ఓజీ-2.. ఈ విషయంలో పవన్, సుజీత్.. ఇద్దరూ మారాల్సిందేనా
ABN, Publish Date - Jun 27 , 2026 | 11:22 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఓజీ’. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఘన విజయాన్ని అందుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), యంగ్ డైరెక్టర్ సుజిత్ (Sujeeth) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఓజీ’ (OG). గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను సుజిత్ ప్రెజెంట్ చేసిన తీరు, పవర్ స్టార్ స్టైల్, మేనరిజమ్స్ వేరే లెవెల్‌లో ఉండి అభిమానులను ఉర్రూతలూగించాయి. దీనికి తోడు థమన్ అందించిన సంగీతం, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ఈ అంశాలన్నీ తోడవడంతో ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా? అని సినీ ప్రేక్షకులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూడటం మొదలుపెట్టారు.
అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ మేకర్స్ ఇటీవలే ‘ఓజీ-2’ (OG 2)ను అధికారికంగా ప్రకటించారు. నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అత్యంత బిజీగా ఉండటం, అలాగే ‘ఓజీ’ కథలో సీక్వెల్ తీసేంత స్కోప్ ఉందా అనే అనుమానాలు ఉండటంతో మొదట్లో ఈ వార్తను ఎవరూ పెద్దగా నమ్మలేదు. గతంలో పవన్, సుజిత్ ఇద్దరూ ఓజీ యూనివర్స్ గురించి మాట్లాడినా జనాల్లో పెద్దగా నమ్మకం కలగలేదు. కానీ, అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ వీరిద్దరూ చేతులు కలిపి, ‘ఓజీ-2’ సన్నాహాలను వేగవంతం చేశారు. సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే పూర్తి వివరాలు రాకపోయినప్పటికీ, ఇటీవల విడుదలైన ఒక వీడియోతో వర్క్ చురుగ్గానే సాగుతోందని స్పష్టమవడంతో అభిమానుల్లో సరికొత్త చర్చలు మొదలయ్యాయి.
‘ఓజీ’ చిత్రం ప్రీ-రిలీజ్ హైప్, అద్భుతమైన ఎలివేషన్లు, సుజిత్ టేకింగ్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల భారీ వసూళ్లను అయితే రాబట్టింది కానీ, సాధారణ ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినైతే ఇవ్వలేదన్నది సినీ వర్గాల అభిప్రాయం. ప్రేక్షకులు దర్శకుడు సుజిత్ నుంచి కథ పరంగా ఇంకా బలమైన కంటెంట్‌ను ఆశించారు. టేకింగ్ పరంగా సినిమా బాగున్నప్పటికీ, కథలో కొత్తదనం, సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నాయనే భావన వ్యక్తమైంది. అలాగే పవన్ కళ్యాణ్ తన గత చిత్రాల కంటే ఇందులో స్టైలిష్‌గా, బెటర్ పెర్ఫార్మెన్స్‌తో కనిపించినా.. ఆయన తన పూర్తి స్థాయి పొటెన్షియాలిటీని చూపించలేదని, ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొదటి భాగానికి కేవలం హైప్ మాత్రమే కలిసి వచ్చి భారీ వసూళ్లు తెచ్చిపెట్టింది, కానీ ‘ఓజీ-2’ విషయంలో ప్రేక్షకులు కేవలం ఎలివేషన్లు మాత్రమే కాకుండా బలమైన కంటెంట్, కథలో వైవిధ్యం ఆశిస్తారు. కాబట్టి సుజిత్ ఈసారి టేకింగ్ కంటే రైటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ బిజీ షెడ్యూల్ కారణంగా ఆషామాషీగా షూటింగ్ చేయకుండా, సినిమాకు వరుసగా డేట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రేక్షకుల అంచనాలను తేలికగా తీసుకోకుండా చిత్ర యూనిట్ శ్రమిస్తేనే ‘ఓజీ-2’ భారీ అంచనాలను అందుకోగలుగుతుంది.
ఇవి కూడా చదవండి:
‘నాగబంధం’ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్స్ వివరాలివే!
Kamal Haasan: ఒకే నెలలో గురు శిష్యుల మరణం.. తమిళ పరిశ్రమ కన్నీరుమున్నీరు..
Naga Chaitanya: నా కెరీర్‌లో బెస్ట్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆ హీరోయిన్‌తోనే