Spirit: ఎనిమిది గంటల షిప్ట్ కు సోనాక్షి జై...
ABN , Publish Date - Jun 23 , 2025 | 05:49 PM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఎనిమిది గంటల షిఫ్ట్ డిమాండ్ కు సోనాక్షి సిన్హా సైతం సై అనేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే (Deepika Padukone) 'స్పిరిట్' (Spirit) చిత్రం నుండి వైదొలగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రోజుకు ఎనిమిది గంటల షిఫ్ట్ అనేది. దీనితో పాటు ఆమె సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటానని, హిందీలో తప్పితే తెలుగు వర్షన్ కు తాను డైలాగ్స్ చెప్పనని తెలిపినట్టు సమాచారం. ఆమె డిమాండ్స్ ను అంగీకరించలేక దర్శక నిర్మాత సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) ని తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే దీపికా పదుకునే తన డిమాండ్స్ కు దర్శకుడు ఒప్పుకోలేదని తెలుపుతూ తన పీఆర్ టీమ్ ద్వారా సోషల్ మీడియాలో ఈ విషయమై ఓ చర్చకు తెర దీసింది. ఆర్టిస్టులలో చాలామంది ఎనిమిది గంటల షిఫ్ట్ డిమాండ్ విషయంలో దీపికా పదుకుణే కు మద్దత్తు పలికారు. తాజాగా సోనాక్షి సిన్హా (Sonakashi Sinha) సైతం దీనిని బలపరిచింది. దాదాపు పదిహేనేళ్ళ తన సినీ ప్రయాణంలో ఎంతోమంది హీరోలు తనకంటే తక్కువ సమయం సెట్స్ మీద ఉండటం చూశానని, అదే సమయంలో కొందరు ఎక్కువ సమయం కూడా ఉన్నారని చెప్పింది. అయితే సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ గంటలు పనిచేయడంలో తప్పులేదని తెలిపింది. అదే సమయంలో దర్శక నిర్మాతలు సరిగా ప్లాన్ చేసుకుంటే... నటీనటుల సమయం వృధా కాదని తెలిపింది. అవసరమైన వారితో షూటింగ్ చేయించుకుని పంపేసి... ఆ తర్వాత మిగిలిన వారితో చిత్రీకరణ జరపవచ్చని అంది.
నిజానికి సినిమాల్లో నటించే వారికి ఫిట్ నెస్ అవసరమని, అందుకోసం తామంతా రెండు మూడు గంటల పాటు జిమ్ లో గడపాల్సి ఉంటుందని, సెట్స్ లోనే పది, పన్నెండు గంటలు ఉంటే... ఫిట్ నెస్ అటకెక్కేస్తుందని ఆమె వాపోయింది. నటనే కాకుండా ప్రతి వారికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, దానికి కూడా సమయం కేటాయించాల్సి ఉంటుందని తెలిపింది. ఏదేమైనా ఎనిమిది గంటల షిఫ్ట్ విషయమై దీపికా పదుకునే కు రోజు రోజుకూ మద్దత్తు ఎక్కువ అవుతోంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం సోనాక్షి సిన్హా తన సోదరుడు కుశ్ ఎస్ సిన్హా దర్శకత్వం వహించిన 'నికిత రాయ్' మూవీలో నటించింది. ఇందులో పరేశ్ రావెల్, అర్జున్ రామ్ పాల్, సుహీల్ నయ్యర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇదే నెల 27న కాజల్ మూవీ 'మా'తో పాటుగా విడుదల కాబోతోంది.
Also Read: Maniratnam: థగ్ లైఫ్ పరాజయం.. స్పందించిన మణిరత్నం
Also Read: Lovely: మలయాళ 'లవ్లీ' సినిమాపై తెలుగు ఈగ నిర్మాత ఆరోపణలు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి