దర్శకుడు ప్రదీప్ అద్వైతంకు భార్యావియోగం
ABN, Publish Date - Sep 26 , 2026 | 10:38 PM
టాలీవుడ్ ప్రముఖ యువ దర్శకుడు ప్రదీప్ అద్వైతం కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి దీప్తి రెడ్డి మాడుగుల తీవ్ర అనారోగ్యంతో శనివారం (సెప్టెంబర్ 26) సాయంత్రం కన్నుమూశారు.
టాలీవుడ్ ప్రముఖ యువ దర్శకుడు ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitham) కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి దీప్తి రెడ్డి మాడుగుల (Deepthi Reddy Madugula) తీవ్ర అనారోగ్యంతో శనివారం (సెప్టెంబర్ 26) సాయంత్రం కన్నుమూశారు. ప్రదీప్ రెడ్డి మాడుగుల కెరీర్ ప్రారంభంలో తెరకెక్కించిన ‘అద్వైతం’ షార్ట్ ఫిల్మ్ జాతీయ స్థాయిలో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. ఆ గుర్తింపుతోనే ఆయన సినీ పరిశ్రమలో ప్రదీప్ అద్వైతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అనంతరం వెండితెరపై ‘బిల్లా రంగా’, ‘మైనే ప్యార్ కియా’ వంటి చిత్రాలను రూపొందించి దర్శకుడిగా మెప్పించారు. గతేడాది ప్రముఖ అగ్ర నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మాణంలో, రోషన్ మేకా కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన ‘ఛాంపియన్’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకాదరణను పొంది మంచి విజయాన్ని అందుకుంది.
మరోవైపు ప్రదీప్ భార్య దీప్తి రెడ్డి మాడుగుల సమాజంలో ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తగా (లేడీ ఎంట్రప్రెన్యూర్‌గా) తనదైన ముద్ర వేశారు. మహిళా సాధికారికత కోసం, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడం కోసం ఆమె కొన్నేళ్లుగా విశేష సేవలు అందించారు. ఎంతోమంది మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, వారి రంగాల్లో రాణించేందుకు అవసరమైన మార్గదర్శకత్వం, సలహాలు ఇచ్చేవారు. ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉన్న దీప్తి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలపై ప్రత్యేక మక్కువ కనబరిచేవారు. ప్రతి ఏటా కుటుంబాలను, పరిచయస్తులను ఒకచోట చేర్చి బతుకమ్మ పండుగను ఎంతో కన్నుల పండువగా నిర్వహించేవారు.
ఐదు రోజుల క్రితం ఆమె తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని కిమ్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి వైద్యులు ఆమెకు అత్యవసర శస్త్రచికిత్స కూడా నిర్వహించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఊహించని రీతిలో ఆమె శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రదీప్, దీప్తి రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
దీప్తి రెడ్డి మాడుగుల అంత్యక్రియలు ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చిన్న వయసులోనే ఆమె మరణించడంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పలు రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రదీప్ అద్వైతం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
మోహన్ బాబు చాలా స్ట్రిక్ట్ అనుకుంటారు కానీ.. అంత లేదు: నాని
Mohan Babu: నాని నువ్వు గొప్ప నటుడివి.. నూరేళ్లు చల్లగా ఉండాలి
వరుస సూపర్ హిట్స్.. అయినా ఈ భామకు తెలుగులో నో ఛాన్స్