'పెద్ది' విషయంలో డైరెక్టర్ మొక్కు ఏమిటీ?
ABN , Publish Date - May 16 , 2026 | 02:14 PM
'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు సానా తన మనసులోని మాటలను వివరించారు. క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న రామ్ చరణ్ 'పెద్ది'లో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కీలకమైన అంశమని ఆయన చెప్పారు.
సినిమా రంగంలో ప్రతి ఒక్కరూ సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తారు. అయితే దర్శకుడు బుచ్చిబాబు సానా మాత్రం 'పెద్ది' సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకునే విషయంలో ఆ సెంటిమెంట్‌ను పక్కన పెట్టారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఏబీయన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇంతవరకూ తెలుగులో రెహమాన్ వర్క్ చేసిన సినిమాలు పెద్దంతగా ఆడలేదు. అయినా ఆయన మీద అభిమానంతో, ఈ కథకు ఆయన సంగీతం అందిస్తే బాగుంటుందనే భావనతో రెహమాన్ తో మ్యూజిక్ చేయించుకున్నట్టు చెప్పారు. తన తొలి చిత్రం 'ఉప్పెన' జనాల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అని ఆయన అన్నారు. ఆ సినిమా విజయంలో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర ప్రధానమైనదే అయినా రెహమాన్‌తో వర్క్ చేయాలనే తన కోరికను 'పెద్ది'తో తీర్చుకున్నానని బుచ్చిబాబు సానా చెప్పారు.
సహజంగా సాంగ్ షూటింగ్‌కు రెహమాన్ ఫైనల్ వాయిస్‌తో సాంగ్ ఇవ్వరని, కానీ తన కోరిక మేరకు 'రయ్ రయ్ రారా' సాంగ్‌ను తానే పాడి అవుట్ పుట్ ఇచ్చారని సానా బుచ్చిబాబు తెలిపారు. ఆ పాటను వేరే ఇద్దరు సింగర్స్‌తోనూ పాడించామని, కానీ ఫైనల్‌గా రెహమాన్ వాయిసే బాగుందని, దానికే ఫిక్స్ అయ్యామని, ఎలాంటి ఇగోకూ పోకుండా రెహమాన్ తనకు కావలసిన విధంగా పాటలు ఇచ్చారని బుచ్చిబాబు అన్నారు.
అలానే ఈ సినిమా కథను రామ్‌చరణ్ చెప్పగానే సింగిల్ సిట్టింగ్‌లో ఆయన ఓకే చేశారని, ఎలాంటి మార్పులు చేర్పులు సూచించలేదని అన్నారు. తనకు సెంటిమెంట్స్ ఎక్కువని, తన జేబులో ఎప్పుడూ దేవుడి ఫోటో ఉంటుందని బుచ్చిబాబు చెప్పారు. తాను పిఠాపురం దత్తాత్రేయ స్వామిని నమ్ముతానని చెప్పిన ఆయన, చెర్రీకి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలాంటి మార్పులు చెప్పకుండా ఓకే చెప్పేస్తే పది లక్షలతో కిరీటం చేయిస్తానని మొక్కుకున్నానని అన్నారు. ఇప్పుడు ఆ మొక్కును వీలైనంత త్వరగా తీర్చమని తన భార్యకు చెప్పానని బుచ్చిబాబు చెప్పారు.
'పెద్ది' సినిమా కోర్ పాయింట్ గురించి వివరిస్తూ, 'ఇది క్రీడానేపథ్యంలో సాగే సినిమా. అయితే దానిని మించి ఇందులో మేం చెప్పిన విషయం సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి. ఓ వ్యక్తి తన ఐడెంటీటీ గురించి ఎలాంటి పోరాటం చేశాడనేదే 'పెద్ది' కథ. చాలామంది ఇదేదో బయోపిక్ అనుకుంటున్నారు కానీ అందులో నిజంలేదు. మా వూరిలో పెద్ది అనే కుర్రాడు ఉండేవాడు. అతను చాలా ఆటలు ఆడుతుండేవాడు. రోజూ కూలికి వెళ్ళేవాడు. అతనికి నూట యాభై రూపాయలు ఇస్తే చాలు... ఎవరి తరఫున కావాలంటే వారి తరఫున క్రికెట్ ఆడుతుండేవాడు. అతని జీవితంలోని కొన్ని సంఘటనలకు తీసుకుని ఫిక్షనల్ స్టోరీ తయారు చేశాను' అని అన్నారు.
ఇందులో హీరో చెఱకు మిల్‌లో పనిచేసే కుర్రాడు కాగా, హీరోయిన్ విజయనగరం రాజుల అమ్మాయి అని బుచ్చిబాబు సానా చెప్పారు. జాన్వీ కపూర్ మంచి అందగత్తె మాత్రమే కాదు... గొప్ప నటి కూడా అని కితాబిస్తూ.. ఇందులో మీటింగ్ కు సంబంధించిన సన్నివేశంలో జాన్వీ చాలా చక్కని నటన ప్రదర్శించిందని అన్నారు.
బుచ్చిబాబు సానా తొలి చిత్రం 'ఉప్పెన' వంద కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. సో... ఈ రెండో సినిమా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న సందర్భంలో వెయ్యి కోట్ల గ్రాస్ ను వసూలు చేస్తుందా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, 'ఆ స్థాయి విజయాన్ని 'పెద్ది' అందుకుంటే ఆనందిస్తా'నని అన్నారు. తొలి చిత్రానికి మలి చిత్రానికి మధ్య ఐదేళ్ళ గ్యాప్ గురించి వివరణ ఇస్తూ, స్టార్ హీరోతో సినిమా చేయాలంటే వేచి ఉండక తప్పదు. చెర్రీతో చేయడం కోసం ఇప్పటి వరకూ వేచి ఉన్నా. రేపు నాకు నచ్చిన మరో స్టార్ హీరోతో చేయాల్సి వచ్చినా తాను వెయిట్ చేస్తానని, తనకు ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు అంటే ఇష్టమని సానా బుచ్చిబాబు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?
లవ్ - రిలేషన్‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
Peddi Movie: రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ.. వీడియో వైరల్!
మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!