశీ బ్రాండ్‌ను భారత మార్కెట్లో విస్తరించే వ్యాపార ప్రయత్నం చేయడం చర్చనీయాంశమైంది.
అయితే, విదేశీ బ్రాండ్‌ను తీసుకురావడంలో తప్పేమీ లేకపోయినా.. ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్న భారతీయ కాఫీ బ్రాండ్ల మధ్య బ్లెంజ్ ఎంతవరకు ఆదరణ పొందుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అరకు, కూర్గ్, చిక్కమగళూరు వంటి ప్రాంతాల కాఫీలకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలాంటి సమయంలో మరో విదేశీ కాఫీ బ్రాండ్‌కు భారతీయ వినియోగదారులు ఎంతవరకు ఆదరణ చూపిస్తారో చూడాలి.
కాఫీ షాపుల వ్యాపారం ప్రస్తుతం తీవ్ర పోటీతో కూడుకున్న రంగంగా మారింది. పెద్ద ఎత్తున ఔట్లెట్లు, ఫ్రాంచైజీలు ప్రారంభిస్తున్నప్పటికీ నాణ్యత, ధర, రుచి విషయంలో వినియోగదారుల అంచనాలను అందుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా స్థానిక రుచులకు ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్లను ఆకట్టుకోవడం కీలకం. ఈ నేపథ్యంలో రకుల్, జాకీ భగ్నానీ ప్రారంభించిన బ్లెంజ్ కాఫీ వ్యాపారం ఎంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.