రాజమౌళికి దక్కింది.. మరి సందీప్ వంగాకి ఎప్పుడు?

ABN , Publish Date - Jul 24 , 2026 | 02:20 PM

సినీ ఇండస్ట్రీలో కథ కంటే ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేది ఆ సినిమా టైటిల్ మాత్రమే. కొన్నిసార్లు టైటిల్ అనేది కేవలం పేరు మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం, ఒక బ్రాండ్.

Rajamouli and Sandeep Reddy Vanga

సినీ ఇండస్ట్రీలో కథ కంటే ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేది ఆ సినిమా టైటిల్ మాత్రమే. కొన్నిసార్లు టైటిల్ అనేది కేవలం పేరు మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం, ఒక బ్రాండ్. ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు భారీ చిత్రాల టైటిళ్ల చుట్టూ తిరుగుతున్న వార్తలు తీవ్ర ఆసక్తిగా మారాయి. ఒకవైపు ఓ దర్శకుడు చూపించిన అరుదైన ఉదారత అందరి హృదయాలను గెలుచుకుంటుంటే.. మరోవైపు చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్న ఇంకో టైటిల్ పోరాటం ఇండస్ట్రీలో టెన్షన్ పుట్టిస్తోంది!.


దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) - సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) కాంబినేషన్‌లో రాబోతోన్న గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీకి ‘వారణాసి’ (Varanasi) అనే టైటిల్ ఎలాంటి వివాదాలు లేకుండా సునాయాసంగా లభించింది. దర్శకుడు సుబ్బారెడ్డి (Subba Reddy) 2023లోనే తన బ్యానర్‌పై ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకుని కథను కూడా సిద్ధం చేసుకున్నారు. అయినప్పటికీ, రాజమౌళిపై ఉన్న అపారమైన గౌరవంతో, మహేష్ బాబుపై ఉన్న అభిమానంతో రూపాయి కూడా తీసుకోకుండా ఆ టైటిల్‌ను సంతోషంగా ఇచ్చేశారు. ‘టైటిల్ అనేది డబ్బు సంపాదించే వ్యాపార వస్తువు కాదు’ అని సుబ్బారెడ్డి చెప్పిన మాటలు సినీ వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇక ఎస్‌.ఎస్‌. కార్తికేయతో కలిసి కె.ఎల్‌. నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


అయితే, దీనికి పూర్తి భిన్నంగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) - రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) పరిస్థితి మాత్రం చట్టపరమైన చిక్కుల్లో పడింది. స్వతంత్ర తెలుగు చిత్రం ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ నిర్మాతలు తమకే ఈ టైటిల్ హక్కులు ఉన్నాయని గళమెత్తుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ T-సిరీస్ తమకు లీగల్ నోటీసులు పంపి, చివరకు OTT లేదా యూట్యూబ్‌లో కూడా ఈ టైటిల్ వాడకూడదని ఆంక్షలు విధించిందని వారు ఆరోపిస్తున్నారు. చర్చలు విఫలం కావడంతో ఈ వివాదం ఇప్పుడు ఫిలిం ఛాంబర్, సెన్సార్ బోర్డ్‌ల ముందుకు చేరి మరింత ఉత్కంఠగా మారింది. సినిమా టైటిల్స్ కోసమే కోర్టు కేసులు, కోట్ల రూపాయల సెటిల్‌మెంట్లు నడిచే ఈ రోజుల్లో.. ‘వారణాసి’ విషయంలో సుబ్బారెడ్డి చూపించిన పెద్ద మనసు సినీ పరిశ్రమలో ఒక ఆదర్శవంతమైన అధ్యాయంగా నిలిచింది. కానీ ‘స్పిరిట్’ విషయంలో మాత్రం సందీప్ రెడ్డి వంగా టీమ్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోవడంతో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఈ లీగల్ డ్రామాకు ముగింపు ఎప్పుడు లభిస్తుందో అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

‘రా ఎన్టీఆర్’ క్లోజ్ చేస్తున్నాం.. అందరి అనుమానాలివే

Jana Nayakudu: విజయ్‌ జన నాయకుడు రివ్యూ

మా అన్నయ్య మెగాస్టార్‌కు.. నేను పవర్ స్టార్‌కు అభిమానులం: కిరణ్ అబ్బవరం

Updated Date - Jul 24 , 2026 | 02:20 PM