‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్, రశ్మికల స్పందనిదే

ABN , Publish Date - Oct 10 , 2026 | 02:49 PM

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రశ్మిక మందన్న జంటగా నటించిన భారీ పాన్-ఇండియా పీరియాడిక్ విజువల్ వండర్ ‘రణబాలి’. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు.

Nara Lokesh on Ranabaali

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రశ్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన భారీ పాన్-ఇండియా పీరియాడిక్ విజువల్ వండర్ ‘రణబాలి’ (Ranabaali). ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టి-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దసరా పర్వదినం కానుకగా అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో ట్రెండ్ అవుతూ సినీ ప్రియులను కట్టిపడేస్తోంది.


ఈ క్రమంలో ‘రణబాలి’ ట్రైలర్‌పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రశంసల జల్లు కురిపించారు. 18వ శతాబ్దపు రాయలసీమ చరిత్రను, నాటి బ్రిటిష్ కరవు నేపథ్యాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారంటూ ‘ఎక్స్’ వేదికగా చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ట్రైలర్ చూసిన అనంతరం నారా లోకేష్ స్పందిస్తూ.. ‘‘ ‘రణబాలి’ ట్రైలర్ చూశాను.. నిజంగా అదొక అద్భుతమైన అనుభూతిని అందించింది. 1800ల నాటి రాయలసీమ వాతావరణాన్ని రీ-క్రియేట్ చేయడంలో చూపించిన డిటైలింగ్ అమోఘం. నాటి బ్రిటిష్ పాలనలో ఏర్పడిన హృదయవిదారక కరవు, వారి అణచివేతను ఎంతగానో హత్తుకునేలా ఆవిష్కరించారు. రాయలసీమ నేల కోసం పోరాడే యోధుడిగా విజయ్ దేవరకొండ లుక్, ఆయన రౌద్రపూరిత నటన ఎంతో సహజంగా, అద్భుతంగా ఉన్నాయి. రశ్మిక మందన్న తన బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్‌తో చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చారు. చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఇంతటి బలమైన, నిజమైన అధ్యాయాన్ని వెండితెరకు తీసుకొచ్చిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌తో పాటు యావత్ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. అక్టోబర్ 16న విడుదలవుతున్న ‘రణబాలి’ చిత్రానికి ఘన విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.


మంత్రి నారా లోకేష్ చేసిన పోస్ట్‌పై హీరో విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘లోకేష్ అన్నా.. రాయలసీమ గడ్డ నాకు ఎంతో ఇచ్చింది. ఈ నేల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాపై ఎప్పటినుంచో ఉంది. ఆ రుణాన్ని తీర్చుకోవడానికే వచ్చిన చిత్రమిది. మీ ప్రశంసలు, మీ సందేశం మా చిత్ర యూనిట్‌లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. మన గడ్డ, మన ప్రజల పౌరుషంపై ప్రతి ఒక్కరికీ గర్వపడేలా చేసే అద్భుతమైన సినిమాటిక్ అనుభవం మీకోసం థియేటర్లలో ఎదురుచూస్తోంది. మీ ప్రేమాభిమానాలకు, ఈ అద్భుతమైన మాటలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నా’’ అంటూ ఎమోషనల్‌గా స్పందించారు.


నారా లోకేష్ పోస్టర్‌కు చిత్రంలో జయమ్మగా చేసిన రశ్మిక మందన్న కూడా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘థ్యాంక్యూ సో మచ్ నారా లోకేష్ గారు! మా సినిమాపై మీ ప్రేమకు నా కృతజ్ఞతలు. మన చరిత్రలోని ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని వెండితెరపై ఆవిష్కరించే ఇంతటి గొప్ప చిత్రంలో భాగం కావడం, ‘జయమ్మ’ పాత్రను పోషించడం నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభవం. ఈ సినిమా మా అందరికీ ఎంతో విలువైంది. మా టీమ్ మొత్తం ఎంతో ప్రేమతో, ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దింది. మీరంతా అక్టోబర్ 16న థియేటర్లలో ఈ కథను చూసి అనుభవించే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.


‘‘నారా లోకేష్ గారు.. ‘రణబాలి’ ట్రైలర్‌పై మీరు చూపిన అభిమానం, ప్రశంసలు మాకు ఎంతో విలువైనవి. ఈ చారిత్రక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో ఇష్టంతో శ్రమించాం. మీలాగే ఈ కథ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుందని గట్టిగా నమ్ముతున్నాం’’ అని.. లోకేష్‌కు మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఓ వైపు సామాన్య ప్రేక్షకులు, సినీ ప్రియులతో పాటు మరోవైపు ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి సైతం ‘రణబాలి’ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తుండటంతో చిత్ర బృందం ఫుల్ జోష్‌లో ఉంది. రాయలసీమ పౌరుషాన్ని, బ్రిటిష్ అరాచకాలను కళ్లకట్టేలా రూపొందించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

రాజమౌళి చెరిపేసిన సెంటిమెంట్స్ ఎన్నో.. ఇప్పుడు ‘వారణాసి’పై కొత్త చర్చ

రజనీకాంత్ - కమల్ హాసన్ భారీ మల్టీస్టారర్ ఆగిపోయిందా?

మోక్షజ్ఞ ఎంట్రీకి వశిష్ట మైండ్ బ్లోయింగ్ ప్లాన్

Updated Date - Oct 10 , 2026 | 02:49 PM