సరిహద్దులు చెరిపేస్తున్న స్టార్‌ కాంబినేషన్స్‌!

ABN , Publish Date - Sep 20 , 2026 | 10:42 AM

కళలకు ఎల్లలు లేవు.. కళాకారులకు ఉత్తరం-దక్షిణం, తూర్పు-పడమర అన్న హద్దులే ఉండవు... అందుకే మునుపటి కంటే మిన్నగా ఇప్పుడు సౌత్- నార్త్ స్టార్స్ ములాఖత్ సాగుతోంది..

కళలకు ఎల్లలు లేవు.. కళాకారులకు ఉత్తరం-దక్షిణం, తూర్పు-పడమర అన్న హద్దులే ఉండవు... అందుకే మునుపటి కంటే మిన్నగా ఇప్పుడు సౌత్- నార్త్ స్టార్స్ ములాఖత్ సాగుతోంది... ఆ ముచ్చటేంటో చూద్దాం...

ఆదరణ కోసమే...

ఉత్తరాది తారలు దక్షిణాది చిత్రాల్లో నటించడం. సౌత్ స్టార్స్ నార్త్ మూవీస్ లో అభినయించడం కొత్తేమీకాదు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఉత్తరం- దక్షిణం అన్న తేడాలు చెరిగిపోయి ఇటు అటుగా, అటు ఇటుగా నటీనటులు కలసి ఎక్కువ చిత్రాల్లో నటిస్తూ ఉన్నారు. అలాంటి చిత్రాలకు ప్రేక్షకుల్లోనూ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొని ఉండడం గమనార్హం. ఒకప్పుడు హిందీ సినిమాకు 'ఇండియన్ మూవీ' అనే పేరుండేది. అంటే దేశవిదేశాల్లోనూ ఇండియన్ సినిమా అంటే హిందీ చిత్రాలు మాత్రమే అనే గుర్తింపు సాగేది. కానీ, ఇప్పుడు దక్షిణాది భాషలు సైతం దేశవిదేశాల్లో తమదైన మార్కు చూపిస్తున్నాయి... ఈ కోణంలో ఆలోచించిన బాలీవుడ్ మేకర్స్ తమ చిత్రాల్లో సౌత్ స్టార్స్ ను నటింప చేయాలని తపిస్తున్నారు... ఎందుకంటే సౌత్ స్టార్స్ తో కలసి నార్త్ యాక్టర్స్ నటిస్తే సదరు చిత్రానికి ఆల్ ఇండియాలో ఓ క్రేజ్ లభిస్తుంది... అంతేకాదు విదేశాల్లో సదరు స్టార్స్ మాతృభాషకు చెందిన జనం ఈ కాంబో మూవీస్ ను ఆదరిస్తారనే నమ్మకమూ బాలీవుడ్ బాబులకు ఉంది. అందువల్లే ఇప్పుడు నార్త్ మూవీస్ లోనూ సౌత్ స్టార్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా జనం ముందు నిలచిన 'దాయ్రా' హిందీ చిత్రంలో మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ నటించడంతో ఆ మూవీకి కేరళవాసుల్లో ఓ క్రేజ్ ఏర్పడింది.

టాలీవుడ్ స్టార్స్ పై మోజు...

ఒకప్పుడు నార్త్ హీరోయిన్స్ సౌత్ మూవీస్ లో హల్చల్ చేసేవారు. మన హీరోలు ఎందువల్లో హిందీ చిత్రాల్లో నటించడానికి అంత ఆసక్తి కనబరిచేవారు కారు. నిర్మాతలు-దర్శకుల అభిలాష మేరకు కొందరు సౌత్ స్టార్స్ హిందీ చిత్రాల్లో నటించారు. విజయాలూ సాధించారు. అయినా అక్కడి సినిమాల్లో సాగడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. అంతెందుకు ఉత్తరాదివారి అల్లుడైన మహేశ్ బాబును హిందీ చిత్రాల్లో నటింప చేయాలని పలువురు బాలీవుడ్ బడా  నిర్మాతలే ప్రయత్నించారు. అయినా మహేశ్ బాబు తెలుగు చిత్రాలతోనే సాగుతున్నారు. అల్లు అర్జున్ తోనూ సినిమాలు తీయాలని పలువురు బాలీవుడ్ బాబులు తపిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు తమదైన పంథాలోనే పయనిస్తున్నారు. అయితే వీరి తరానికే చెందిన జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ హిందీ చిత్రాలలో ఉత్తరాదివారితో కలసి నటించారు. వారు నటించిన హిందీ సినిమాల ఫలితం ఎలా ఉన్నా బాలీవుడ్ లో వారికి క్రేజ్ ఉంది.


పెద్ద మార్పు..

