Dragon: యన్టీఆర్‌కు ఈ గ్యాప్ కలిసొస్తుందా!?
ABN , Publish Date - Sep 10 , 2026 | 03:50 PM
యంగ్ టైగర్ యన్టీఆర్ ఇకపై గ్యాప్ లేకుండా ఎవ్రీ ఇయర్ అలరిస్తారని ఫ్యాన్స్ ఆశించారు. అయితే మళ్ళీ విరామం అనివార్యమయింది. ఈ గ్యాప్స్ యన్టీఆర్ కు కలసి వస్తాయని అభిమానులు అంటున్నారు.
యన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'డ్రాగన్' మూవీ రెండడుగులు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి సాగుతున్నట్టుగా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే 'డ్రాగన్' మూవీ ఈ యేడాది జనం ముందుకు రావాలి. అయితే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల 'డ్రాగన్' షూటింగ్ ముందుకు సాగలేదు. ఈ మధ్య యన్టీఆర్ భుజానికి ఆపరేషన్ జరిగింది. ఈ కారణంగా కూడా షూటింగ్ లో జాప్యం చోటు చేసుకుంది. ఇలా ఏదో ఒక కారణంగా 'డ్రాగన్' షూటింగ్ అనుకున్న తీరున సాగడం లేదు. మళ్ళీ యన్టీఆర్ 'డ్రాగన్' చిత్రీకరణలో పాలుపంచుకుంటున్నారని తెలియగానే అభిమానుల ఆనందం అంబరమంటుతోంది. ఏమైనా 'డ్రాగన్' ఈ యేడాది వెలుగు చూడడం లేదు. అందువల్ల మళ్ళీ జూనియర్ కెరీర్ లో గ్యాప్ పడిందనే చెప్పాలి. అయితే ఈ గ్యాప్ - సక్సెస్ రూటుకు దారితీసేదే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
యన్టీఆర్ సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చింది మొదలు 2001 నుండి 2008 వరకు ప్రతి యేటా సినిమాలను రిలీజ్ చేస్తూనే వచ్చారు. అయితే 2008లో 'కంత్రి' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో సరైన సబ్జెక్ట్ కోసం ఎదురుచూశారు. ఆ సమయంలో కొంత గ్యాప్ తీసుకోవలసి వచ్చింది. తరువాత 2010 లో సంక్రాంతికి 'అదుర్స్'తో భలేగా అలరించారు యన్టీఆర్. ఆ సినిమాలో యన్టీఆర్ పంచిన వినోదాన్ని అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. అదే యేడాది దసరా కానుకగా వచ్చిన యన్టీఆర్ మూవీ 'బృందావనం' సైతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. 2009లో యన్టీఆర్ సినిమా రిలీజ్ కాకపోయినా, మరుసటి సంవత్సరం ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అందించారు. ఆ తరువాత 2018 వరకు మళ్ళీ గ్యాప్ లేకుండా ప్రతి యేటా కనీసం ఓ సినిమానైనా జనం ముందు నిలుపుతూ వచ్చారు యన్టీఆర్. వాటిలో జయాపజయాలు ఉన్నాయి. 'ట్రిపుల్ ఆర్' కోసం గ్యాప్ అనివార్యమయింది. 2022లో 'ట్రిపుల్ ఆర్' వెలుగు చూసింది. ఆ సినిమా బంపర్ హిట్ కావడమే కాదు యన్టీఆర్ ను గ్లోబల్ స్టార్ గానూ నిలిపింది.
'ట్రిపుల్ ఆర్' గ్రాండ్ సక్సెస్ తరువాత మళ్ళీ వరుసగా చిత్రాలు చేస్తూ సాగాలనే యన్టీఆర్ నిర్ణయించారు. అయితే 2023లో ఏ సినిమానూ రిలీజ్ చేయలేకపోయారు. 2024లో 'దేవర'తో జనాన్ని మెప్పించారు. మరుసటి సంవత్సరం వచ్చిన 'వార్ -2' మెప్పిస్తుందని అందరూ ఆశించారు. అయితే ఆ సినిమా అభిమానులకు నిరాశనే మిగిల్చింది. దాంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'డ్రాగన్'పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ మూవీ ఈ యేడాది వెలుగు చూడదని తేలిపోయింది. అలా 2026లో యన్టీఆర్ సినిమా రిలీజ్ కాకపోవడంతో మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ తరువాత రాబోయే 'డ్రాగన్' ఖచ్చితంగా బంపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలా గ్యాప్స్ తరువాత అలరిస్తూ సాగిన యన్టీఆర్ 'డ్రాగన్'తో ఏ రేంజ్ లో మురిపిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Mandaadi Review: సూరి, సుహాస్ నటించిన ‘మండాడి’ ఎలా ఉందంటే..
Sardar 2 Review: కార్తీ సర్దార్ 2 మూవీ రివ్యూ
‘రాకా’లో విల్ స్మిత్ ఊరమాస్ అవతార్.. లీక్డ్ పిక్ వైరల్
జయం రవి బర్త్‌డే స్పెషల్.. ‘వడ్డీ కాసులవాడ’ న్యూ పోస్టర్ వైరల్
200 కోట్ల నుంచి 30 కోట్లకు పతనం.. ‘టాక్సిక్’కు దెబ్బ మీద దెబ్బ