ప్రభాస్ రేసు నుంచి తప్పుకుంటే.. ఆ ముగ్గురిదే హవా
ABN, Publish Date - Sep 09 , 2026 | 11:50 PM
సినిమా రంగంలో బాక్సాఫీస్ లెక్కలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సరైన విడుదల తేదీని దక్కించుకోవడం అనేది అదృష్టంతో పాటు ఒక పెద్ద వ్యూహం కూడా.
సినిమా రంగంలో బాక్సాఫీస్ లెక్కలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సరైన విడుదల తేదీని దక్కించుకోవడం అనేది అదృష్టంతో పాటు ఒక పెద్ద వ్యూహం కూడా. ఇప్పుడు టాలీవుడ్‌లో సరిగ్గా ఇటువంటి ఆసక్తికరమైన బాక్సాఫీస్ చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని డిసెంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే, ఇదే సమయానికి ఇతర క్రేజీ ప్రాజెక్ట్‌లు కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో అసలు ‘ఫౌజీ’ (Fauzi) విషయంలో ఏం జరుగుతోందనే ఉత్కంఠ ట్రేడ్ వర్గాల్లో నెలకుంది.
డిసెంబర్‌లో రానున్న హీరోల్లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ఒకరు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘వృషకర్మ’. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3వ తేదీనే థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, అక్కినేని నాగార్జున మైలురాయి చిత్రం ‘కింగ్ 100’ డిసెంబర్ 24న విడుదలవుతుండటంతో, తండ్రీ కొడుకుల క్లాష్ అనే సమస్య ఉండదు. భారీ సెట్లు, కళ్లుచెదిరే ఇంటీరియర్స్‌తో నిర్మించిన ‘వృషకర్మ’పై కూడా ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
కేవలం నాగచైతన్య మాత్రమే కాదు, డిసెంబర్ రేసులో దూసుకొస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీ శ్రీ’ (Dulquer Salmaan Sri Sri). దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ‘ఫౌజీ’ వచ్చిన మరుసటి రోజే, అంటే డిసెంబర్ 4న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ ‘శ్రీ శ్రీ’ పై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశాయి. ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
అంతేకాదు, అంతకంటే ముందే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘లెగసీ’ (Vishwak Sen Legacy) డిసెంబర్ 4న రాబోతున్నట్లు ముందే అనౌన్స్ చేసింది. ‘పిండం’ ఫేమ్ సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారు. ఏక్తా రాథోడ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇలా ప్రభాస్ సినిమా తేదీకి అటు ఇటుగా ఒక్క రోజు గ్యాప్‌లోనే మూడు క్రేజీ సినిమాలు లైన్లో ఉండటం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
అసలు ప్రభాస్ లాంటి కటౌట్ ముందు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు నిలబడటం కష్టమనేది ఒక వాదన. కానీ కంటెంట్ బలంగా ఉంటే కాంపిటేషన్ ఉన్నా కలెక్షన్లు వస్తాయని భావించడం మరో వాదన. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ‘ఫౌజీ’ కనుక డిసెంబర్ రేసు నుంచి వాయిదా పడితే.. అది చైతూ, దుల్కర్, విశ్వక్ సేన్ సినిమాలకు మాంచి ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రస్తుతానికైతే ‘ఫౌజీ’ పోస్ట్‌పోన్‌పై మైత్రీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ప్రభాస్ ‘ఫౌజీ’ డిసెంబర్‌లోనే వస్తుందా? లేదా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి మారుతుందా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్‌లో శ్రీలీల చాప్టర్ క్లోజా?
‘రామాయణ’ దండయాత్రకు అడ్డుగా గాడ్జిల్లా.. ఊహించలేదు కదా!
అతనితో రిలేషన్ వర్కవుట్ కాలేదు.. ఆ తర్వాత ఎవరితో కమిట్ కాలేదు: కావ్యశ్రీ