National Awards: గుజరాత్ కు మారిన నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ వేడుక!
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:32 AM
కొన్ని దశాబ్దాలుగా ఢిల్లీలోనే నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి... మధ్యలో రెండు సార్లు మద్రాసు వేదిక అయింది... మళ్ళీ ఇన్నాళ్ళకు ఢిల్లీ నుంచి జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక మారడం విశేషంగా మారింది.
కొన్ని దశాబ్దాలుగా ఢిల్లీలోనే నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి. మధ్యలో రెండు సార్లు మద్రాసు వేదిక అయింది... మళ్ళీ ఇన్నాళ్ళకు ఢిల్లీ నుంచి జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక మారడం విశేషంగా మారింది. ఈ సారి గుజరాత్ వేదికగా అవార్డ్స్ ఫంక్షన్ సాగనుంది. ఈ పరిణామానికి కారణాలేంటో..
56 ఏళ్ళ తరువాత...
ప్రపంచ వ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ కు 'ఆస్కార్ అవార్డ్స్' వేడుక ఎంత ఆనందం పంచుతుందో భారతీయ సినిమా అభిమానులకు 'నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్' అంత ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. 1954లో మొదలైన 'నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్' ప్రదానం ఈ నాటికీ కొనసాగుతూనే ఉండడం విశేషం. 1954 నుండి ఢిల్లీ వేదికగానే జాతీయ చలనచిత్ర పురస్కారాల సంబరం సాగుతోంది. దేశరాజధానిలోనే జాతీయ పురస్కారాల ప్రదానం సాగడం ఓ గౌరవంగా భావించేవారు. అయితే మధ్యలో అంటే 1970, 1971లో మాత్రం మద్రాసు వేదికగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సాగింది. మళ్ళీ ఇన్నాళ్ళకు అంటే దాదాపు 56 ఏళ్ళకు ఢిల్లీని వీడి 'నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్' వేడుక గుజరాత్ లో జరగనుంది. సెప్టెంబర్ 22వ తేదీన గుజరాత్ లోని కేవడియా- ఏక్తానగర్ లో ఈ వేడుక సాగనుంది. ఈ సారి జరగబోయే వేడుక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు సంబంధించినది. ఈ అవార్డుల ఫలితాలను జూలై 18న ప్రకటించారు. ఇప్పుడు గుజరాత్ లో ప్రదానం చేయబోతున్నారు. ఈ యేడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ప్రఖ్యాత కన్నడ నటుడు అనంత్ నాగ్ ను ఎంపిక చేశారు. అనంత్ నాగ్ కొన్ని తెలుగు చిత్రాలలోనూ నటించి ఆకట్టుకున్నారు.
భిన్నస్వరాలు...
అసలు జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం దేశ రాజధాని ఢిల్లీ నుండి గుజరాత్ కు ఎందుకు వెళ్తోంది?. ఈ ప్రశ్న పలువురు సినీ ప్రముఖులనూ వేధించింది. కొందరు ఎందుకు గుజరాత్ ను ఎంచుకున్నారు? దేశంలో సినిమాలను అధికంగా రూపొందించే ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలున్నాయి కదా అనీ విమర్శించారు. దేశ ప్రధానమంత్రి, హోమ్ మంత్రి ఇద్దరూ గుజరాత్ కు చెందినవారు కావడంతో అక్కడకు నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ వేడుకను మళ్ళించారనీ కొందరు అంటున్నారు. ఈ కోణంలో యోచిస్తున్నవారు గుజరాత్ లో నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ వేడుకను నిర్వహించడానికి ఇష్టపడడం లేదు. కొందరయితే జాతీయ చలనచిత్ర అవార్డులు కాబట్టి దేశరాజధాని ఢిల్లీలోనే జరపాలనీ చెబుతున్నారు. నటుడు పరేశ్ రావెల్ లాంటివారు ఇలా ఢిల్లీ నుండి వేరే ప్రదేశాలలో నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ వేడుకను నిర్వహించడాన్ని స్వాగతించారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్ర సమాచార- ప్రసార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై జాతీయ చలన చిత్ర అవార్డులను దేశంలోని పలు నగరాల్లో నిర్వహిస్తామన్నది ఆ ప్రకటన సారాంశం. ఈ సారి ఉత్తమ నటుడు కేటగిరీలో మళయాళం 'భ్రమయుగం' నుండి మమ్ముట్టి, 'చందు ఛాంపియన్' నుండి కార్తిక్ ఆర్యన్ ఎన్నికయ్యారు. 'ఆర్టికల్ 370'లో నటించిన యామీ గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డు అందుకోనున్నారు...
