బ్రేకప్ నుంచి ట్రోలింగ్ వరకు.. ఐశ్వర్య లక్ష్మి జీవితంలో ఎన్నో షాకింగ్ అనుభవాలు!
ABN , Publish Date - Sep 20 , 2026 | 07:56 AM
రూమర్ల నుంచి ట్రోలింగ్ వరకు.. పరాజయాల నుంచి పర్సనల్ లైఫ్ బ్రేకప్ ల వరకు... ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ సినీరంగంలో తనదైన ముద్ర వేస్తోంది నటి ఐశ్వర్య లక్ష్మి.
రూమర్ల నుంచి ట్రోలింగ్ వరకు.. పరాజయాల నుంచి పర్సనల్ లైఫ్ బ్రేకప్ ల వరకు... ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ సినీరంగంలో తనదైన ముద్ర వేస్తోంది నటి ఐశ్వర్య లక్ష్మి. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. సమాజం నూరిపోసే పద్ధతులను ప్రశ్నిస్తూ నమ్మక ద్రోహాలను సైతం ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన ఆమె అంతరంగమిది. వ్యక్తిగత జీవితం, సైకాలజీ థెరపీ, కుటుంబ జీవితం, ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై ఐశ్వర్య లక్ష్మి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే...
‘‘నా జీవితంలో నేను ఎవరినీ అంత తేలిగ్గా ఇష్టపడను, అంత త్వరగా ఎవరినీ నమ్మను. ఎంతో ఆలోచించి, మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. దురదృష్టవశాత్తు నేను ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి నుంచి తీవ్రమైన నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొన్నాను. ఆశ్చర్యం ఏమిటంటే.. ఆ బంధం పూర్తిగా ముగిసిపోయిన తర్వాతే అతడు నన్ను మోసం చేశాడనే నిజం నాకు తెలిసింది. ఒక రోజు మరో అమ్మాయి నా దగ్గరకు వచ్చి ‘నీకో నిజం చెప్పాలి’ అని నా మాజీ భాగస్వామి గురించి, అతడి ప్రవర్తన గురించి అంతా బయటపెట్టింది. ఆ అమ్మాయి చెప్పిన విషయాలు విన్నాక నాకు ఆమెపై ఎలాంటి కోపం కానీ, ద్వేషం కానీ కలగలేదు. ఎందుకంటే అందులో ఆమె తప్పేమీ లేదు. కానీ, నేను ప్రాణంగా నమ్మిన వ్యక్తి నన్ను ఇలా వెన్నుపోటు పొడిచాడనే నిజం తెలిశాక నా గుండె ముక్కలైంది. ఆ మానసిక వేదనను జీర్ణించుకోవడానికి నాకు రెండు రోజులు పట్టింది. ఆ తర్వాత దానిని నా జీవితంలో ఒక అనుభవంగా భావించి అక్కడితో వదిలేశాను.
థెరపీ నేర్పిన పాఠం
ఆ కఠిన బ్రేకప్ తర్వాత నా మానసిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. డిప్రెషన్, మానసిక అలసట నుంచి బయటపడటానికి థెరపీని ఆశ్రయించడం నా జీవితంలో నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం అని ధైర్యంగా చెప్పగలను. నాలాగే మానసిక వేదనను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ నేను ఒకటే చెబుతాను.. జీవితంలో కోలుకోవడానికి థెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటిసారి సరైన ఫలితం రాకపోయినా , లేదా మీకు ఆ అనుభవం నచ్చకపోయినా అక్కడితో ఆపేసి నిరాశపడకండి. సరైన సైకాలజిస్ట్ లేదా థెరపి్‌స్టను పట్టుకోవడం చాలా ముఖ్యం. సరైన కౌన్సెలింగ్ మన ఆలోచనా ధోరణిని మార్చేసి, మళ్లీ కొత్త జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించేందుకు మార్గం చూపుతుంది.
కింగ్ ఆఫ్ కొత్త’ ట్రోలింగ్
విజయం ఇచ్చిన ప్రోత్సాహం కంటే.. వైఫల్యం ఇచ్చిన పాఠాలు నా కెరీర్‌లో చాలా ఎక్కువ. ‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఆ సినిమా ఫ్లాప్ కావడం, నా నటనపై సోషల్ మీడియాలో వచ్చిన విపరీతమైన ట్రోల్స్ నన్ను, కథానాయకుడు దుల్కర్ సల్మాన్‌తోపాటు మొత్తం టీమ్‌ను తీవ్రంగా కుంగదీశాయి. ముఖ్యంగా ఆ సినిమాలో నా డెలివరీ, ‘రాజువేట్టా’ అనే నా డైలాగ్‌పై నెట్టింట వచ్చిన విమర్శలు నా మనసును బాగా గాయపరిచాయి. సరే, ప్రేక్షకులు చేసిన విమర్శల్లో కొన్ని నిజాలే ఉన్నాయి కదా అని సరిపెట్టుకున్నాను. కానీ ఆ తర్వాత ఒక షూటింగ్ సెట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నన్ను అదే పేరుతో ఎగతాళి చేసినప్పుడు నేను బాధపడ్డాను. ఆ పరాజయం తర్వాత మలయాళంలో నాకు ఆఫర్లు ఇవ్వడానికి నిర్మాతలు, దర్శకులు భయపడ్డారనిపించింది. ఆఖరికి ఒక ప్రకటన కోసం దుల్కర్ సల్మాన్‌తో మళ్లీ నటించే అవకాశం వచ్చినప్పటికీ, ట్రోలింగ్ మళ్లీ ఎక్కడ మొదలవుతుందోనన్న భయంతో నటించనని చెప్పేశాను. ఆ భయం నాలో ఎంతగా నిండిపోయిందంటే.. దుల్కర్‌తో మళ్లీ పనిచేయగలనా? అన్న సందేహం నన్ను వెంటాడింది.
దుస్తుల వివాదం
నేను వేసుకునే దుస్తుల విషయంలో సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ నటులకు ఒక సాధారణ విషయమే కావచ్చు. కానీ సొంత ఊరిలో, బంధువుల మధ్య ఉండే నా తల్లిదండ్రులకు మాత్రం అది పెద్ద సమస్యగా మారింది. నా దుస్తుల విషయంలో స్థానిక ప్రదేశాల్లో నా తల్లికి ఇతరుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యేవి. ‘మీ అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుని తిరుగుతుంటేంటి?’ అని కొందరు ఆమెను అడిగినప్పుడు అమ్మ ఎంతో బాధపడేది. దానివల్ల నాకు, అమ్మకూ మధ్య తరచూ వాదనలు జరిగేవి. ఇప్పుడు నేను ఏదైనా ఇంటర్వ్యూకి లేదా పబ్లిక్ ఈవెంట్‌కు వెళ్లేముందు నేను వేసుకోబోయే దుస్తులను అమ్మకు చూపిస్తాను. అలా చేయడం వల్ల నాలో కొంత ఒత్తిడి తగ్గుతుంది. నా కుటుంబంతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది, వారి ఆలోచనలు నా మనసును ఎప్పుడూ వెంటాడుతుంటాయి. కొన్నిసార్లు ఎలాంటి లైమ్‌లైట్ లేకుండా చాలా ప్రశాంతమైన, సాధారణ కుటుంబాలను చూస్తే నాకు అసూయ వేస్తుంటుంది.
