Theater vs Ott: ఓటీటీ చేతిలోకి మారుతున్న సినిమా వ్యాపారం!
ABN, Publish Date - Sep 20 , 2026 | 08:37 AM
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరుగుతోంది.. అని నిర్మాతలకు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంది.
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరుగుతోంది.. అని నిర్మాతలకు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంది.
ఒకప్పుడు సినిమా అంటే థియేటరే! థియేటర్లోకి సినిమా వస్తోందంటే అదో సంబరం.. సెలబ్రేషన్.
నిర్మాత సినిమా తీసేవాడు.. థియేటర్లలో విడుదల చేసేవాడు.. ప్రేక్షకులు థియేటర్కు వెళ్లి సినిమా చూసేవారు. సినిమా విజయం, పరాజయం ప్రధానంగా థియేట్రికల్ వసూళ్లతోనే డిసైడ్ అయ్యేది.
మరి ఇప్పుడు?
ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీ వచ్చి అన్ని రూల్స్ మార్చేసింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఓటీటీనే చిత్ర పరిశ్రమను ఇప్పుడు శాసిస్తోంది. ఏ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలో ఓటీటీ సంస్థలే నిర్ణయిస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. ఓటీటీ డీల్ పూర్తి కాకుండా సినిమాను విడుదల చేసే ధైర్యం, దమ్ము ఏ నిర్మాతకు ఉండడం లేదు.. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు.
కొత్త అవకాశాలు.. సరికొత్త సమస్యలు
ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అడుగుపెట్టిన తర్వాత సినిమా బిజినెస్ స్వరూపమే మారిపోయింది. సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముకుంటే గతంలో నిర్మాతలకు అదనపు ఆదాయం వచ్చేది. రాను రాను ఆ ఆదాయం తగ్గిపోవడంతో అయోమయ పరిస్థితిలో ఉన్న నిర్మాతలకు ఓటీటీ హక్కులు ముఖ్యమైన ఆదాయ వనరుగా మారాయి. అయితే ఓటీటీ ఒక వైపు కొత్త అవకాశాలను తీసుకొస్తూనే మరోవైపు కొన్ని కొత్త సమస్యలను కూడా సృష్టిస్తోంది.
కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే కాకుండా చిన్న, మధ్యతరహా సినిమాలకు ఓటీటీ ఒక రకంగా రక్షణ కవచంగా మారింది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా డిజిటల్ హక్కుల ద్వారా కొంత ఆదాయం రావడం నిర్మాతకు ఊరట కలిగిస్తున్న అంశం. అలాగే కొత్త కథలు, కొత్త దర్శకులు, ప్రయోగాత్మక సినిమాలకు కూడా ఓటీటీ ఒక వేదికగా మారింది.
మరి పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి?
ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల ఓటీటీ హక్కుల కోసం భారీ మొత్తాలు చెల్లించేందుకు డిజిటల్ సంస్థలు పోటీ పడేవి. సినిమా థియేటర్లో విడుదల కాకముందే ఓటీటీ హక్కుల ద్వారా నిర్మాతకు గ్యారంటీ వసూళ్లు మొత్తం వచ్చేది. దీంతో భారీ బడ్జెట్ సినిమాలకు బడ్జెట్ రికవరీలో ఓటీటీ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. వ్యాపారంలో కొన్ని ఎదురుదెబ్బలు తగలడం వల్ల ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా ఆలోచించి అడుగులు వేస్తున్నాయి. స్టార్ హీరోలతో తీసే భారీ బడ్జెట్ చిత్రాలకు గతంలోలా భారీ మొత్తాలు ఓటీటీ రూపంలో వచ్చే పరిస్థితి లేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రమే ఇందుకు మంచి ఉదాహరణ. భారీ ఎత్తున ఖర్చు పెట్టి తీసిన ఈ చిత్రానికి ఓటీటీ నుంచి భారీ మొత్తం వస్తుందని ఆశించిన చిత్ర నిర్మాతలకు నిరాశే ఎదురైంది. ఓటీటీ డీల్ పూర్తి కాకపోవడం వల్లే ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందన్నది బహిరంగ రహస్యమే. చివరకు ఓటీటీ సంస్థ ఇచ్చిన మొత్తం తీసుకుని సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
విడుదల తేదీని నిర్ణయించేది ఎవరు?
ఒకప్పుడు సినిమా విడుదల తేదీని డిస్ట్రిబ్యూటర్, థియేటర్ యాజమాన్యాలతో కలిసి చర్చించి, బలమైన ముహూర్తం చూసుకుని నిర్మాత రిలీజ్ డేట్ ప్రకటించేవారు. కానీ ఇప్పుడు డిజిటల్ హక్కులు కూడా వ్యాపారంలో కీలకంగా మారడంతో ఓటీటీ ఒప్పందంలోని షరతులు కూడా విడుదల ప్రణాళిక పై ప్రభావం చూపుతున్నాయి. త్వరలోనే విడుదల కానున్న ఒక సినిమాకు మొదట ఒక రిలీజ్ డేట్ అనుకున్నారు. ఆ ప్రకారమే ఓటీటీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు కూడా. అయితే రకరకాల కారణాల వల్ల ఆ సినిమా అనుకున్న తేదీకు విడుదల చేయలేకపోయామని ఓటీటీ సంస్థను సంప్రదిస్తే, ‘మేము చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ కాకపోతే మన అగ్రిమెంట్లో అనుకున్న మొత్తంలో సగమే ఇవ్వాల్సి ఉంటుంది’ అని సున్నితంగా చెప్పడంతో ఆ చిత్ర నిర్మాత కంగారు పడి ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. ఇది కేవలం ఒక సినిమా సమస్య మాత్రమే కాదు.. సినిమా వ్యాపారంలో వస్తున్న మార్పులకు ఒక సంకేతం. ఓటీటీ వల్ల నిర్మాతలకు కొత్త మార్కెట్ వచ్చింది. ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని చూసే ప్రపంచ స్థాయి కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. కొత్త కథలకు కొత్త వేదిక దొరికింది.
అదే సమయంలో థియేటర్ వ్యాపారం మీద కూడా ఒత్తిడి పెరిగింది. ‘ఓటీటీలో వస్తుంది కదా.. ఇంక థియేటర్కు ఎందుకులే’ అనే ధోరణి ప్రేక్షకుల్లో పెరిగి థియేట్రికల్ ఆదాయాన్ని ప్రభావితం చేస్తోంది. ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే.. నిర్మాతకు థియేటర్, ఓటీటీ రెండూ అవసరమే. కానీ ఏది సినిమాను నడిపించాలి, ఏది సినిమాకు తోడుగా ఉండాలి.. అనేది చిత్ర పరిశ్రమ నిర్ణయించుకోవాల్సిన అంశం.
ALSO READ:
బ్రేకప్ నుంచి ట్రోలింగ్ వరకు.. ఐశ్వర్య లక్ష్మి జీవితంలో ఎన్నో షాకింగ్ అనుభవాలు!
Nani: నేచురల్ స్టార్ నాని అసలు స్వభావం ఇదే!
భూకబ్జా ఆరోపణలు.. నిర్మాత సి.కల్యాణ్ పై కేసు నమోదు