Rahul Sipligunj Cult: రాహుల్ సిప్లిగంజ్‌కు ఊరట.. ‘కల్ట్’ వెబ్‌సిరీస్‌పై నో స్టే
ABN, Publish Date - Jan 13 , 2026 | 07:22 AM
రాహుల్ సిప్లిగంజ్ నటించిన ‘కల్ట్’ ఓటీటీ వెబ్‌సిరీస్ విడుదలపై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ (Webseries) ‘కల్ట్’ (Cult) విడుదలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు (High Court for the State of Telangana) నిరాకరించింది. ఈనెల 17న విడుదల కానున్న ఈ వెబ్‌సిరీస్‌ను అడ్డుకోవాలని కోరుతూ ఉత్తమ్ వల్లూరి చౌదరి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు విచారణలో ఉన్న మదనపల్లి మర్డర్స్ కేసు ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను చిత్రీకరించారని.. కోర్టు విచారణలో ఉన్న కేసుకు డ్రామా జోడించి చిత్రీకరణ చేయడం చట్టవిరుద్ధమని.. విచారణలో ఉన్న అంశాన్ని తప్పుదోవ పట్టించడం కిందకే వస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఈ వెబ్‌సిరీస్ విడుదలను అడ్డుకోవడంతో పాటు ప్రచారం చేయకుండా సామాజిక మాధ్యమ వేదికలైన మెటా, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ ప్లే వంటి సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం.. వెబ్ సిరీస్ విడుదలపై ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
నిర్మాణ సంస్థ, ఇతర ప్రతివాదుల వాదన వినకుండా ఇప్పటికిప్పుడు స్టే విధించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని రాహుల్ సిప్లిగంజ్, నిర్మాతలు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. అయితే పలు మీడియాల్లో కల్ట్ వెబ్ సిరీస్ విడుదలను హైకోర్టు అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి.