వంగా ‘స్పిరిట్’ స్కెచ్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:56 PM
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas), సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ‘యానిమల్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందునా ప్రభాస్ తన కెరీర్‌లో మొట్టమొదటిసారిగా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ముందెన్నడూ లేనంత హైప్ ఈ సినిమాపై క్రియేట్ అయింది. ఈ క్రేజీ కాంబినేషన్ థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసాన్ని సృష్టిస్తుందోనని అటు ట్రేడ్ వర్గాలతో పాటు, ఇటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా కఠినమైన డ్యూటీ చేస్తున్నట్లుగా యూనిట్ చెబుతోంది. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి, వంద శాతం అంకితభావంతో నటిస్తున్న సినిమా ఇదేనని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ‘బాహుబలి’ తర్వాత డార్లింగ్ చేసిన సినిమాలన్నీ ఎక్కువగా ఇండోర్ సెట్లలోనే షూటింగ్ జరుపుకున్నాయి. కానీ ‘స్పిరిట్’ కోసం మాత్రం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పూర్తిగా రియల్ లొకేషన్లను ఎంచుకున్నారు. కథ డిమాండ్ మేరకు యాక్షన్ సన్నివేశాల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వాస్తవిక ప్రదేశాలలోనే చిత్రీకరణ జరుపుతూ.. సినిమాను ఒక రేంజ్‌లో తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా సాగుతోంది. నగరంలోని అజీజ్ నగర్ పరిసరాల్లో ప్రభాస్ పాల్గొంటున్న కీలకమైన భారీ యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరిస్తున్నారు. డార్లింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టడంతోనే అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా హీటెక్కిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు సందీప్ రెడ్డి వంగా మార్క్ రా, రస్టిక్ ఎలివేషన్స్.. మరోవైపు దానికి ప్రభాస్ కటౌట్ తోడైతే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి ఇందులో కథానాయికగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు. కేవలం ‘స్పిరిట్’ తోనే కాకుండా, డార్లింగ్ ప్రభాస్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే అభిమానులకు పండగే అని చెప్పాలి. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం రాక ముందు జరిగే కథతో వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత, తన బ్లాక్‌బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ అయిన ‘కల్కి-2, సలార్-2’ సినిమాలను లైన్లో పెట్టనున్నారు. ఇలా వరసబెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టులతో రాబోయే నాలుగేళ్ల పాటు బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ విశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
1.6 కిలోల వెండి ఖడ్గం.. మొక్కు తీర్చుకున్న సీఎం విజయ్!
వారెవ్వా అనిల్ రావిపూడి.. నీ చర్యలు ఊహాతీతం!
Samantha: సమంత ‘లేడీ బాషా’.. బాబోయ్ ఈ ఎలివేషన్స్ ఏంటి?