ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ఆలస్యం.. కారణం ఇదేనా!

ABN , Publish Date - Aug 08 , 2026 | 05:56 PM

టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్స్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకటి. ఈ కాంబోలో తెరకెక్కాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ షూటింగ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.

Jr NTR and Trivikram Srinivas

టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్స్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses Jr NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి క్రేజీ కాంబోలో ఇప్పటికే వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించగా, ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి పురాణ కథల ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ పౌరాణిక యాక్షన్ ఎపిక్‌లో తారక్ ఒక పవర్‌ఫుల్ యోధుడిగా కనిపించబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అనే టైటిల్‌ను పరిశీలిస్తుండగా, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.


ఈ మూవీ ప్రకటించినప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఒక త్రిశూలం, ఆ త్రిశూలానికి DNA లింక్ అయి ఉన్న పోస్టర్ తో పాటు ‘ఉత్తరాన పుట్టింది.. మధ్యభూమిలో రూపుదిద్దుకుంది.. దక్షిణాన పూజించబడింది.. ఇప్పుడు విశ్వానికి చెందవలసిన ఒక గాథ’ అని మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తిని విపరీతంగా పెంచింది. అయితే, ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అభిమానులు ఆశించిన దానికంటే కొంచెం ఆలస్యంగా పట్టాలెక్కనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ (Dragon) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘కెజియఫ్, సలార్’ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటులు అనిల్ కపూర్, బిజు మీనన్, అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


ప్రస్తుతం ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో, ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. తారక్ ప్రత్యక్షంగా షూటింగ్‌లో పాల్గొనకపోయినా, ఆయన లేని కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న వెంటనే ఎన్టీఆర్ మొదట ‘డ్రాగన్’ సినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాతే పూర్తిస్థాయిలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు 2027 మార్చి తర్వాత ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే అదే సంవత్సరం సెకండ్ హాఫ్‌లో ఈ భారీ పౌరాణిక యాక్షన్ ఎపిక్ షూటింగ్ లాంచ్ కానుందట. సో.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోన్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

ఈ వార్తలపై కూడా ఓ లుక్ వేయండి:

The Paradise: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేలా..

Srinivasa Mangapuram: పరాజయాన్ని అంగీకరించిన అజయ్ భూపతి

హైప్‌ని అందుకోలేకపోతోన్న సుకుమార్ శిష్యులు

Updated Date - Aug 08 , 2026 | 05:56 PM