అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్

ABN , Publish Date - May 13 , 2026 | 07:50 PM

టాలీవుడ్‌లో పర్సంటేజ్ విధానంపై జరుగుతున్న చర్చలు వేడెక్కుతున్నాయి. నిర్మాతలు రెండు గ్రూపులుగా విడిపోయి.. ఎవరికి అనుకూలంగా వారు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Mythri Movie Makers Ravi Shankar

టాలీవుడ్‌లో పర్సంటేజ్ విధానంపై జరుగుతున్న చర్చలు వేడెక్కుతున్నాయి. నిర్మాతలు రెండు గ్రూపులుగా విడిపోయి.. ఎవరికి అనుకూలంగా వారు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించి, వారి వాదనలు వినిపించారు. ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయంటూ బుధవారం తెలుగు సినీ నిర్మాతలు మీడియా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలిపారు. మరీ ముఖ్యంగా ‘హరి హర వీరమల్లు’ సినిమా టైమ్‌లో ఈ సమస్య తెరపైకి వచ్చిందని, ఆ తర్వాత చాలా సినిమా విడుదలైనప్పటికీ కామ్‌గా ఉంది.. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా వస్తుంటే మళ్లీ ఇలా సమస్యలు సృష్టించడం సరికాదని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాత యలమంచిలి రవిశంకర్ (Y. Ravi Shankar) సంచలన ఆరోపణలు చేశారు.


ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న (మంగళవారం) ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్ నిర్వహించి వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ అంశంపై నిర్మాతల కోణం కూడా తెలియజేయాలని, నిజానిజాలు తెలపాలనే ఉద్దేశంతో ఇలా సమావేశమయ్యాం. ఎగ్జిబిటర్లు బాగా ఇబ్బందులు పడుతున్నారు, అందుకే పర్సెంటేజ్ విధానానికి రావాలని అనుకుంటున్నామని వారంతా తెలిపారు. ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు.. మేము దానికి అంగీకరిస్తాం. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని కూడా దయచేసి గ్రహించండి. ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ సంతోషంగా లేరు. కానీ, మేము ఒక్కరిమే మా ప్రయోజనం మేము చూసుకొని వెళ్ళిపోతాము అనడం సరైనది కాదు. మూడు సెక్టార్లు కూర్చొని మాట్లాడుకోవాలి. రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోవాలంటే జరిగిపోయేవి కావు. ముగ్గురికీ సమస్యలు ఉన్నాయి. దీనికి అంతా కూర్చుని చర్చించుకొని పరిష్కారాలు వెతకాలి.


‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా రిలీజ్ సమయంలో ఈ సమస్య తెరపైకి వచ్చింది. ఆ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. అందులో చాలా పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఇన్ని సినిమాలకు లేని సమస్య మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడే జరిగిపోవాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఇలా చేయడం కరెక్ట్ కాదు. అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందాం. సంక్రాంతి తర్వాత సరైన సినిమా లేక అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ‘పెద్ది’ (Peddi) రూపంలో ఒక మంచి సినిమా వస్తున్న సమయంలో.. ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు. సమస్య ఉంది, మేము కాదనడం లేదు. ఎగ్జిబిటర్ల సమస్యతో పాటు అన్ని సమస్యలు చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుందాం. ఏదైనా ఒక పద్దతి ప్రకారం చేసుకోవాలి. థియేటర్లను గ్రేడింగ్ చేసుకోవాలి. అన్ని థియేటర్లలో ఒకే రకమైన వసతులు ఉండవు కాబట్టి.. అన్నింటిని ఒకేలా చూడలేము. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వసతులు మెరుగు పర్చాలి. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయి. అంతేగానీ, ఎవరికి తోచినట్లుగా వారు మాటలు చెప్పడం సరికాదు’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!

రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం

పవన్ కళ్యాణ్, విజయ్‌ల విజయ రహస్యం అదే: ఆర్జే బాలాజీ

అందుకే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం లేదు- బోయపాటి శ్రీను

Updated Date - May 13 , 2026 | 07:50 PM