కెమెరా కోణాలు
పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లినప్పుడు కెమెరామన్ల ప్రవర్తన కూడా నాకు ఇబ్బందిగా అనిపించేది. నేను వేదికపైకి రాగానే నా ముఖాన్ని చూపించడం మానేసి, నా శరీరాన్ని మాత్రమే జూమ్ చేసి ఫోకస్ చేయడం చూసి చాలా అసౌకర్యానికి గురయ్యాను. ‘మాకు నీ ముఖం, నటన అక్కర్లేదు’ అని ఆ ఫోకస్ నాకు చెబుతున్నట్టు అనిపించేది. దాంతో ఇబ్బందిగా అనిపించి నా చేతులను గుండెలకు అడ్డుగా పెట్టుకుంటే.. ‘ఓహో.. ఇప్పుడు బోధపడి కప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో నా కామెంట్ సెక్షన్‌లో అసభ్యకరంగా రాశారు. నేను వేసుకున్న దుస్తులు నాకిష్టమైనవే, వాటిని ధరించడంలో నాకేమీ ఇబ్బంది లేదు. కానీ సమాజం చూసే ఆ వంకర చూపులే అసహ్యం కలిగిస్తాయి.
భవిష్యత్తు ప్రయాణం
ఈ 34-35 ఏళ్ల జీవిత ప్రయాణంలో సమాజంలో నేను చూసిన అనేక పెళ్లిళ్లలో నిజమైన సంతోషం నాకు చాలా తక్కువగా కనిపించింది. దంపతుల మధ్య వచ్చే విభేదాలు, ఒత్తిడి వారి మానసిక ప్రశాంతతను, కెరీర్‌ను నాశనం చేయడం గమనించాను. అందుకే పెళ్లి, సహజీవనం లాంటి విషయాల్లో తొందరపడకుండా నా ఆలోచనలకు తగ్గట్లు ప్రశాంతంగా జీవించడానికే ప్రాధాన్యమిస్తున్నాను. వృత్తిపరంగా వైద్యరంగం నుంచి మోడలింగ్, ఆపై ‘మాయానది’, ‘గార్గి’, ‘పొన్నియన్ సెల్వన్’, ‘అమ్ము’, ‘గట్టా కుస్తీ’ వరకు ఎన్నో మంచి పాత్రలు చేశాను. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాను. సెప్టెంబర్ 11న విడుదలైన నా తాజా చిత్రం ‘ఆషా’ విజయం నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
కిలోన్నర బంగారం
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నా వ్యక్తిగత జీవితంపై, నా కుటుంబంపై వస్తున్న పుకార్ల గురించి ఓపెన్‌గా మాట్లాడాను. మా నాన్నకు యూట్యూబ్ చూడటం అలవాటు. అలా చూస్తున్నప్పుడు నా గురించి వచ్చే రకరకాల ఫేక్‌న్యూస్ ఆయన కంటపడి ఆందోళన చెందుతుంటారు. ఉద్యోగ బాధ్యతల వల్ల మా అమ్మకు ఇవన్నీ చూసేంత సమయం ఉండదు. ఒక యూట్యూబర్ అయితే.. నా పెళ్లి కోసం నా తల్లిదండ్రులు ఒకటిన్నర కిలోల బంగారం కొనిపెట్టారని ఒక వార్త సృష్టించాడు. అది చూసి నేను నాన్నతో ‘అసలు అంత బంగారం ఎక్కడి నుంచి వస్తుంది నాన్నా? ఆ వార్తలు రాసేవాళ్లు అబద్ధాలు చెబుతున్నారని అంత స్పష్టంగా కనిపిస్తుంటే మీరు ఎందుకు నమ్ముతారు?’ అని సర్దిచెప్పాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా ఏదో ఒక పెద్ద బంగ్లాను చూపించి అది నా ఇల్లే అని ప్రచారం చేశారు. నిజానికి మా ఇల్లు అంత పెద్దదేమీ కాదు. చివరికి నా తల్లిదండ్రులు డాక్టర్లు అని కూడా రాశారు. కానీ నా తండ్రి సెక్రటేరియట్‌లో, అమ్మ పీఎంజీలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైరయ్యారు. ఈ ఆధారాల్లేని గాలి వార్తలు నా కుటుంబ శాంతిని తీవ్రంగా దెబ్బతీశాయి.
పెళ్లి, సహజీవనం లాంటి విషయాల్లో తొందరపడకుండా... నా ఆలోచనలకు తగ్గట్లు ప్రశాంతంగా జీవించడానికే ప్రాధాన్యమిస్తున్నాను.