గతంలో రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున లాంటి సౌత్ స్టార్స్ మాత్రమే హిందీవారు నిర్మించిన సినిమాల్లో నటించారు. చిరంజీవి, వెంకటేశ్ కూడా నార్త్ ప్రొడ్యూసర్స్ మూవీస్ లో కనిపించారు. ఆ తరువాత ఎందువల్లో  ఎవరూ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ, నాగార్జున తరువాత కూడా కొన్ని హిందీ సినిమాల్లో నటిస్తూ సాగారు. ఈ తరం బాలీవుడ్ హీరోలతోనూ కలసి నాగ్ 'బ్రహ్మాస్త్ర'లో నటించారు. అయితే ఎందువల్లో హిందీ స్టార్ హీరోస్ సౌత్ మూవీస్ లో నటించడానికి అంతగా ఆసక్తి చూపించేవారు కారు. బహుశా సౌత్ సినిమా మార్కెట్ కంటే తమ హిందీ చిత్రాల బిజినెస్ ఎక్కువగా ఉండడం వల్ల వారు అలా భావించేవారేమో. ఒకప్పుడు హిందీ చిత్రసీమలో నటత్రయంగా అలరించిన దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ ఏ నాడూ సౌత్ స్టార్స్ తో కలసి నటించలేదు. రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర వంటివారు కూడా మన దక్షిణాది చిత్రాల్లో మన స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే అమితాబ్ బచ్చన్ మాత్రం కొన్ని దక్షిణాది చిత్రాల్లో నటించారు. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ 'కూలీ'లో ఆమిర్ ఖాన్, చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ టాప్ స్టార్స్  మన స్టార్స్ తో కలసి నటించడం పెద్ద మార్పు అనే చెప్పాలి.

అటు ఇటు... ఇటు అటు...

హిందీ నిర్మాతలు సైతం ప్రస్తుతం తమ చిత్రాల్లో సౌత్ స్టార్స్ ను నటింప చేయాలని ఆశిస్తూ ఉండడం విశేషం. అలా జూనియర్ యన్టీఆర్ లాంటి టాలీవుడ్ టాప్ స్టార్ ను ఎంచుకొని హృతిక్ రోషన్ తో 'వార్ 2' రూపొందించారు. అయితే మేకర్స్ ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది. కానీ, సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్ పై బాలీవుడ్ జనం మనసు పడుతున్నారు. అదే తీరున దక్షిణాది నిర్మాతలు సైతం ఉత్తరాదిన తమ చిత్రాలకు క్రేజ్ లభించడానికి నార్త్ స్టార్స్ ను ఎంచుకుంటున్నారు. అలా ఇటు అటుగా అటు ఇటుగా స్టార్స్ సాగుతున్న వైనం ప్రేక్షకులకూ ఆనందం పంచుతోంది.

తగిన సబ్జెక్ట్స్ కావాలి...
సౌత్ మూవీస్ లో నార్త్ టాప్ స్టార్స్ నటిస్తున్నారే కానీ, ఏదో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. అంతకు మించి సాగడం లేదు... గతంలోలాగే కొందరు సౌత్ ప్రొడ్యూసర్స్ నార్త్ టాప్ స్టార్స్ తో సినిమాలు నిర్మిస్తున్నారు. సదరు చిత్రాల్లోనూ సౌత్ స్టార్స్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నార్త్- సౌత్ స్టార్స్ ఇరువైపుల వారికి ప్రాధాన్యముండే పాత్రలు వస్తే బాగుంటుందని సినీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు... అలాంటి ప్రయత్నాలు సాగినప్పుడు సదరు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. అన్నిటినీ గమనిస్తే కేవలం నార్త్ - సౌత్ స్టార్స్ ను కలిపి సినిమాలు తీయడం కాదు. అందుకు తగ్గ సబ్జెక్ట్స్ ను ఎంపిక చేసుకోవడంలో మేకర్స్ ఫెయిలవుతున్నారని చెప్పొచ్చు.

బాలీవుడ్ కు సవాల్...

నార్త్ -సౌత్ అంటూ కొందరు ఇక్కడే సాగుతున్నారు... రాజమౌళి, అట్లీ లాంటి డైరెక్టర్స్ తమ చిత్రాల్లో గ్లోబల్ స్టార్స్ నూ నటింప చేస్తున్నారు. అంటే ఇప్పుడు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ బాలీవుడ్ కే సవాల్ విసరుతున్నారన్న మాట. గతంలో భారీ బాలీవుడ్ మూవీస్ లోనే అడపా దడపా గ్లోబల్ ఇమేజ్ ఉన్న స్టార్స్ కనిపించేవారు... అలాంటిది 'ట్రిపుల్ ఆర్' మూవీతో పేరున్న ఇంగ్లిష్ నటీనటులను నటింప చేశారు రాజమౌళి. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ కొందరు గ్లోబల్ స్టార్స్ కనిపిస్తారని టాక్. ఇక అల్లు అర్జున్ తో అట్లీ తెరకెక్కిస్తోన్న 'రాకా'లో ఏకంగా హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ నటిస్తున్నారట. ఇలా సౌత్ మూవీమేకర్స్ బాలీవుడ్ బాబులకు కూడా ఓ దారి చూపిస్తున్నారు. ఆ బాటలో మరెందరు ఇండియన్ ఫిలిమ్ మేకర్స్ సాగుతారో చూడాలి.

Updated Date - Sep 20 , 2026 | 11:27 AM