వారం గ్యాప్‌లో రాశీ సింగ్ రెండు సినిమాలు!
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:42 PM
హీరోయిన్ రాశీ సింగ్ వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. గత శుక్రవారం ఆమె నటించిన 'ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు' సినిమా విడుదల కాగా, ఈ శుక్రవారం ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ 'గాసిప్' విడుదల కాబోతోంది.
నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ను, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ సోషల్ సెటైర్‌గా వైభవ్ కౌండిన్య 'గాసిప్' (Gossip) చిత్రాన్ని రూపొందించారు. దీనిని యతి నిర్మించారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో రాశీసింగ్ కథానాయికగా నటించగా, రవివర్మ (Ravivarma), మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఆర్టిస్ట్ విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. 'గాసిప్' మూవీ ఈ నెల 26న విడుదల కాబోతున్న సందర్భంగా ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి మూవీ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నటుడు మహేష్ యడ్లపల్లి మాట్లాడుతూ, 'ప్రస్తుత సమాజంలో చూస్తున్న కొన్ని సంఘటనలకు దగ్గరగా ఉన్న ఒక విషయాన్ని సినిమాగా చేశాం. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నాకు అవకాశం ఇచ్చిన వైభవ్ గారికి, యతి గారికి థాంక్స్. రాశి సింగ్ గారితో పని చేయడం సంతోషకరం. శక్తికాంత్ కార్తీక్ సినిమాకు మంచి సంగీతాన్ని అందించారు. అందరూ మా సినిమాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
దర్శకుడు వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ, 'ఇది నా మొదటి సినిమా. దీనికి నేను రచయితగా, దర్శకుడిగా పని చేశాను. మన జీవితాల్లో గాసిప్ అనేది సాధారణ విషయమే. కానీ మనం సరదాగా మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఇతరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం. ఇందులో నా జీవితంలో, నా స్నేహితుల జీవితాల్లో జరిగిన కొన్ని నిజ సంఘటనలు కూడా ఉన్నాయి. మాటకు చాలా శక్తి ఉంది. ఒక మాట మనిషిని నిలబెట్టగలదు, అదే మాట అతడిని కూల్చగలదు. అందుకే ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతతో ఉండాలి అనే సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది. ఇది కేవలం ఒక సందేశాత్మక చిత్రం మాత్రమే కాదు, ప్రేక్షకులను ఆలోచింపజేసే భావోద్వేగ ప్రయాణం. అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

హీరోయిన్ రాశీ సింగ్ (Raashi Singh) మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఒక చిన్న గాసిప్ కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో చూపించే కథ ఇది. ఇది నా తొలి మహిళా ప్రధాన చిత్రం కావడంతో నాకు చాలా బాధ్యతగా, కొంచెం భయంగా కూడా అనిపిస్తోంది. ఈ సినిమా కోసం నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు వైభవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకంటే ఆయనకే నాపై ఎక్కువ నమ్మకం ఉండేది. నిర్మాత యతి గారు కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు అవసరమైన అన్ని వనరులు అందించారు. ఈ సినిమాలో నేను నటిగా మాత్రమే కాకుండా, డ్యాన్స్ విషయంలో కూడా కొత్తగా ప్రయత్నించాను. ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు గురుచరణ్, పృథ్వీరాజ్, నిర్మాత యతి మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
పండంటి బిడ్డకు జననం.. నారా రోహిత్, శిరీష దంపతులకు ప్రమోషన్!
సమంత ప్రెగ్నెంట్ అని రివీల్ చేసిన చిరంజీవి.. ట్వీట్ వైరల్!
కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!