డీపీ మార్చిన రెబల్ స్టార్.. ఇక అంతా ‘ఫౌజీ’ గురించే!
ABN, Publish Date - Aug 14 , 2026 | 05:24 PM
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ అప్‌డేట్ ఇచ్చినా అది అభిమానులకు ఒక పెద్ద పండగే. ఇప్పుడు ఇన్‌స్టా డీపీ విషయంలో ప్రభాస్ పేరు వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ అప్‌డేట్ ఇచ్చినా అది అభిమానులకు ఒక పెద్ద పండగే. దాదాపు 7 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ డిస్‌ప్లే పిక్చర్ (DP)ని మార్చడం ప్రస్తుతం నెట్టింట పెను సంచలనం సృష్టిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’ (Fauzi) సినిమాకు సంబంధించిన తన సరికొత్త ఊర మాస్ లుక్‌ని ఆయన డీపీగా సెట్ చేశారు. ప్రభాస్ పూర్తిగా ‘ఫౌజీ’ మోడ్‌లోకి అడుగుపెట్టడంతో ఇటు డార్లింగ్ ఫ్యాన్స్, అటు సాధారణ సినీ ప్రేమికులు ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయారు.
వాస్తవానికి ఇప్పటివరకు అందరి దృష్టి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమాపైనే ఎక్కువగా ఉండేది. పైగా హను రాఘవపూడి గత చిత్రాల శైలిని బట్టి ‘ఫౌజీ’ ఒక క్లాస్ లవ్ స్టోరీ లేదా సాఫ్ట్ ఎమోషనల్ సినిమా కావచ్చని, మాస్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయని అభిమానులు కూడా భావించారు. కానీ, ఇటీవల ప్రభాస్ చేతిలో గన్ పట్టుకుని, మెలితిప్పిన మీసకట్టు, ఇంటెన్స్ లుక్‌తో ఉన్న పవర్‌ఫుల్ స్టిల్ బయటకు రావడంతో మొత్తం సీన్ మారిపోయింది. ఈ ఊర మాస్ అవతార్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఒక్క పోస్టర్‌తో సినిమాపై బజ్ రెట్టింపైంది. ఇకపై సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఫౌజీ’ ఫీవరే కనిపించబోతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ చేసిన ఈ చిన్న మార్పు బాక్సాఫీస్ వద్ద పెను తుఫానుకు నాంది పలికినట్లయిందని చెప్పుకోవచ్చు.
ఈ వింటేజ్ అండ్ రగ్గడ్ లుక్‌ను స్వయంగా ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పటి వరకు ‘బాహుబలి’ మూవీ పిక్ డీపీగా పెట్టుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఒక్కసారిగా ‘ఫౌజీ’ మోడ్‌లోకి వచ్చేయడంతో.. ఫ్యాన్స్ అంచనాలకు రెక్కలు లేకుండా పోయాయి. మొత్తంగా చూస్తే.. హను రాఘవపూడి ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడనేది.. ఈ డీపీ మార్పు తెలియజేస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, చైత్ర జె. అచార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ చిత్రం డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
పోతురాజు ఆహార్యంలో శ్రీహరి తనయుడు.. పోస్టర్ అదిరింది!
రాత్రి తాగింది దిగలేదు.. అందుకే! ఇదెక్కడి మాస్ ప్రమోషన్స్‌రా అయ్యా..
ప్రతీ 15 రోజులకూ.. నా పాస్‌వర్డ్స్ అన్నీ మారుస్తా: కింగ్ నాగార్జున