ఆయన సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాలపై మాట్లాడటం హాస్యాస్పదం - నాగవంశీ
ABN , Publish Date - May 14 , 2026 | 09:46 AM
ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు తెలిపారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు తెలిపారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు నిర్వహించిన మీడియా సమావేశానికి కౌంటర్ ఇస్తూ.. బుధవారం నిర్మాతలు కూడా మీడియా ముందుకు వచ్చారు. థియేటర్ల గ్రేడింగ్, మెయింటెనెన్స్ ఛార్జ్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కన్వినెన్స్ ఛార్జ్ వంటి విషయాలపై చర్చించిన తర్వాత.. అప్పుడు కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో పర్సెంటేజ్ విధానానికి వెళ్ళడంలో మాకు అభ్యంతరం లేదని అన్నారు నిర్మాత నాగవంశీ (Naga Vamsi).
ఈ సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘ఎకో సిస్టమ్‌లో ఒకరు బాగోకపోతే ముగ్గురూ బాగోరు. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ముగ్గురికీ నష్టాలు తప్పవు. మీడియా సమావేశం నిర్వహించి ఎగ్జిబిటర్ల పరిస్థితి బాలేదని చెప్పారు. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల పరిస్థితి కూడా అలాగే ఉంది. కొన్ని నెలల నుంచి చూస్తూనే ఉన్నాం. కంటెంట్ లేక శ్రీరాములు వంటి థియేటర్‌ను మూసేయాల్సి వచ్చిందని వాళ్ళే చెప్పారు. ఎగ్జిబిటర్లు ఇలాంటి షరతులు పెట్టడం వల్ల నిర్మాతల నుంచి ఇంకా కంటెంట్ తగ్గిపోతుంది తప్ప, దాని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇలా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకొని, ఫలానా తేదీ చివరి రోజు అంటూ బెదిరించినట్టుగా మాట్లాడకండి. ఇక్కడ ఉన్న నిర్మాతలవి 50 శాతానికి పైగా షూటింగ్ అయిపోయిన సినిమాలు కనీసం 25 ఉన్నాయి. వీటిలో చిన్న, పెద్ద అన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే 70-80 శాతం బడ్జెట్ ఖర్చు పెట్టి ఉన్నాము. ఇలాంటి సమయంలో కొత్త రూల్ తీసుకొస్తామంటే అది సబబుగా ఉండదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాల విషయంలో ఆ విధానాన్ని అంగీకరించలేము. కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో ఈ విధానంపై ఆలోచిస్తాము. కానీ, దానికి కొన్ని షరతులు ఉన్నాయి.
థియేటర్ల గ్రేడింగ్, మెయింటెనెన్స్ ఛార్జ్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కన్వినెన్స్ ఛార్జ్ వంటి విషయాలపై చర్చించిన తర్వాత.. అప్పుడు కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో పర్సెంటేజ్ విధానానికి వెళ్ళడంలో మాకు అభ్యంతరం లేదు. ఒక పెద్ద ఎగ్జిబిటర్, ఆయనకు 300 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆదాయానికి గండి కొడుతున్న అలాంటి ఆయన.. మీడియా సమావేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించింది. ఇతర రాష్ట్రాల్లో పర్సెంటేజ్ విధానం అమల్లో ఉందని అంటున్నారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో ఎవరి పరిస్థితి బాలేదు. వాళ్ళకంటే మనమే ఇంకా మెరుగైన స్థితిలో ఉన్నాము. అలాంటిది మనం వెనక్కి వెళ్లడం ఎందుకు?. ఎగ్జిబిటర్ ఎంత ముఖ్యమో, డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే ముఖ్యం కదా. అలాంటిది డిస్ట్రిబ్యూటర్‌ను చంపేసి, ఎగ్జిబిటర్‌ను కాపాడాలి అనడం ఎంతవరకు కరెక్ట్?. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మెరుగైన వసతులు కల్పిస్తే.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చపై మధుర శ్రీధర్
అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్
Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!
రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం