మెగా హీరోల సినిమాలకే.. వారు సమస్యలను సృష్టిస్తున్నారు: నట్టి కుమార్

ABN , Publish Date - May 13 , 2026 | 09:09 PM

టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. ఇలా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని, వాటిని కూర్చుని చర్చించుకుంటే ఎవరికీ ఇబ్బందులు తలెత్తవని అన్నారు నిర్మాత నట్టి కుమార్.

Producer Natti Kumar

టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. ఇలా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని, వాటిని కూర్చుని చర్చించుకుంటే ఎవరికీ ఇబ్బందులు తలెత్తవని అన్నారు నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar). ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న రచ్చపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఒక నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నా.. ఎగ్జిబిటర్స్ అయినా నిర్మాతలైనా కేవలం తమ సమస్యలు మాత్రమే హైలైట్ చేసుకోవడం, అవి మాత్రమే పరిష్కారం కావాలనుకోవడం కరెక్ట్ కాదు. ఏ సమస్యనైనా రెండు వైపులా చూడాలి. ఇప్పుడు అలా చూడకుండా తమ సమస్య మాత్రమే పరిష్కారం కావాలని కొందరు కోరుకుంటున్నారు. నిన్న ఎగ్జిబిటర్స్ పెట్టిన ప్రెస్‌మీట్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రేట్ల పెంపు జీవో ఇచ్చినా అమలు పరచమని చెప్పడం ఎంతమాత్రం సహేతుకం కాదు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. మల్టీ‌ఫ్లెక్స్ థియేటర్స్‌ను ఎంత తక్కువ మంది ప్రేక్షకులు వచ్చినా సినిమాను రన్ చేస్తారు. సింగిల్ థియేటర్స్‌కు అలా రన్ చేయడం కష్టమవుతుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప‌ర్సంటేజీ అడగడం కరెక్ట్ కాదు. రెంటల్ కొంతమేరకు హైక్ అడగవచ్చు. ఇలా అనేక సమస్యలు రెండువైపులా ఉన్నాయి. అలాగే చిన్న సినిమాకు న్యాయం జరగాలి. చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత అందరూ బావుండాలి. ఈ నెల 15న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరగబోయే సమావేశంలో అందరి శ్రేయస్సు‌ను కాంక్షిస్తూ నిర్ణయాలు జరగాలి.


దిల్ రాజు (Dil Raju) వర్సెస్ మైత్రీ (Mythri Movie Makers) మధ్య కోల్డ్ వార్ వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయి. చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్.. ఇలా మెగా కుటుంబంలోని హీరోల సినిమాల విడుదలకు ముందు కావాలని పనిగట్టుకుని సమస్యలను సృష్టిస్తున్నారు. ప్రతీసారి వారినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? జూన్ 4న రామ్ చరణ్ ‘పెద్ది’ (Ram Charan Peddi) సినిమా రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొదలైన సమయంలో.. అంతకుముందు ఎప్పుడూ వీరికి సమస్యలు కనిపించలేదా? సినిమా విడుదలకు ముందు ఇలా సమస్యలు సృష్టిస్తూ.. జీవో‌లను సైతం అమలు చేయమని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ఇలాంటి స్టేట్‌మెంట్స్‌తో అభిమానుల్లో కలవరం కలిగించడం కరెక్ట్ కాదు. ఇలాంటివి ఎన్ని జరిగినా, ఎట్టి పరిస్థితులలో ‘పెద్ది’ సినిమాను ఆపలేరు.


కులం, మతం చూడకుండా ఏపీ‌ఎఫ్‌డీసీ చైర్మన్‌ను నియమించాలి

చిత్ర పరిశ్రమ సమస్యలను క్షుణ్ణంగా తెలిసి.. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పాటుపడే వ్యక్తికి మాత్రమే ఏపీ‌ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించాలి. ఇందుకు కులం, మతం వంటివి పరిగణనలోకి తీసుకోకూడదు. అధికారంలోకి రావడానికి కాపులను వాడుకుంటారే తప్ప, ఆ తర్వాత పదవుల విషయంలో కాపులను పట్టించుకోవడం లేదు. నేను కూడా ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పదవిని ఆశించాను, కానీ అది నాకు రాదని అర్థం చేసుకుని, ఆశలు వదిలేసుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చ‌పై మధుర శ్రీధర్

అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్

Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!

రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం

Updated Date - May 13 , 2026 | 09:09 PM