అది ధైర్యం కాదు.. నార్త్ భామలకు పాయల్ రాజ్‌పుత్ కౌంటర్
ABN, Publish Date - Nov 04 , 2026 | 07:09 PM
కెరీర్ ప్రారంభంలో పేరు, గుర్తింపు, భారీ పారితోషికాల కోసం తెలుగు సినీ పరిశ్రమను ఆశ్రయించి.. ఇక్కడ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాక.. బాలీవుడ్‌కు వెళ్లి టాలీవుడ్‌పై నోరుపారేసుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.
కొందరు హీరోయిన్లు ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా ప్రవర్తించడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. కెరీర్ ప్రారంభంలో పేరు, గుర్తింపు, భారీ పారితోషికాల కోసం తెలుగు సినీ పరిశ్రమను ఆశ్రయించి.. ఇక్కడ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాక.. బాలీవుడ్‌కు వెళ్లి టాలీవుడ్‌పై నోరుపారేసుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. సౌత్ సినిమాల్లో కేవలం గ్లామర్ చూపించడం తప్ప మరేమీ ఉండదని, తాము నటించిన చిత్రాలు అసలు సినిమాలే కావంటూ హిందీ టాక్ షోలలో కూర్చొని వెటకారంగా కామెంట్లు చేస్తుంటారు. ఇటీవల బాలీవుడ్ నటి రాధికా ఆప్టే (Radhika Apte) సౌత్ చిత్ర పరిశ్రమ (South Cine Industry) పనితీరు, ఇక్కడి అనుభవాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) ఇప్పటికే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఈ వివాదం సద్దుమణగక ముందే, టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) తనదైన శైలిలో స్పందించారు. టాలీవుడ్‌ను కించపరిచేలా మాట్లాడే ఇతర భాషా నటీమణులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో.. ‘‘నేను గర్వించదగ్గ తెలుగు నటిని (I’m a proud Telugu actress). మీకు పేరు ప్రఖ్యాతులు, స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన పరిశ్రమ గురించే చెడుగా మాట్లాడటం.. అదీ పరిశ్రమ ఇచ్చినవన్నీ అనుభవించిన ఎన్నో ఏళ్ల తర్వాత ఇలా నిందలు వేయడం ధైర్యం అనిపించుకోదు; అది ముమ్మాటికీ కృతఘ్నతే అవుతుంది. మీ కెరీర్‌కు పునాది వేసిన మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమపై ఇన్నేళ్ల తర్వాత ఇలా నిందలు మోపడం మీలోని అసహనానికి, అక్కసుకే నిదర్శనం. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం టాలీవుడ్. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన నా చిత్ర పరిశ్రమకు నేను ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలబడతాను’’ అంటూ ఘాటుగా రాసుకొచ్చారు.
‘ఆర్ఎక్స్ 100’ (RX100) సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత ‘మంగళవారం’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న పాయల్ రాజ్‌పుత్.. ఉత్తరాది నుంచి వచ్చినప్పటికీ తెలుగు సినిమా పట్ల చూపించిన ఈ గౌరవం, విధేయతపై నెటిజన్లు, సినీ ప్రియులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కొందరు హీరోయిన్లు అవకాశాలు ఇచ్చిన పరిశ్రమపైనే విషం చిమ్ముతున్న తరుణంలో.. పాయల్ ఇచ్చిన ఈ కౌంటర్ టాలీవుడ్ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
Last Man in Tower: ఒక్కడే అందరినీ ఎదుర్కొంటే.. ఓటీటీకి అదిరిపోయే ఎమోషనల్ డ్రామా
వి.వి. వినాయక్ సమక్షంలో కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం
రేంజ్ మ్యాటర్.. చిరు ‘కాకా’కి తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్