Srinivasa Mangapuram: పరాజయాన్ని అంగీకరించిన అజయ్ భూపతి
ABN , Publish Date - Aug 08 , 2026 | 04:44 PM
శ్రీనివాస మంగాపురం సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనని దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు. ఈ సందర్భంగా నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడు అజయ్ భూపతి సంచలన ప్రకటన చేశాడు. తాజాగా విడుదలైన 'శ్రీనివాస మంగాపురం' సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించాడు. ఈ మేరకు అజయ్ భూపతి ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో 'శ్రీనివాసమంగాపురం నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా నాకు ఎన్నో అనుభూతులను, జ్ఞాపకాలను అందించింది. వాటిని నేను ఎప్పటికీ ఎంతో అపురూపంగా గుర్తుంచుకుంటాను. జయకృష్ణ, రాషాలతో కలిసి పనిచేస్తున్నప్పుడు వారు కొత్తవాళ్లతో పనిచేస్తున్నట్టుగా ఎప్పుడూ అనిపించలేదు. వారు తమ బెస్ట్ ఇచ్చారు. అశ్వినీదత్ గారితో కలిసి పనిచేయడం కూడా ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. కిరణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత నాదే. నేను త్వరలోనే మళ్లీ పైకి వస్తాను. మీ అందరికీ నచ్చే సినిమాతో తిరిగి వస్తాను. మొత్తం నటీనటులు, సాంకేతిక సిబ్బంది, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.
'శ్రీనివాస మంగాపురం' సినిమాతో కృష్ణ మనవడు, రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం అయ్యాడు. అలానే రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కూడా ఇదే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మోహన్ బాబు ఇందులో జయకృష్ణ తాతగా కీలక పాత్రను పోషించాడు. నటీనటులు బాగానే చేసినా, కథలో కొత్తదనం లేకపోవడం ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన తర్వాత జయకృష్ణను యాక్సెప్ట్ చేసిన అభిమానులకు ఆదిశేషగిరి రావు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా జయాపజయాలను మనసులోకి తీసుకోకుండా ముందుకు సాగాలని ఆయన జయకృష్ణకు హితవు పలికారు. పద్మాలయా స్టూడియోస్ వ్యవహారాలను చూసుకోవాల్సిన బాధ్యత జయకృష్ణదే అని చెప్పారు. అయితే 'శ్రీనివాస మంగాపురం' పరాజయానికి బాధ్యత వహిస్తూ అజయ్ భూపతి ఇవాళ ట్వీట్ చేయడం కృష్ణ అభిమానులలో చర్చనీయాంశంగా మారింది.
Also Read:
Chandini Chowdary: కమిట్‌మెంట్ ఇవ్వలేదని ఇండస్ట్రీలో బ్యాడ్ చేశాడు..
రూ. కోటి విరాళం.. రజనీకాంత్ హామీపై లతా రజనీకాంత్ స్పష్టత!
ఇది రాజకీయం.. ఉదయనిధి అరెస్ట్ పై విశాల్ సంచలన వ్యాఖ్యలు