‘రా ఎన్టీఆర్’ క్లోజ్ చేస్తున్నాం.. అందరి అనుమానాలివే

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:07 PM

'రా ఎన్టీఆర్'.. ఈ మధ్య సోషల్ మీడియానే కాకుండా.. టాలీవుడ్ సర్కిల్స్‌లో సైతం హాట్ టాపిక్‌గా మారిన పేరు. ఇప్పుడీ సంస్థను మూసేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది.

Jr NTR and Raw NTR

'రా ఎన్టీఆర్' (RAW NTR).. ఈ మధ్య సోషల్ మీడియానే కాకుండా.. టాలీవుడ్ సర్కిల్స్‌లో సైతం హాట్ టాపిక్‌గా మారిన పేరు. ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులుగా పరిచయం చేసుకుంటూ.. వంద కోట్ల రూపాయలతో ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు చేపడతామని, ఊరు-వాడ పేరుతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని.. ఈ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అనూహ్యంగా ఈ సంస్థ క్లోజ్ అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ‘రా ఎన్టీఆర్’ సంస్థ ప్రకటించింది. అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘సంస్థ క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నించి విజయం సాధించిన వారందరికీ అభినందనలు’ అని సంస్థ ప్రతినిధులు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌పై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఎక్కువగా అనుమానాలే ఉండటం విశేషం.


‘‘ఎందుకు ఈ సంస్థను ప్రారంభించారు? ఇప్పటి వరకు ఏమేం సేవలు చేశారు? ఇప్పుడెందుకు ఈ సంస్థను మూసేస్తున్నారు? నిజంగా సేవ చేసేందుకే ఈ సంస్థను స్థాపించారా? లేదంటే, హీరో పేరు చెప్పుకుని పబ్లిసిటీతో పాటు ఇంకా ఏమైనా ప్లాన్ చేశారా? అసలు వీళ్లంతా ఎవరు?’’ అనేలా ‘రా ఎన్టీఆర్’ ట్వీట్‌కు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు హీరో ప్రమేయం లేకుండా, హీరో చేసినట్లుగానే సేవా కార్యక్రమాలు చేయాలని అనుకోవడం ఏంటి? అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కూడా.. ఈ సంస్థ వెనకడుగు వేయకుండా.. ఇంకా ఇంకా రెట్టించేలా కొన్ని పనులు చేపట్టడం చూసి.. సీరియస్‌గా వార్నింగ్ ఏమైనా వచ్చిందా? అనేలా కూడా డౌట్స్ వ్యక్తమవుతున్నాయి.


ఏదిఏమైనా ఈ మధ్యకాలంలో ఒక అభిమాన సంఘం ఇలా ప్రవర్తించిన దాఖలాలు అయితే లేనే లేవనే చెప్పాలి. ఎన్టీఆర్ అభిమానుల పేరిట ఏర్పాటైనట్లుగా చెప్పుకుంటున్న ఈ సంస్థ.. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందుకోసం రూ.100 కోట్ల నిధులు వినియోగిస్తామని ప్రకటించడంతో.. ఒక్కసారిగా వార్తలలో హైలెట్ అయ్యింది. కాకపోతే, వెంటనే ఎన్టీఆర్ టీమ్ యాక్టివ్ అవడం, ఆ సంస్థకు, ఎన్టీఆర్‌కు సంబంధమే లేదని ప్రకటించడంతో.. ఆదిలోనే ‘రా ఎన్టీఆర్’కు ఎదురుదెబ్బ పడింది. అభిమాన సంఘాల నుంచి కూడా ఈ సంస్థపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో.. ‘రా ఎన్టీఆర్’ ప్రతినిధి సాయిరూప్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్‌కు తమని దూరం చేయడానికి జరుగుతున్న ప్రక్రియగా ఈ వ్యతిరేకతపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఇలా రియాక్ట్ అయిన నాలుగు రోజులకే.. ఇప్పుడీ సంస్థను క్లోజ్ చేస్తున్నట్లుగా ప్రకటించడం‌తో సరికొత్త అనుమానాలకు తావిస్తుందంటూ.. కొందరు విశ్లేషిస్తున్నారు. మరి ఈ అనుమానాలపై సాయిరూమ్ మరోసారి మీడియా ముందుకు ఏమైనా వస్తారేమో చూద్దాం..

ఇవి కూడా చదవండి:

Jana Nayakudu: విజయ్‌ జన నాయకుడు రివ్యూ

మా అన్నయ్య మెగాస్టార్‌కు.. నేను పవర్ స్టార్‌కు అభిమానులం: కిరణ్ అబ్బవరం

మా రమేష్ మాకు కావాలి సార్.. పవన్, హరీష్ శంకర్‌లకు గబ్బర్ సింగ్ టీమ్ కన్నీటి విన్నపం

Updated Date - Jul 23 , 2026 | 05:07 PM