జాతీయ సమైక్యత చాటుతూ...
కేంద్రం ఎందుకు గుజరాత్ ను ఎంచుకున్నది స్పష్టంగా ప్రకటించలేదు. అయితే అఖండభారత నిర్మాతగా పేరొందిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' గుజరాత్ లోనే నెలకొంది. అందువల్ల ఈ సారి నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ ప్రదానోత్సవాన్ని అక్కడ నిర్వహిస్తే జాతీయ సమైక్యతను చాటినట్టవుతుందని భావిస్తున్నారు. పటేల్ 'సమైక్యతా విగ్రహం' చెంతనే ఉన్న బస్ బేలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవానికి వేదికను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. దీనికోసం జర్మన్ అల్యూమినియమ్ డోమ్ ను ప్రత్యేకంగా రూపొందించారు. అక్కడే అవార్డుల ప్రదానోత్సవం దాదాపు 75 నిమిషాల పాటు సాగనుంది. ఈ వేడుకలోనే గతంలో ఆనంద్ ఎల్. రాయ్ రూపొందించిన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ- ఏక్తా కా ప్రతీక్' డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. ఈ డాక్యుమెంటరీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించారు.
తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు...
దేశంలోని పలు రాష్ట్రాల్లో చలనచిత్ర అభివృద్ధిని సాధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అన్ని విధాలా చలనచిత్రాభివృద్ధి సాధించిన నగరాల్లో కాకుండా గుజరాత్ లాంటి రాష్ట్రంలో తొలుత జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకను నిర్వహించాలని భావించారు. ఈ భావన తెలిసిన తరువాత తొలుత విమర్శించిన వారు సైతం ఈ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నారు. 1970లోనూ అప్పటి కేంద్రప్రభుత్వ పెద్దలు ఇదే తీరున యోచించి ఆ నాటి దక్షిణాది చలనచిత్రసీమకు కేంద్రంగా ఉన్న మదరాసును 17వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవానికి వేదికగా ఎంచుకున్నారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఈ వేడుకలో పాల్గొనడమే కాదు, ఆయన చేతుల మీదుగానూ పలువురు విజేతలకు అవార్డులు ప్రదానం చేయడం విశేషం. ఆ వేడుకలోనే ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానోత్సవం ప్రప్రథమంగా సాగడం మరింత విశేషం. తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రఖ్యాత నటి దేవికా రాణి అందుకున్నారు... తెలుగునేలపై ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించిన దేవికా రాణి తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడాన్ని అప్పట్లో దక్షిణాది అంతటా విశేషంగా ముచ్చటించుకున్నారు...
సర్వత్రా స్వాగతం...
మదరాసులోనే 18వ జాతీయ చలనచిత్ర పురస్కార ప్రదానోత్సవం కూడా సాగింది. 1971లో మదరాసు వేదికగా సాగిన ఈ వేడుకలో నాటి రాష్ట్రపతి తెలుగువారయిన వి.వి.గిరి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరిగింది.
ఆ తరువాత ఎందుకో కేంద్రం ఢిల్లీ వేదికగానే నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ ను ప్రదానం చేస్తూ వస్తోంది. మళ్ళీ ఇన్నాళ్ళకు దేశంలోని పలు నగరాల్లో ఇకపై జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కార ప్రదానోత్సవాలను నిర్వహించాలన్న యోచన కలిగింది. దీనిని సినీఅభిమానులందరూ స్వాగతిస్తున్నారు. భవిష్యత్ లో ఇంకా ఏ యే నగరాల్లో చలనచిత్ర పురస్కారోత్సవాలు సాగుతాయో చూడాలి.
ALSO READ:
బ్రేకప్ నుంచి ట్రోలింగ్ వరకు.. ఐశ్వర్య లక్ష్మి జీవితంలో ఎన్నో షాకింగ్ అనుభవాలు!
Nani: నేచురల్ స్టార్ నాని అసలు స్వభావం ఇదే!
భూకబ్జా ఆరోపణలు.. నిర్మాత సి.కల్యాణ్ పై కేసు నమోదు