Nani: నేచురల్ స్టార్ నాని అసలు స్వభావం ఇదే!
ABN, Publish Date - Sep 20 , 2026 | 07:29 AM
వైవిధ్యమైన పాత్రలతో కనిపించే నాని పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న క్రమంలో... అతనితో పనిచేసిన హీరోయిన్లు పలు సందర్భాల్లో ఏమన్నారో చూద్దామా.
‘ఏష నాగుల కట్ట మీద...’ అంటూ ప్రస్తుతం దేశమంతా ఊగిపోతోంది. పూర్తిగా భిన్నమైన గెటప్‌తో, మాస్‌గా కనిపిస్తున్న నేచురల్ స్టార్ నాని ‘ప్యారడైజ్’ విడుదలకు సిద్ధమైంది. బలమైన కథలు, వైవిధ్యమైన పాత్రలతో కనిపించే నాని పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న క్రమంలో... అతనితో పనిచేసిన హీరోయిన్లు పలు సందర్భాల్లో ఏమన్నారో చూద్దామా...
సరదా మనిషి
నాని అంటే ఓ బ్రాండ్. ఆయన సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు ప్రశ్నలు అడగకుండానే ఓకే చెయ్యాలని ముందుగానే డిసైడ్ అయ్యా. ఎందుకంటే... నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడే నాని నటించిన సినిమాలు చూసేదాన్ని. అప్పటి నుంచే ఆయనని చూడాలనే కోరిక ఉండేది. పైగా నాని ప్రాజెక్ట్‌లను ఎంచుకునే విధానంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మొదటి రోజు నుంచే తను నాకు ఎంతో కాలంగా పరిచయం ఉన్నట్లనిపించింది. ఎవరితోనైనా త్వరగా కలసిపోతారు. కంఫర్ట్ లెవల్ కుదిరితే... ఆయనలోని సరికొత్త, సరదా కోణాన్ని చూడొచ్చు.
- శ్రీనిధి శెట్టి
ఫ్యామిలీ ఫ్రెండ్
తొమ్మిదేళ్ల క్రితం.. మేం మొదటిసారి కలిసి నటించాం. అప్పటికే తనకి నేచురల్ స్టార్ అనే పేరుంది. తనతో నటించడానికి మొదట్లో కొంచెం భయపడ్డా. సెట్‌పై తన టైమింగ్‌కు తగ్గట్టుగా నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. అప్పుడు ఎలా అయితే ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా, నాని వాళ్ల ఇంటికి వెళతా. ఎందుకంటే నాని ఫ్యామిలీ నాకు చాలా క్లోజ్. తన కొడుకు అర్జున్ నన్ను ‘కిట్టీ అత్త’ అని పిలుస్తాడు. బర్త్‌డేకి వాయిస్ నోట్ పంపుతుంటాడు. ఓనం రోజు కూడా నాని ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసి విషెస్ చెబుతారు. ప్రతీ ఒక్కరికీ నానిలాంటి స్నేహితుడు ఉండాలి.
- కీర్తి సురేష్
నా అదృష్టం...
నాని కేవలం డబ్బు కోసం సినిమాలు చేయడు. కంటెంట్, ప్యాషన్‌తోనే వైవిధ్యమైన స్ర్కిప్ట్‌లు ఎంచుకుంటాడు. నా మొదటి తెలుగు సినిమా నానిదే కావడం నా అదృష్టం. సెట్స్‌లో నాని ఇచ్చే కంఫర్ట్ వల్ల కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన భావన ఎప్పుడూ కలగలేదు. తనకి సినిమాలంటే పిచ్చి. షూటింగ్ బ్రేక్‌లో కూడా తన పాత్ర గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నానితో రెండు సినిమాలు చేశాను. రెండో సినిమాకు వచ్చేసరికి క్లోజ్ ఫ్రెండయ్యాడు. తనతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంటా.
- ప్రియాంక మోహన్
చాలా సపోర్టివ్...
సాధారణంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు సహనటులను పెద్దగా పట్టించుకోరు. కానీ నాని అలా కాదు. చాలా సపోర్టివ్. నానితో కలిసి నటించడం వల్ల నా పర్‌ఫార్మెన్స్ మెరుగైంది. ఇది నా సినిమా కాదు... మన సినిమా అంటూ నన్ను ఎప్పుడూ మోటివేట్ చేస్తుంటాడు. సీన్ చేసే ముందు కూడా చర్చించేవాడు. దానివల్ల సీన్ మరింత పండుతుందని అంటాడు. పరిశ్రమలో నానిలాంటి వాళ్లు ఎక్కువమంది ఉండాలి.
- మృణాల్ ఠాకూర్
నిజాయితీ నచ్చింది...
నాని నాకు మంచి స్నేహితుడు. నాకు ఇన్‌స్పిరేషన్. మా జర్నీ జెంటిల్మన్ సినిమా నుంచి మొదలైంది. ముందు తనతో నటించడం కష్టంగా అనిపించేది. ఎందుకంటే సీన్ ఇలా చెప్పగానే అలా చేసేసేవాడు. తనకు మ్యాచ్ అయ్యేలా చేయడానికి తంటాలు పడ్డా. నాని తన సినిమా కథలు, పాత్రల గురించి నాతో చర్చిస్తాడు. అలాగే నా సినిమా ఎంపికపై నిజాయితీగా అభిప్రాయం చెబుతాడు. తను మా కుటుంబంలో ఒకడిగా మారిపోయాడు. నాని నాకు అత్యంత ఇష్టమైన నటుడు అనేకంటే ఇష్టమైన వ్యక్తి అని చెప్పొచ్చేమో!
- నివేతా థామస్
ALSO READ:
బ్రేకప్ నుంచి ట్రోలింగ్ వరకు.. ఐశ్వర్య లక్ష్మి జీవితంలో ఎన్నో షాకింగ్ అనుభవాలు!
భూకబ్జా ఆరోపణలు.. నిర్మాత సి.కల్యాణ్ పై కేసు నమోదు