Impure: ‘ఓజీ’ తర్వాత తెలుగులో రాజకుమారి మరో పాట.
ABN, Publish Date - Sep 28 , 2026 | 04:07 PM
మోడ్రన్ రిలేషన్‌షిప్స్, మానవ సంబంధాలు, తరాల మధ్య మారుతున్న ఆలోచనా విధానాలను కథాంశంగా తెరకెక్కిన చిత్రం ‘ఇంప్యూర్’.
మోడ్రన్ రిలేషన్‌షిప్స్, మానవ సంబంధాలు, తరాల మధ్య మారుతున్న ఆలోచనా విధానాలను కథాంశంగా తెరకెక్కిన చిత్రం ‘ఇంప్యూర్’ (impure). అమెరికాలో స్థిరపడిన తెలుగు అమ్మాయి వారాహి మల్లిపాముల Varahi Mallipamula) కథ అందించడంతో పాటు నటిగా, నిర్మాతగా ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. తల్లి శ్రీదేవి మల్లిపాములతో కలిసి వారాహి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న ‘ఇంప్యూర్’ థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ‘ఇంప్యూర్’ ట్రైలర్‌తో పాటు ‘ఓఎంజీ’ (ఓ మై గాడ్) పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తెలుగు మూలాలు ఉన్న ప్రముఖ అమెరికన్ ర్యాపర్, సింగర్ రాజకుమారి ఈ పాటను ఆలపించడం ఈ పాట ప్రత్యేకత. ఈ చిత్రంతో రాజకుమారి సంగీత దర్శకురాలిగా కూడా పరిచయం అవుతున్నారు. ‘ఓఎంజీ’తో పాటు మరో పాటను కూడా ఆమె పాడారు. సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలోనూ రాజకుమారి కనిపించనున్నట్లు నిర్మాత శ్రీదేవి మల్లిపాముల తెలిపారు. రాజకుమారి గతంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ టైటిల్ ట్రాక్‌తో పాటు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’లోని ‘ధోప్...’ పాటను ఆలపించారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’లోని ‘ఫైర్ స్టోర్మ్’ పాటతోనూ ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ‘ఓజీ’ పాట తర్వాత తెలుగులో రాజకుమారి పాడిన మరో పాటగా ‘ఇంప్యూర్’లోని ‘ఓఎంజీ’ నిలిచింది. ఈ పాటకు కడలి సత్యనారాయణ తెలుగు సాహిత్యం అందించారు.
నిర్మాత శ్రీదేవి మల్లిపాముల మాట్లాడుతూ ‘‘కాలంతో పాటు సమాజంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను ప్రతిబింబిస్తూ మోడ్రన్ రిలేషన్‌షిప్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించాం. మహిళలను సమాజం చూసే కోణాన్ని సున్నితంగా ప్రశ్నించే అంశాలు ఇందులో ఉన్నాయి. మానవ సంబంధాల నేపథ్యంలో ఆధునిక తరం, అంతకు ముందు తరం మధ్య ఎలాంటి అనుబంధం ఉండాలనే విషయాన్ని ఈ సినిమా చెబుతుంది. జెన్‌జీతో పాటు అన్ని వయసుల ప్రేక్షకులను, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని తెలిపారు.